Tuesday, June 21, 2011

తెలుగు పాటల తో 'రణం'(....కాదు- దోస్తీ) కడదామా !!


తెలుగు గుమ్మానికి పాటలతో తోరణం కడదాం రమ్మని ఒక్క పిలుపు వినబడగానే ముఖపుస్తకంలో తమని చూసుకుంటున్న తెలుగువాళ్ళు చాలామందికి కొత్త ఉత్సాహం వచ్చింది. కొద్దిగంటల వ్యవధిలోనే అందులో తమ పేరు నమోదు చేస్తున్న సభ్యుల సంఖ్య చూస్తే ఈ విషయం తెలుస్తోంది.

ఎక్కడైనా తెలుగు మాట వినబడితేనే పులకరించిపోయే స్థితి కలిగే దుస్థితి త్వరలో వస్తుందేమో నని దిగులుగా ఉంటోంది ఇటీవల చాలామందికి. తెలుగు మాటే కాదు, తెలుగులో పాటలు కూడా రాయాలన్న సరదా, రాసే సత్తా కూడా ఉన్న యువతరం ఎంతో ఉత్సాహంగా ఉందని, అవకాశం దొరికినప్పుడు తప్పకుండా స్పందిస్తారని నిరూపిస్తున్నారు ఈ తెలుగు పాటల  తోరణం సభ్యులు.

కవిత్వం అంటే కేవలం ప్రాసలు, పడికట్టుపదాలు వేస్తు వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి చెప్తే చాలనే అభిప్రాయం కొందరికి ఉంది. అల్లాటప్పాకవితలు చెప్పడమే ఓ గొప్పా అనే మాటదీనికి వర్తిస్తుందేమో కానీ నిజంగా భాష పట్ల, సాహిత్యం పట్ల గౌరవం ఉన్న వారు చెప్పే భావాత్మకమైన చిన్న వాక్యం కూడా గొప్ప కావ్యం ఇచ్చే అనుభూతిని ఇవ్వగలదు. వాక్యం రసాత్మకం కావ్యం అన్న మాట ఇటువంటి కవిత్వం పట్ల సార్థకమవుతుంది.

వెయ్యేళ్ళ మన తెలుగు సాహిత్యంలో నన్నయ  నుంచి గురజాడ వరకు చూస్తే  పద్యం - అత్యంత జనాదరణ పొందిన సాహిత్యప్రక్రియ. అనేక సాంఘిక,రాజకీయ,ఆర్థిక కారణాల వలన తెలుగు దేశంలో కూడా  భాష, సాహిత్యంలోకూడా మార్పు వచ్చింది. జనం మాట్లాడే భాషే, రాసే భాష కావాలనే వాదం ఊపందుకుంది. దీని ప్రభావం కవిత్వం మీద కూడా కనిపించింది. భావకవిత అనేవిధానం సాహిత్యంలో సంచలనం కలిగించింది. సంస్కృతపదాల మాయనుంచి విడిపడి ప్రతి భావాన్ని తెలుగులో చెప్పడానికి కావలసిన చక్కని పదజాలాన్ని మనకు అందించారు ఈ భావకవులు.

తెలుగులో చలన చిత్రాలు నిర్మించిన కొత్తలో ఇతరభాషలకు అనువాదాలుగా వచ్చిన కొన్ని చిత్రాలలో తెలుగుదనం కొంత కొరవడినా క్రమంగా తెలుగు సమాజంలో భావకవులుగా జనాదరణ పొందిన కవులు చాలామంది చిత్రసీమలో ప్రవేశించడం వలన సినిమా పాటలు కూడా  పెద్దగా పాండితీ ప్రకర్ష లేని  సామాన్యులు పాడుకోగలిగిన పాటలుగా, గుర్తుపెట్టుకోగల సాహిత్యంతో కనిపిస్తాయి.
క్రమంగా సమాజంలో వచ్చిన మార్పులు అనేకరంగాలలో ప్రభావం చూపినట్టే సినిమారంగం మీదకూడా చూపాయి. జనం కోరినది తీస్తున్నామని, వింటున్నది రాస్తున్నామని, నచ్చినదే ఇస్తున్నామని నమ్మబలుకుతూ సినీ రంగం విలువలకు తిలోదకాలిచ్చింది.  సాహిత్యంలో కూడా  విలువలు నానాటికీ దిగజారాయి.

కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పెరుగుట విరుగుట కొరకే అన్న సూక్తిలో నిజం ఉంది. కాలం దానిని నిరూపిస్తుంది కూడా.

కొంతకాలం క్రితం వరకు ఎంతో విలువైన కవిత్వం  రాసిన వాళ్ళు ఎంతో మంది ఉండిఉండవచ్చు. కానీ సమాచార రంగంలో వ్యాపారాన్నిమాత్రమే చూసిన కొన్ని పత్రికల ధోరణి వలన చాలామంది మంచి రచనలు మరుగున పడిపోయి ఉంటాయన్న విషయంలో అనుమానం లేదు.

కానీ ఇప్పుడు రోజులు మారాయి. సమాచారరంగంలో అద్భుతమైన మార్పులెన్నో చోటుచేసుకున్నాయి. మన అభిప్రాయాలను, ఆలోచనలను పదిమందితో పంచుకోవడానికి, మంచిచెడులను బేరీజు వేసుకోవడానికి ఇదివరకులా పత్రికలు మాత్రమే వేదికలు కాదిప్పుడు. అంతర్జాలరంగంలో ప్రతివారికి ఎన్నో అవకాశాలు.

 కంప్యూటర్లో రాయడం అంటే ఇంగ్లీషు తెలిసిన వాళ్ళే చేయాలనే దురభిప్రాయాన్ని పక్కన పెట్టి మాతృభాషలో మన ఆలోచనలు పంచుకోగలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయం మనకి తెలిసిన తర్వాత మరికొంత మందికి చెప్పాలి. వీటికి  కావలసినదల్లా కొద్దిగా ఓర్పు, సహనంతో చూపే నేర్పు, మరికొంత నిజమైన భాషాభిమానం. తప్పులు లేకుండా తెలుగు రాయడానికి మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం.

అంతర్జాలంలోని సాంకేతిక రంగం మనకు ఇచ్చిన గొప్పబహుమతి ఈ సమాచారమార్పిడి. ప్రపంచంలో ఏమూల ఉన్నా తక్షణం స్పందించే అవకాశం, మన అభిప్రాయాలను మనం కోరిన వ్యక్తికి వినిపించగల గొప్ప సాధనాలు ఇప్పుడు మన అరచేతిలో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుందాం.

ఇప్పుడు ఈ తెలుగు పాటల తోరణం  గుంపు - మీరు రాసిన కవితలను పదిమంది కాదు.....కొన్ని వందల, (వేలమంది?) తో పంచుకోవడానికి ఒక చక్కని అవకాశం.

మీలో కొందరు ఇదివరకే కవిత్వంలో అందె వేసిన చెయ్యి అయి ఉంటారు.
మరికొందరు ఔత్సాహికులు అయి ఉంటారు. రాయాలనే తపన ఎంతో ఉన్నా భావానికి రూపం కల్పించడంలో కొంత తికమక ఉండవచ్చు వీరి కవితలలో.
అయితే ఏం....

మొత్తంమీద తెలుగు భాషమీద గౌరవంతో, తెలుగు పాటమీద సరదా తోను ఈ వేదికమీదకు చేరిన వాళ్ళం కనుక మన అభిప్రాయాలన్నీ ఇచ్చిపుచ్చుకుందాం. ఒకరి భావాలనొకరు గౌరవించుకుందాం.

నచ్చితే మెచ్చడమే కాక నచ్చకపోతే కారణాన్ని కూడా సున్నితంగా చెప్పుకుందాం.

అలా చెప్పిన వారి మాటలోని భావాన్ని నొచ్చుకోకుండా పుచ్చుకుందాం.

మన కవితా శైలిని మెరుగుపరుచుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఈ వేదిక నిరూపిస్తుందని ఆశిద్దాం. 
తెలుగులో గేయాలు రాసేవాళ్ళయితే  ఇక్కడ  ఉన్నవారితో మీ అభిప్రాయాలు పంచుకోండి.

Monday, June 6, 2011

ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా


ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా

ఆత్రేయ గారు రాసిన గీతం -పోలీసు వెంకట సామి - పోలీసు శాఖలో పనిచేసేవ్యక్తి ప్రేమికుడైతే తన  ప్రియురాలికి చెప్పే ప్రేమ కబుర్లు ఎలా ఉంటాయో, ఎలాంటి భాష వాడతాడో చూసాం కదా.

ఆత్రేయగారికన్నా ముందే ఆరుద్ర గారు కూడా ఇలాంటి ప్రయోగం చేసారు 1959లో 'మా ఇంటి మహాలక్ష్మి' చిత్రం కోసం.

ఇప్పుడు ఒక కోర్టు లో ప్లీడరు గారి దగ్గర గుమాస్తా గా పనిచేసే వ్యక్తి తన ప్రియురాలితో ఎలా మాట్లడతాడని ఆరుద్ర గారు ఊహించి రాసారో చూద్దామా.

పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు

అమ్మాయి అంటే తనకి ఇష్టం ఉందని చెప్పడానికి దస్తావేజు రాసి ఇస్తానని  చెప్తున్నాడు. అంటే తన హృదయం అనే ఆస్తిని ఆమెకి సమర్పించుకుంటున్నానని చెప్పే పత్రం రాసి ఇస్తాడుట.

                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ
                

ఇక్కడ సదరు అనే మాట కోర్టు భాషలో ఎంతో సహజమైన పదం. ఎవరైతే, ఏదైతే అలా అని చెప్పవలసి వచ్చినప్పుడు
సదరు అనే పదం వాడుతుంటారు కోర్టు భాషలో.

నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
తీసుకున్నై డిక్రీని నాపై

అతను ఆ అమ్మాయిని ప్రేమించడం అన్న విషయం కేసయితే...అందులో అతని అభిప్రాయం అనే విషయంతో ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి హృదయం, మనసు అనేవి ఎక్స్ పార్టీలుగా ఉండి అతని మనసును డిక్రీ చేసాయిట. అంటే ఆమెను తన ప్రమేయంలేకుండానే తనకు తెలియకుండానే ప్రేమించేసాడన్నమాట.

మీను లాంటి నీ కన్నులు అమీనై
జామీను లేని నా మదిని జప్తు చేసినై...

అంతే కాదు..ఇక్కడ కోర్టు వ్యవహారాలలో  అమీను అనే ఉద్యోగి ఉంటాడు.

తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నప్పుడు ఆ  అప్పును  చెల్లించలేకపోతే తాకట్టు పెట్టిన వస్తువుల మీద అప్పు ఇచ్చిన వారికి అధికారం వస్తుంది. ఆ విధమైన అధికారాన్ని కోర్టు  అప్పు ఇచ్చిన వారికి దాఖలు    చేస్తుంది. కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను  అమలు చేసే ఉద్యోగి ...కోర్టు అమీను.

ఇక్కడ ఆ ప్రేమించిన అమ్మాయి కళ్ళు -  'మీనులాంటీ నీ కన్నులు  అమీనై ' అంటే చేపల్లా ఉన్న ఆమె  అందమైన కళ్ళు కోర్టు  అమీను రూపం దాల్చి  ఏ విధమైన హామీ  లేని అతని ఆస్తి  అయిన మనసును అంటే అతని మదిని జప్తు చేసాయిట.


చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
మనకి రాదూ ఏ లిటిగేషన్....


ఇక  ఆమెని తను ప్రేమించడం అన్నది జరిగిపోయింది కనుక ఇద్దరూ ఒక  అవగాహనకి రావడం అనే దశకి వచ్చినట్టే.
అదే సెటిల్మెంట్. 

 ఇద్దరు ప్రేమించుకున్నాక  వారిద్దరూ కలిసి ఉండడానికి కావలసిన బంధం వివాహ బంధం. అందువలన ఆ వివాహ బంధం ఏర్పరచుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. దాన్ని అగ్రిమెంట్  అనే పదంతో సూచిస్తున్నారు కవి.

అంతేకాదు ఆ వివాహ బంధం వలన పొందవలసిన సౌఖ్యం అనేది తమ హక్కు దానిని సాధించడానికి కూడా ఓ పిటీషన్ వేయాలని అనుకుంటున్నాడు.

పెళ్ళి జరిగాక ఇద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే  వారు సంతోషంగా కలిసి ఉంటే   ఎవరికీ ఏ సమస్యా రాదని భావిస్తున్నాడు.
 అందుకే  అలా కలిసి ఉండగలిగితే   మనకి రాదు ఏ లిటిగేషన్ అంటాడు.

ఒకే భాష మాట్లాడే వ్యవహర్తలలో కూడా వారి వర్గ,ప్రాంత, మాండలిక భేదాలను బట్టి భాష వ్యవహారంలో అనేకమయిన మార్పులు కనిపిస్తాయి. వీటితో పాటు  భాషని ప్రభావితం చేసే అంశాలలో గమనించదగిన అంశం వృత్తి. ఒకో విధమయిన వృత్తిలో ఉండేవారికి  ఆ వృత్తికి సంబంధించిన పదాలతో కొన్ని పలుకుబడులు ఏర్పడి ఉంటాయి.  వారి భాషా వ్యవహారంలో అత్యంత సహజంగా ఆ పలుకుబడి ఒదిగిపోయి ఉంటుంది.
ఎంతో సునిశితమైన దృష్టి ఉంటే తప్ప భాషలోని ఈ అంశాన్ని గ్రహించడం కష్టం.

సినిమాలలో పాత్ర వేష భాషలను దృష్టిలో పెట్టుకుని ఆయా పాత్రలకు తగిన చిత్త  ప్రవృత్తిని గమనిస్తూ,  సందర్భోచితంగా పాటలు రాయడం తేలికైన పని కాదు.

ఆరుద్ర గారు రాసిన ఈ పాట ఒక హాస్య నటునిపై చిత్రించిన పాటే అయినా   కోర్టు గుమాస్తా అయిన ఆ పాత్ర ప్రేమలో పడితే అతని భాష ఎలా ఉంటుందో ఊహించి రాసిన విధానం  పాటల రచయితగా ఆరుద్ర  గొప్పదనాన్ని మరోసారి నిరూపిస్తుంది.

పాట మొత్తం సాహిత్యం ఇక్కడ


పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు
                  
                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ                       నువ్వంటేనే నాకు మోజు

చరణం       నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
                 తీసుకున్నై డిక్రీని నాపై
               
                 మీను లాంటి నీ కన్నులు అమీనై
                 జామీను లేని నా మదిని జప్తు చేసినై.                  నువ్వంటేనే నాకు మోజు       
  
చరణం       చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
                 మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

                  సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
                  మనకి రాదూ ఏ లిటిగేషన్....                               నువ్వంటేనే నాకు మోజు

                 
పాట రచన      ఆరుద్ర
గాయకుడు     పిఠాపురం
చిత్రం             మా ఇంటి మహాలక్ష్మి

సంగీతం           అశ్వత్ధామ

ఈ పాటను వినాలనుకుంటే  ఇక్కడ వినవచ్చు.