Thursday, November 13, 2014

ఆరుద్ర చూపించిన మహాబలిపురం


 దేశభక్తిని చూపించే విధానాల్లో గతవైభవ స్మరణం అనేది కూడా ఒకటి. ఆ విధంగా ఒకప్పటి మన చరిత్రను స్మరించుకొని, ఆ వైభవాన్ని పదే పదే కీర్తించి, ప్రస్తుత పరిస్థితులనుంచి మరింత అభివృద్ధి సాధించే విధంగా జాతిని ఉత్తేజపరచడానికి ఇది ఉపయోగిస్తుంది. 

ముఖ్యంగా మనదేశంలో విదేశీపాలనలో మగ్గిపోతూ సాంస్కృతికంగానే కాక మానసికంగా కూడా విదేశీభావజాలానికి దాసులవుతున్న జాతిని మేల్కొలిపి పురాతన వైభవాన్నిఎత్తిచూపించి స్ఫూర్తి కలిగించడానికి ఈ అంశం ఎంతగానో ఉపయోగపడింది.  మన కావ్యాలలోను, ఆధునిక పద్య వచన కవితలలో ఇలా పురావైభవాన్ని చాటేవి ఎన్నో ఉన్నాయి. వేల సినిమా పాటలు వచ్చినా ఈ విధమైన పద్ధతిలో రాసిన గేయాలు చాలా తక్కువ. సినీకవులు- ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అంటూ రామప్ప సౌందర్యాన్ని కీర్తించినా, శిలలపై శిల్పాలు చెక్కినారూ మనవారు సృష్టికే అందాలు తెచ్చినారూ అని మెచ్చుకున్నా, ఇదే చంద్రగిరి శౌర్యానికి గీసిన గిరి అంటూ రాయలవారి పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన ప్రాంతాన్ని ప్రశంసించినా, ఆడవే ఆడవే అంటూ ఆంధ్రదేశంలోని నదీమతల్లులను స్తుతించినా అన్ని సినిమా పాటలను ప్రజలు మనసారా మెచ్చారు. సూపర్ డూపర్ హిట్లు చేసారు. నలభై ఏళ్ళయినా వాటిని పునశ్చరణ చేసుకుంటూనే ఉన్నారు.

అదిగో...........

అలాంటి చారిత్రాత్మకస్థలాన్ని వర్ణించే మరో గొప్ప పాటే ఈ -"మహాబలిపురం మహాబలిపురం "అనే పాట. ముళ్ళపూడి వెంకటరమణ, బాపుగారి రాత, తీతలతో కలబోసుకున్న  బాలరాజు కథ కోసం ఈ పాట రాసారు ఆరుద్ర.

బాలరాజు అనే పది, పన్నెండు సంవత్సరాల చిన్నకుర్రవాడు బాలరాజు.  మహాబలిపురం ప్రాంతానికి వచ్చే యాత్రికులకు ఆ ప్రాంత విశేషాలను చూపించే ఒక గైడ్. వయసుకి చిన్నవాడే అయినా చెల్లిని, మేనమామ సంసార బాధ్యతను నెత్తిన వేసుకుని చలాకీగా హుషారుగా తిరుగుతూ తనకు తెలిసిన విశేషాలన్నీ ఎంతో ఆసక్తి కరంగా అందరికీ వివరిస్తూ ఆకట్టుకునే పెద్దమనసున్న చిన్నవాడు.

అతని నోటివెంట వచ్చే ఈగీతం మహాబలిపురం విశేషాలను కమనీయంగా వివరిస్తుంది. శిలలు శిల్పాలుగా మారి మామళ్ళపురంలో కొలువై మనకి చెప్పే అనేక విశేషాలను బాలరాజు పాటద్వారా మనకు చూపించారు ఆరుద్ర.
తమిళనాడులోని  చెన్నపట్టణానికి (చెన్నై నగరానికి) సుమారు 50 కిమీ. దూరంలో  ఉంది మహాబలిపురం.
దక్షిణభారతదేశంలో  ఎక్కువకాలం, ఎక్కువభాగాన్ని పరిపాలించిన చక్రవర్తులు పల్లవరాజులు.
కేవలం యుద్ధాలు, సైన్యసమీకరణలు, మత ప్రచారాలు అనే రాజధర్మంమాత్రమే కాకుండా ప్రజలలో కళాభిరుచిని గుర్తించి ప్రోత్సహించి, స్వధర్మంతో పాటు పరధర్మాన్ని అనుసరించేవారిని కూడా సమానంగా ఆదరించిన గొప్ప సంస్కృతి పల్లవులది.

మహాబలిపురం అనే స్థలం పేరుకి ఓ చరిత్ర ఉంది. పల్లవులకాలానికి ముందు ఈ ప్రాంతాన్ని మహాబలిపురం అని పిలిచేవారు. బలిచక్రవర్తి పరిపాలించిన స్థలంగా ఈ ఊరుపేరు వచ్చింది. అయితే పల్లవరాజులు ఈ ప్రాంతాన్ని గొప్ప శిల్పకళా తోరణంగా తీర్చడంతో పాటు ఈ ప్రాంతానికి పేరును కూడా మార్చారు. పల్లవ చక్రవర్తి మహేంద్రవర్మ, అతని కుమారుడు నరసింహవర్మ ఈ మామల్లపురం శిల్ప జగత్తుకు శ్రీకారం చుట్టారు. మామల్ల పురం అనే పేరుతో పల్లవుల కాలంలో ఈ ఊరు ప్రసిద్ధి చెందింది.  పల్లవరాజు నరసింహవర్మగొప్ప యోధుడు. అతనికి మామల్ల అనే బిరుదు ఉండేది. అతని బిరుదు పేరుమీద ఈ ఊరును మామల్ల పురం అని పిలిచారు.
ఈ చోటును పరిచయం చేస్తూ ఆరుద్ర తొలి పల్లవి ఇలా రాసారు-

మహా బలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు  - ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు.

మహాబలిపురం దగ్గర శిలలను శిల్పాలుగా మార్చి మరో గొప్ప కళా ప్రపంచాన్నే ఆవిష్కరించారు పల్లవరాజులు . సుమారు 5వ శతాబ్దంనుంచి 9వ శతాబ్ది వరకు పల్లవ ప్రాభవం దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. పల్లవ చక్రవర్తులలో మహేంద్రవర్మ, నరసింహవర్మలు గొప్ప కళాహృదయులు. వీరి కాలంలో దక్షిణభారతదేశంలో దేవాలయ వాస్తుశిల్పం ఉచ్ఛ స్థితిని అందుకొంది. గొప్ప గోపురాలతో కూడిన ఆలయాలు నిర్మించబడ్డాయి. వారిలో రెండవ నరసింహవర్మ కళాహృదయానికి నిదర్శనంగా మహాబలిపురంలో సాగరతీరాన వెలసిన గొప్ప కళా ప్రదర్శనశాల (Open Art museum) - ఈ మహాబలిపురం.

కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచి రేవు పట్నంగా మలిపించాడు
తెలుగు సీమ శిల్పుల్నీ రప్పించాడు
పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు

పల్లవుల రాజధాని సమీపంలో ఉన్న   కంచి. శ్రీలంక, పశ్చిమాసియా దేశాలతో వర్తకవాణిజ్యాలన్నీ  మామళ్ళపురం  రేవుపట్టణం ద్వారానే జరిగేవి.  సముద్రతీరంలోని ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉండేది.   పల్లవులు ఆకాలంలో తమిళదేశంలో ప్రధానంగా స్థిరపడినా అటు ఆంధ్రదేశం సరిహద్దులవరకు వారి సామ్రాజ్యాన్ని విస్తరించారు. మామళ్ళపురంలో అద్భుతమైన కళాజగత్తును ఆవిష్కరించడానికి నిర్ణయించాడు నరసింహవర్మ. ఇందుకోసం తమిళనాడులోనే కాక, తెలుగు సీమ నుంచి కూడా ఎందరో శిల్పకారులను నియోగించాడు.

పాండవుల రథాలనీ పేరు పడ్డవీ
ఏకాండీ శిలలనుండి మలచబడ్డవీ
 వీటిమీద బొమ్మలన్నీ వాటమైనవి
తాము సాటిలేని వాటిమంటూ చాటుతున్నవీ

మహాబలిపురంలో చాలా విశేషంగా చెప్పవలసిన శిల్పం రాతిరథాల నిర్మాణం. పెద్ద పెద్ద శిలలను గొప్ప రథాకృతిలో తీర్చి దిద్దడం. కొయ్యతో చేసిన రథాలకు బదులు రాతితో చెక్కిన ఈ రథాలు అప్పటి శిల్పకళకు తార్కాణాలుగా నిలుస్తాయి. ఇక్కడ పంచపాండవుల పేరుతో చెక్కిన పాండవుల రథాలు చాలా పేరు పొందాయి. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులతో పాటు వారి భార్య ద్రౌపది పేరుతో ఈ రథాలు చెక్కబడ్డాయి. ఒక్కో రథంలోను ఒక్కొక్క భిన్నమయిన శిల్పకళారీతులను ఆవిష్కరించారు శిల్పులు.


ధర్మరాజు రథం
భీమరథం
అర్జునుడిరథం








 




సహదేవరథం


మహాబలిపురంలో ఆరుబయటే ఈ శిల్పాలన్నీ కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పెద్ద శిలమీద ఒక్కో దృశ్యం మనసును రంజింపచేస్తుంది. ఏడవ శతాబ్దిలోనే దక్షిణ భారతదేశంలో  ఉత్తమస్థాయికి పరిణతి చెందిన శిల్పకళ పరిఢవిల్లిందని తెలియజేస్తాయి.  అందుకే ఆ బొమ్మలన్నీ వాటమైనవి. అవి ప్రపంచంలోనే గొప్పగా నిరూపించుకోగలిగే స్థాయికి చేరుకున్నాయి. ఆ విషయాన్నే ఈ బొమ్మలు చాటి చెప్తున్నాయి అంటారు ఆరుద్ర.

మహిషాసుర మర్దనం
 గోవర్థనమెత్తడం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం
పురాణాల ఘట్టాలూ పొందు పర్చిరీ
ముచ్చటగా కన్నులకూ విందునిచ్చిరీ

మహాబలిపురంలో శిల్పాలకు ఆధారం ఎక్కువగా భారతీయ పురాణగాథలు. పల్లవరాజు మహేంద్రవర్మ జైనమతం నుంచి హైందవమతానికి మారాడు. అందుకే ఇప్పటి శిల్పాలన్నీ శివుడు, విష్ణువు, గణపతి మొదలైన హిందూ పురాణాలకు చెందినవిగా కనిపిస్తాయి. ఒక్కొక్క శిలమీద ఒక్కొక్క పురాణఘట్టం రూపుదిద్దుకుంది.  భారత, భాగవతాలలో వర్ణించబడిన ఘట్టాలనే ప్రధానంగా చెక్కారు. రాక్షస సంహారిణి మహా దుర్గ చేసిన మహిషాసుర మర్దనం ఒక శిలమీద రూపుదిద్దుకుంటే,  మరొక శిల్పంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తనను ఆశ్రయించిన సకల గోబాలక ప్రపంచాన్ని సంరక్షించాడు చిన్నికృష్ణుడు. వరాహ అవతారం దాల్చిన మహావిష్ణువు కథను మరొక శిల్పం చూపుతుంది. ఇలా ఎన్నో పురాణ గాథలు  శిల్పాలపై పొందు పరిచి మన కళ్ళకు విందు చేసారు ఆ శిల్పులు.

వీనులకు విందు చేయడం అనేది జాతీయం. పాట వరుసకోసం వేసిన పొందు పర్చిరీ కి ప్రాస కోసం కళ్ళకు విందునిచ్చిరీ అనడం ఆరుద్రీయం.

    మహిషాసుర మర్దనం
                                               శ్రీకృష్ణుడు  గోవర్ధన పర్వతం ఎత్తడం
                                                      వరాహావతారం ఘట్టం
మహాబలిపురం శిల్పాల్లో కనిపించే పురాణఘట్టాలు ఇవి.

పాశుపతం కోరెనూ పార్ధుని మనసూ
పరమశివుని కోసమూ చేసెను తపసూ
సృష్టంతా కదలి వచ్చి చూడసాగెనూ
ప్రతిసృష్టి ఈ శిల్పమనీ పేరు వచ్చెనూ

పురాణ ఘట్టాలను పొందుపరిచిన మహాబలిపురం శిల్పజగత్తులో ప్రముఖమైన శిల్పం అర్జునుడి తపస్సు(గంగావతరణం?).
 అర్జునుడి తపస్సు (ఆ భంగిమ చెప్తుంది ఎంత తీవ్రమయిన తపమో అది)

 ఈ వింతను చూడడానికి వచ్చిన వాటి సృష్టి ఈ శిల్పంలోనే. కుడివైపున భూమిమీద కనిపించే అనేక రకాల జీవజాలం,ఎడమపక్కన హిమాలయాలు, ప్రమధగణాలు, దేవతామూర్తులు, యక్షకిన్నెర కింపురుష జాతులు, సిద్ధులు అందరూ ఈ శిల్పంలో కనిపిస్తారు.

పాండవులు మాయా జూదంలో కౌరవుల వద్ద ఓడిపోయారు. కౌరవులను జయించే దీక్షతో తపస్సు చేసాడు అర్జునుడు. ముందు దేవేంద్రుడికోసం తపస్సు చేసాడు. కౌరవులను ఓడించడానికి శక్తి కావాలన్నాడు. పరమేశ్వరుని దయతోనే అది సాధ్యం అవుతుందని దేవేంద్రుడు చెప్పాడు. అప్పుడు పరమశివుని కోసం తపస్సు చేసాడు అర్జునుడు. అది అత్యంత ఘోరమైన తపస్సు. మనోవాక్కాయకర్మల శుద్ధిగా జీవించి, ఆత్మార్పణ చేసుకుంటే భగవంతుడు మనకు అన్ని శక్తులను ప్రసాదిస్తాడని ఈ శిల్పం వివరిస్తుంది. 

అత్యంతనైపుణ్యంతో తయారైన గొప్ప శిల్పకళ - మహాబలిపురంలోని అర్జునుడి తపస్సు పేరుతో వెలసిన బృహత్ శిల్పం. అర్జునుడు చేస్తున్న ఘోరమైన తపస్సు  దేవతలనే కాదు, సృష్టిలోని జీవులన్నిటినీ సంభ్రమానికి గురిచేసింది. ఆ శిల్పాన్ని గురించి ఆరుద్ర ఇలా  అంటారు. అర్జునుడి భీకరమైన తపస్సుకి ఈ శిల్పం ప్రతి సృష్టి అనే ఒక్క మాటతో  అద్భుతంగా ఆ శిల్పంలోని గొప్పదనాన్ని చూపిస్తారు ఆరుద్ర. ఈ అర్జునుడి తపస్సు రెండు పెద్ద శిలలపై చెక్కబడింది. ఈ శిల్పాన్నే గంగావతరణం శిల్పం అని కూడా అంటారు. తపస్సుచేసే అర్జునుడి స్థానంలో భగీరథుడిని ఊహించి గంగావతరణం సమయంలో సృష్టి అంతా ఏవిధంగా ఆశ్చర్యపడి నిలిచిందో ఇక్కడ చెక్కబడింది అని కొందరి ఊహ. ఎలా ఊహించినా ఆత్మ నిగ్రహంతో ఉండి,  భగవంతుడినే సర్వస్వంగా నమ్మితే కార్యసిద్ధి జరుగుతుందని ఈ శిల్పం సందేశంగా భావించవచ్చు.





సంద్రంలో కలిసినవి కలిసిపోయెనూ
ఒంటరిగా ఈ కోవెలా మిగిలిపోయెనూ
దేవుని పాదాలు కెరటాలు కడుగును నిత్యం
మనుషుల పాపాలు ఇవి చూడ తొలగును సత్యం సత్యం



వందల సంవత్సరాలు గడిచిపోయాయి. రాజులు పోయారు. వారి రాజ్యాలు పోయాయి. కాలంలోను, ప్రకృతిలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సముద్రతీరంలో ఉన్న ఈ శిల్పకళ అంతా ఈ మార్పులను ప్రతినిత్యం  అనుభవిస్తూ వచ్చింది. సాగరం ముందు ముందుకు జరుగుతూ కొద్ది కొద్దిగా దేవాలయాన్ని తనలో లీనం చేసుకుంటూ ఉంది. గొప్ప ప్రాకారాలు, ఎన్నో గొప్ప శిల్పాలు అన్నీ సముద్రంలో మునిగిపోయాయి. విదేశీ యాత్రికుడు మార్కోపోలో మామళ్ళపురం వర్ణనలో ఏడు గొప్ప పగోడాల గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక గోపురం వాటి అవశేషమే. మిగిలివున్న దేవాలయం మాత్రం జరిగిన సంఘటనలకు మూగ సాక్ష్యంగా ఇక్కడ నిలిచి ఉంది. ఎంతో గొప్ప శిల్పకళ సముద్రం పాలయిపోగా దేవాలయం మాత్రమే మిగిలింది అనే బాధను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెనూ అంటూ చెప్పారు. 

 సముద్రం ఒక్కొక్క అడుగూ ముందుకు జరుగుతూ చివరికి ఆ కోవెలలోని మూలవిరాట్టుని తాకేవరకు వచ్చింది. అందుకే ప్రకృతి ధర్మంగా  ప్రతినిత్యం జరుగుతున్న ఈ చర్యను - "దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం" అంటూ  సముద్రం ఆ దేవుడికి చేసే సేవగా  వర్ణించి విషయాన్ని తేలిక చేసారు ఆరుద్ర.

చివరగా " మనుషుల పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం "అన్న మాటను ఆధ్యాత్మికమైన సందేశంగా కాక కళాత్మకమైన సందేశంగా భావించవచ్చేమో. కళను దర్శించి అందులో లీనమైనప్పుడు ప్రేక్షకుడిలో రసానందం కలుగుతుంది. అదే బ్రహ్మానందం అన్నారు విమర్శకులు. అలాంటి మానసిక స్థితి మనసులోని మలినాన్ని పోగొట్టి స్వచ్ఛంగా చేస్తుందని అటువంటి రసానందం ఇచ్చేదే గొప్ప కళ అని చెప్పారు భారతీయ లాక్షణికులు. ఈ మహాబలిపురం చూసాక కలిగే అనుభూతి కూడా రసానందమే అని అదే మనుషుల్లోని పాపాలని కడిగేయగల బ్రహ్మానందస్థితిని కలిగిస్తుందని అని  ఆరుద్ర భావించారు. అందుకే అదే సత్యం సత్యం అని నొక్కి చెప్పారు.

భారతీయ కళాజగతికి గొప్ప గోపురంగా మహాబలిపురం గొప్పదనాన్ని  మూడు నిముషాల పాటలోకి కుదించి  పాటగా అందించిన ఆరుద్ర ఇంకా మరెన్నో చక్కని పాటలను ఈ చిత్రానికి అందించారు. 

ఒకనాటి చారిత్రక జ్ఞాపకాన్ని పదికాలాలు పచ్చగా  పదిలపరిచారు ఈ బాలరాజు కథ చిత్రంతో. అప్పటి మహాబలిపురం గ్రామాన్ని, పరిసరాలను గొప్ప శిల్పాలను అందంగా, ఆహ్లాదంగా చిన్న పిల్లల ఆటపాటలతో సందడిగా చిత్రించిన దర్శకుడు బాపు,   చక్కని హాస్యంతో, వర్తమాన సమాజ స్థితిపైన  చురుక్కనిపించే వ్యాఖ్యలతో,  చిన్నపిల్లల పాత్రలను కూడా చక్కని వ్యక్తిత్వంతో తీర్చి ఇంచక్కని కథ అందించిన ముళ్లపూడి,  చిత్ర దర్శకుడు బాపు   కలిసి తెలుగు సినీ కళా మారాణి కిరీటంలో పెట్టిన  ఓ కలికి తురాయి బాలరాజు కథ. 
















Wednesday, December 25, 2013

ధరణి నోము పండించిన ధనుర్మాసం



ధరణి నోము పండించిన ధనుర్మాసం

భారతీయ జ్యోతిశ్శాస్త్రం ప్రకారం మనకి  పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఈ పన్నెండు రాశులలోను ప్రతినెలా ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ఒక రాశిలోనుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడమే సంక్రమణం. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. అయితే తెలుగువారిది చంద్రమానం. అంటే మనం చంద్రకళల ఆధారంగా రోజులని లెక్కవేసుకుని చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర పౌర్ణమి నాడు కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరుతో ఆనెలని పిలుస్తాము. సౌరమానం ప్రకారం  సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో ఆనెలని పిలుస్తారు. 

సూర్యగమనాన్ని ఉత్తరాయనం, దక్షిణాయనం అంటారు. అయనం అంటే ప్రయాణం. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. తమిళులది సూర్యమానం. సూర్యుని గమనం ప్రకారం వారి నెలల లెక్క ఉంటుంది. అందుకే మృగశిర నక్షత్రం పేరుమీద మార్గశిరం అని తెలుగువారు పిలిచే నెలలోనే ఈ ధనుర్మాసం వస్తుంది. ధనుస్సు రాశి నుండి మకరరాశికి సంక్రమించే వరకు సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అనే పేరుతో పిలుస్తారు తమిళులు.

 వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం అతి పవిత్రమైనది. ఈ మాసాన్ని మార్గళి అనే పేరుతో పిలుస్తారు ఈ ధనుర్మాసం అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆంధ్ర, కన్నడ, తమిళ ప్రాంతాలలో ఈ ధనుర్మాసాన్ని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారు. తెలుగువారు ఈ ధనుర్మాసాన్ని నెలపట్టడం అంటారు. 

 ధనుర్మాస వ్రతం ప్రసక్తి పురాణాలు

శ్రీ మహావిష్ణువు అవతార పురుషుడు. ఒక్కో అవతారంలో ఒక్కో పేరు. అలాగే ఈ ధనుర్మాసంలో స్వామివారిని మధుసూదనుడుగా పిలిచి ఆరాధిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన దగ్గరనుంచి, మకరరాశిలో ప్రవేశించే భోగి రోజు అంటే సంక్రాంతి ముందురోజు వరకు  ధనుర్మాసంలో నెలరోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరింస్తారు వైష్ణవులు. ధనుర్మాసం ప్రసక్తి మన పురాణాలలో బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లోని, నారాయణ సంహితలో, భాగవతంలో ఉంది. బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించడంలో తెలుస్తుంది.

ధనుర్మాస వ్రతం - విధి విధానాలు

ధనుర్మాస వ్రతం చేయాలనుకునేవారు బంగారంతోకానీ, వెండితోగాని శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తయారు చేయించి పూజకోసం సిద్ధం చేసుకోవాలి. ఈ రెండు లోహాలు కాకపోతే శక్తిమేరకు పంచలోహాలతో కానీ, రాగితోకానీ చేయించుకోవచ్చు. ఆ విష్ణువు విగ్రహాన్ని మధుసూదనుడు అనే నామంతో వ్యవహరించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి అయిదు ఘడియలముందుగా నిద్రలేచి తలారా స్నానం చేసి నిత్యపూజలు ముగించాక ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.
ముందుగా మధుసూదనస్వామిని ఆవుపాలతోను, పంచామృతాలతోను, కొబ్బరి పాలతోనూ అబిషేకం చేయాలి.  అభిషేకం చేయడానికి శంఖం ఉపయోగించడం శ్రేష్ఠం. అభిషేకం చేసే ద్రవ్యాలను ముందుగా శంఖంలో నింపుకొని ఒక్కొక్క ద్రవ్యంతో విగ్రహాన్ని అభిషేకించాలి. తులసీ దళాలు, ఇంకా పుష్పాలతో స్వామివారిని శత, సహస్ర నామాలను జపిస్తూ పూజించాలి.

 మొదటి పదిహేను రోజుల పాటు స్వామికి  ప్రతిరోజూ చక్కెర పొంగలిని లేదా, బియ్యం, పెసరపప్పు కలిపి వండే పులగం గానీ నైవేద్యంగా సమర్పించాలి.  నెలలో తర్వాతి పదిహేనురోజులు దధ్యోదనం (పెరుగన్నం) నివేదించాలి. ధూపం, దీపం, దక్షిణ, తాంబాబూలను సమర్పించి నమస్కారాలు చేయాలి. స్వామివారితో పాటు ఆయనకి ఎంతో ప్రియమైన  తులసిని కూడా పూజించాలి. ధనుర్మాసం అంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను వింటూ ఆ స్వామివారి సన్నిధిలో గడపాలి. నెలరోజుల పాటు చేయవలసిన ఈ వ్రతంలో ఏదైనా కారణం వల్ల 30 రోజులు చేయలేని వారు, పదిహేను రోజులు కానీ, 8 రోజులు కానీ, 6 రోజులు కానీ కనీసం 4 రోజులు కానీ చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ అదీ సాధ్యంకాకపోతే కనీసం ఒక్క రోజయినా ఈ వ్రతాన్ని  మనస్ఫూర్తిగా ఆచరిస్తే కూడా ఫలితం పొందుతారని పెద్దలు చెబుతారు.
మధూసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ పండితులకి దానం ఇవ్వాలి. ఆ దానాన్ని స్వీకరించే పండితుడు ఇందిరా ప్రతి గృహ్ణాతు అంటూ ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీస్సును పొందడం ద్వారా సాక్షాత్తూ ఆ మధుసూదన స్వామివారే పండితుడి రూపంలో సకల వాంఛలూ సిద్ధింపజేసే అమోఘ ఆశీర్వచనం దయచేస్తాడని ఆశిస్తారు. ఒక్కరోజయినా ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ఆచరిస్తే ఇహపర మోక్ష సాధనతో పాటు వేయి సంవత్సరాలపాటు దేవతారాధన చేసిన ఫలితం కూడా లభిస్తుందని వేదపండితులు భావిస్తారు.



ధనుర్మాసం - గోదాదేవి

ధనుర్మాసానికి ఆద్యురాలిగా పిలవబడే గోదాదేవి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందడానికి చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. గో అంటే జ్ఞానం అనీ, ద అంటే ఇచ్చునది అని గోదాదేవి జ్ఞానాన్ని ప్రసాదించేది అని ఈ పదానికి వ్యుత్పత్తి చెప్తారు పండితులు.  తాను ధరించి స్వామికి మాలను ఇచ్చిన కన్య గా ఈ గోదాదేవి చూడికుడుత్త నాంచారి గా ప్రసిద్ధి పొందింది. ఈ గోదాదేవి గాధనే శ్రీ కృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద (మాలను ధరించి విడిచి  స్వామికి ఇచ్చినది )అనే గొప్ప వైష్ణవ మత ప్రబోధ ప్రబంధంగా రచించాడు.  గోదాదేవిని సాక్షాత్తూ భూదేవి అవతారంగా భావిస్తారు.  ఆండాళ్, కోదై అనే పేర్లు కూడా గోదాదేవి పేర్లే.

ఆ శ్రీ మహావిష్ణువు గొప్పదనాన్ని కీర్తిస్తూ, ప్రపంచానికి శాంతి సౌఖ్యాలను చేకూర్చాలని ఆశిస్తూ రోజుకొక్కటి చొప్పున ముప్ఫయి కీర్తనలతో   గోదాదేవి స్వామిని ఆరాధించింది. ఈ కీర్తనలను పాశురాలు అంటారు. నాలుగు వేదాల సారాన్ని క్రోడీకరించి గోదాదేవి గానం చేసిన ఈ పాశురాలన్నీ దివ్యగాన ప్రబంధంగా తిరుప్పావై అనే పేరుతో శ్రీ వైష్ణవులు పాడతారు. తిరు అంటే శ్రీ అని అర్ధం. పావై అంటే పాటలు అని గానీ వ్రతం అని గానీ అర్థం. భగవంతుడిని భర్తగా ఆశిస్తూ చేసిన వ్రతాన్ని వివరించే పాటలతో కూడినది తిరుప్పావై. ఇందులో 30 పాశురాలు ఉన్నాయి. పాశురాలు ఛందోబద్ధంగా ఉండే గీతాలు. కేవలం భగవంతుడి లీలా విలాసాన్ని వర్ణించడమే కాకుండా ప్రకృతిలోని అద్భుతమైన అంశాలెన్నిటినో పాశురాలు వివరిస్తాయి.  చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే ప్రకృతి కూడా మానవుడికి అనుకూలంగా మారుతుందని, మనిషి జీవితంలో శాంతి సౌబాగ్యం నిండుగా ఉంటాయని ఈ పాశురాలు వర్ణిస్తాయి. చివరి పాశురాల్లో ఈ పాశురాలను తాను రచించి పాడానని, వీటిని గానం చేసినవారికి భగవంతుడి కటాక్షం కలిగితీరుతుందని చెప్తుంది గోదాదేవి. తిరుపతిలోని శ్రీనివాసుడికి ప్రతిదినమూ వినిపించే సుప్రభాతానికి బదులుగా ఈ ధనుర్మాసం నెలరోజులూ తిరుప్పావైలోని పాశురాలనే ఆలాపన చేస్తారు. పన్నెండుమంది ఆళ్వారులలో ప్రముఖస్థానం గోదాదేవిదే.

 కాత్యాయనీ వ్రతం – శ్రీ వ్రతం

 శ్రీ మహావిష్ణువులాంటి చక్కని అందమైన ప్రేమించే భర్త రావాలని కోరుకుంటూ కన్నెపిల్లలు కాత్యాయనీ వ్రతం చేస్తారు. రాహుకేతువుల దోషం వలన వివాహం ఆలస్యమైన కన్యలు త్వరగా వివాహం జరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  కృత్తికానక్షత్రంతో కలిసిన మంగళవారాలు ఈ వ్రతానికి శ్రేష్ఠమైనవని అంటారు. అందుకే సుబ్రహ్మణ్యషష్ఠనాడు  ఈ వ్రతం చేస్తారు కొందరు. కలశం పెట్టి శక్తిని బట్టి బంగారు లేదా పసుపు కొమ్ములతో మంగళసూత్రాలను తయారుచేసి కలశానికి అలంకరిస్తారు. ఏడు చెరుకుముక్కలు, ఏడు అప్పాలతో నైవేద్యం పెట్టి వ్రత కథను విని అక్షింతలు వేసుకుంటారు. ఈ విధంగా  ఏడు మంగళవారాలు వ్రతం చేసాక 8వ వారం ఉద్యాపన చేస్తారు. ఏడుగురు ముత్తయిదువలకి తలంటుపోసి, కొత్త చీరలు, ఏడు అప్పాలు, ఏడు చెరుకుముక్కలు వాయనం ఇచ్చి వారితో ఆశీర్వచనం పొందుతారు.

కాత్యాయని కథ

 కాత్యాయని అంటే పార్వతీదేవి. సతీదేవిగా దేహత్యాగంచేసిన అమ్మవారు హిమవంతుడి పుత్రికగా పార్వతిగా జన్మించింది. పరమేశ్వరుడిని భర్తగా కోరి తపస్సుచేసి అతనిని పొందింది.హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని అందువల్ల కతి పుత్రికగా కాత్యాయనిగా పిలువబడుతుంది పార్వతీదేవి. శివుడిని ఆశ్రయించిన కుజుడి వలన సతీదేవిగా అతనికి దూరమైన దేవి కుజుడు శివుడిని వీడిన తర్వాత పార్వతిగా అతన్నిచేరింది. అందుకే కాత్యాయని వ్రతం చేసి కుజదోషం పోగొట్టుకుని చక్కని భర్తను పొందాలని కన్నెపిల్లలు ఈ వ్రతం వలన ఆశించే ఫలితం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలలో ఈ కాత్యాయనీ వ్రతం చేస్తారు.
ఈ కాత్యాయనీ వ్రతంతో గోపికలు శ్రీ కృష్ణుడిని పొందారని, తాను కూడా శ్రీ రంగనాథుడిని పొందడానికి  ఆండాళ్ ఈ వ్రతాన్నే విభిన్నంగా ఆచరించింది. పాశురాల గానంతో పూజించింది. చివరకు ఆయనని వివాహమాడింది. అందుకనే ఈ ధనుర్మాసంలో శ్రీవ్రతం పేరుతో చేసే పూజలు ఆండాళ్ వ్రత విధానాన్నే సూచిస్తాయి. తిరుప్పావై పాశురాలలో ఈ శ్రీ వ్రతం ఆచరణ వివరించబడింది. ఈ వ్రతాన్నే పావైనోంబు అని అంటారు. తమిళనాడులో  ధనుర్మాసంలో గోదాదేవి కల్యాణం చేస్తారు. వేకువజామునే నిద్రలేచి తలస్నానం చేసి స్వామివారి కీర్తనలను క్రమం తప్పకుండా పాడడం, పేదలకు దానధర్మాలు చేయడం, పండిత సత్కారం చేయడం ఈ తిరుప్పావై వ్రతం చేసేవారు చేయవలసిన విధులు. అలాగే స్వామివారికి చక్కెర పొంగలి లేదా, పప్పు పొంగలి నైవేద్యాలు, ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజించడం కూడా ఈ వ్రతంలో ముఖ్యమైనది.  వైష్ణవాలయాల్లో తిరుప్పావై ని ప్రతిరోజూ తెల్లవారుఝాము ఘడియల్లో ఆలపించడం, నగరవీధుల్లో సంకీర్తనలు చేస్తూ తిరగడం, స్వామికి ఘుమఘుమలాడే నేతి  ప్రసాదాలను నైవైద్యంగా అందించి వాటిని మాత్రమే భుజించడం ఈ ధనుర్మాసంలో విశేషాలు.





తెలుగునాట  గొబ్బిపాటలు

ధనుర్మాసం ఆరంభంతోనే సంక్రాంతి పండుగ సంబరాలు కూడా మొదలవుతాయి తెలుగు ఇళ్ళలో. సూర్యుడు ధనుస్సు రాశినుంచి మకరరాశికి సంక్రమణం చేసే రోజు సంక్రాంతి. ధనుర్మాసం నుంచి సంక్రాంతి ప్రవేశించేవరకు తెల్లవారుఝాములోనే లేచి కళ్లాపి జల్లి ముంగిళ్ళలో అందమైన ముగ్గులు వేసి రంగు రంగుల పూలతో అలంకరించిన ఆవుపేడతో గొబ్బిళ్ళు పెడతారు. సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బడ్నియ్యవే అంటూ పాటలు పాడతారు. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి ప్రతిరూపం. సంక్రాంతి రోజు సాయంత్రం సందెగొబ్బెమ్మ పేరంటం పిలుచుకుని అందరికీ వాయనాలు ఇస్తారు. 



తెలుగునాట ధనుర్మాసం తెచ్చే సందడిలో ముగ్గులూ గొబ్బెమ్మలతో పాటు చెప్పుకోవలసిన ముఖ్యమైన విశేషాలు ఇంటింటికీ రంగురంగుల వస్త్రాలను కప్పుకుని వచ్చే గంగిరెద్దులు
 అలాగే ముచ్చటైన వస్త్రధారణతో చేతిలో చిడతలు తట్టుకుంటూ, కృష్ణార్పణం చేస్తూ భిక్షను స్వీకరించే హరిదాసులు చేసే  భగవన్నామ స్మరణతో ధనుర్మాసం ఎంతో ముచ్చటగొలుపుతుంది.
                            


ధనుర్మాసం – పండుగలు పర్వదినాలూ


ధనుర్మాసంలో వచ్చే గురువారాలు చాలా పవిత్రమైనవి శుభప్రదమైనవి. మార్గశిరమాసం మహా విష్ణువుకు ఎంతో ప్రీతి అని చెప్తారు. భగవద్గీత విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షాహం అని చెప్పబడింది. మార్గశిరమాసం గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆమె కటాక్షం పొందాలి. లక్ష్మీపూజ విధానంలోనే ఈ వ్రతం కూడా చేయాలి. అయితే మార్గశిరమాసంలోని నాలుగు గురువారాలతో పాటు, పుష్యమాసంలోని ఐదవ గురువారం కూడా లక్ష్మీ పూజ చేయాలి. ఈ వ్రతానికి నైవేద్యం కూడా భిన్నమైనవి. మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, ఐదవ వారం అంటే  పుష్యమాసం లోవచ్చే  మొదటి గురువారం నాడు  పూర్ణం కుడుములు నైవేద్యం పెట్టాలి. 

మార్గశిర శుద్ధ షష్టినాడు సుబ్రహ్మణ్య షష్టి..కుమారస్వామి తారకాసురుడిని సంహరించి లోకాలను కాపాడిన పర్వదినం.

ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం.  దీనిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని స్వర్గద్వారం అనీ పేర్లతో పిలుస్తారు. ఆరోజు విష్ణుమూర్తి ఉత్తరం దిక్కున తన వైకుంఠ ద్వారాన్ని  తెరిచి తన గరుడ వాహనం పై ముక్కోటి దేవతలతో సహా వచ్చి దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఒక్క ఏకాదశే ముక్కోటి ఏకాదశులకి సమానమైన ఫలితాన్నిస్తుందని అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అమృతాన్ని మధించగా వచ్చిన హాలాహలాన్ని శివుడు ఈరోజే తన కంఠంలో ధరించాడని పురాణాలు చెబుతాయి.  వైకుంఠ ఏకాదశినాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడని అందుకనే దాన్ని తినకూడదని ఆరోజు ఉపవాసం చేస్తారు. ఏకాదశినాడు ఉపవాసం చేసి, ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. కొందరు భగవద్గీత గ్రంధాలను దానం కూడా చేస్తారు. జపతపాలతో, ఉపవాసాలతో పరమనిష్ఠా గరిష్ఠులై వైకుంఠ ఏకాదశిని ఆచరించి తరిస్తారు భక్తులు.  ఈ ఏకాదశినాడే భగవద్గీతను కృష్ణభగవానుడు అర్జునుడికి బోధించాడని గీతాజయంతిగా ఈ దినాన్ని జరుపుకుంటారు.

మార్గశిర శుద్ధ పౌర్ణమినాడు దత్తాత్రేయ జయంతి.  మార్గశిర శుద్ధ త్రయోదశినాడు హనుమత్ వ్రతం ఆచరింపబడుతుంది. 

ధనుర్మాసంలోని ఆఖరి రోజు భోగి పండుగ తో ఈ మాసం ముగుస్తుంది. భోగి పండుగనాడు బలిచక్రవర్తిని విష్ణువు పాతాళానికి అణిచిన రోజు. భగ అంటే వేడి అని అర్థం ఇచ్చే మాట నుంచి భోగి  వచ్చింది.  ఆవు పేడతో పిడకలు చేసి ఆ పిడకలను దండలుగా గుచ్చి అగ్నిదేవుడికి సమర్పిస్తారు. తాము దక్షిణాయనంలో పడిన చీడపీడ బాధలన్నీ ఈ మంటల్లో పిడకలుగా  వేసి ఉత్తరాయణకాలంలో సుఖసంతోషాలు కలగాలని  ప్రజలు కోరుకుంటారు.

ఇలా ఎన్నో పర్వదినాలతో అతి పవిత్రంగా తరతరాలనుంచి ఆచరించబడుతున్న ధనుర్మాసం  దక్షిణ భారతదేశపు సంఘ జీవనంలో, సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం వహించి ఉంది. ప్రతి రోజు, ప్రతిపూటా అయ్యవారి కథలు, అమ్మవారి పాటలతో శ్రవణశుభగంగా వినిపిస్తూ,  కన్నులపండువగా జరుగుతుంది ధనుర్మాసం.