ధరణి నోము పండించిన ధనుర్మాసం
భారతీయ
జ్యోతిశ్శాస్త్రం ప్రకారం మనకి పన్నెండు
రాశులున్నాయి. సూర్యుడు ఈ పన్నెండు రాశులలోను ప్రతినెలా ప్రయాణిస్తూ ఉంటాడు. అలా
ఒక రాశిలోనుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడమే సంక్రమణం. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ
నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. అయితే తెలుగువారిది చంద్రమానం. అంటే మనం చంద్రకళల
ఆధారంగా రోజులని లెక్కవేసుకుని చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర పౌర్ణమి నాడు
కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరుతో ఆనెలని పిలుస్తాము. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో ఆనెలని
పిలుస్తారు.
సూర్యగమనాన్ని
ఉత్తరాయనం, దక్షిణాయనం అంటారు. అయనం అంటే ప్రయాణం. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే కాలాన్ని
ఉత్తరాయణం అంటారు. తమిళులది సూర్యమానం. సూర్యుని గమనం ప్రకారం వారి నెలల లెక్క ఉంటుంది. అందుకే మృగశిర నక్షత్రం పేరుమీద మార్గశిరం అని తెలుగువారు పిలిచే నెలలోనే ఈ ధనుర్మాసం వస్తుంది. ధనుస్సు రాశి నుండి మకరరాశికి సంక్రమించే వరకు సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అనే పేరుతో పిలుస్తారు తమిళులు.
వైష్ణవ సంప్రదాయంలో
ధనుర్మాసం అతి పవిత్రమైనది. ఈ మాసాన్ని మార్గళి అనే పేరుతో పిలుస్తారు ఈ ధనుర్మాసం అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు
చేస్తారు. ఆంధ్ర,
కన్నడ, తమిళ ప్రాంతాలలో ఈ ధనుర్మాసాన్ని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారు.
తెలుగువారు ఈ ధనుర్మాసాన్ని నెలపట్టడం అంటారు.
ధనుర్మాస వ్రతం ప్రసక్తి – పురాణాలు
శ్రీ
మహావిష్ణువు అవతార పురుషుడు. ఒక్కో అవతారంలో ఒక్కో పేరు. అలాగే ఈ ధనుర్మాసంలో
స్వామివారిని మధుసూదనుడుగా పిలిచి ఆరాధిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి
ప్రవేశించిన దగ్గరనుంచి, మకరరాశిలో ప్రవేశించే భోగి రోజు అంటే సంక్రాంతి ముందురోజు
వరకు ధనుర్మాసంలో నెలరోజుల పాటు ధనుర్మాస
వ్రతం ఆచరింస్తారు వైష్ణవులు. ధనుర్మాసం ప్రసక్తి మన పురాణాలలో బ్రహ్మాండ, ఆదిత్య
పురాణాల్లోని, నారాయణ సంహితలో, భాగవతంలో ఉంది. బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించడంలో
తెలుస్తుంది.
ధనుర్మాస
వ్రతం - విధి విధానాలు
ధనుర్మాస
వ్రతం చేయాలనుకునేవారు బంగారంతోకానీ, వెండితోగాని శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని
తయారు చేయించి పూజకోసం సిద్ధం చేసుకోవాలి. ఈ రెండు లోహాలు కాకపోతే శక్తిమేరకు
పంచలోహాలతో కానీ, రాగితోకానీ చేయించుకోవచ్చు. ఆ విష్ణువు విగ్రహాన్ని మధుసూదనుడు
అనే నామంతో వ్యవహరించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి అయిదు ఘడియలముందుగా నిద్రలేచి
తలారా స్నానం చేసి నిత్యపూజలు ముగించాక ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.
ముందుగా
మధుసూదనస్వామిని ఆవుపాలతోను, పంచామృతాలతోను, కొబ్బరి పాలతోనూ అబిషేకం చేయాలి. అభిషేకం చేయడానికి శంఖం ఉపయోగించడం శ్రేష్ఠం.
అభిషేకం చేసే ద్రవ్యాలను ముందుగా శంఖంలో నింపుకొని ఒక్కొక్క ద్రవ్యంతో విగ్రహాన్ని
అభిషేకించాలి. తులసీ దళాలు, ఇంకా పుష్పాలతో స్వామివారిని శత, సహస్ర నామాలను
జపిస్తూ పూజించాలి.
మొదటి పదిహేను రోజుల పాటు స్వామికి ప్రతిరోజూ చక్కెర పొంగలిని లేదా, బియ్యం,
పెసరపప్పు కలిపి వండే పులగం గానీ నైవేద్యంగా సమర్పించాలి. నెలలో తర్వాతి పదిహేనురోజులు దధ్యోదనం
(పెరుగన్నం) నివేదించాలి. ధూపం, దీపం, దక్షిణ, తాంబాబూలను సమర్పించి నమస్కారాలు
చేయాలి. స్వామివారితో పాటు ఆయనకి ఎంతో ప్రియమైన
తులసిని కూడా పూజించాలి. ధనుర్మాసం అంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను
వింటూ ఆ స్వామివారి సన్నిధిలో గడపాలి. నెలరోజుల పాటు చేయవలసిన ఈ వ్రతంలో ఏదైనా
కారణం వల్ల 30 రోజులు చేయలేని వారు, పదిహేను రోజులు కానీ, 8 రోజులు కానీ, 6 రోజులు
కానీ కనీసం 4 రోజులు కానీ చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ అదీ సాధ్యంకాకపోతే
కనీసం ఒక్క రోజయినా ఈ వ్రతాన్ని
మనస్ఫూర్తిగా ఆచరిస్తే కూడా ఫలితం పొందుతారని పెద్దలు చెబుతారు.
“ మధూసూదన దేవేశ
ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా” – అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ పండితులకి దానం
ఇవ్వాలి. ఆ దానాన్ని స్వీకరించే పండితుడు “ఇందిరా ప్రతి
గృహ్ణాతు” అంటూ
ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీస్సును పొందడం ద్వారా సాక్షాత్తూ ఆ మధుసూదన స్వామివారే
పండితుడి రూపంలో సకల వాంఛలూ సిద్ధింపజేసే అమోఘ ఆశీర్వచనం దయచేస్తాడని ఆశిస్తారు.
ఒక్కరోజయినా
ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ఆచరిస్తే ఇహపర మోక్ష సాధనతో పాటు వేయి సంవత్సరాలపాటు
దేవతారాధన చేసిన ఫలితం కూడా లభిస్తుందని వేదపండితులు భావిస్తారు.
ధనుర్మాసం - గోదాదేవి
ధనుర్మాసానికి ఆద్యురాలిగా పిలవబడే గోదాదేవి శ్రీ
మహావిష్ణువును భర్తగా పొందడానికి చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. గో అంటే జ్ఞానం
అనీ, ద అంటే ఇచ్చునది అని గోదాదేవి జ్ఞానాన్ని ప్రసాదించేది అని ఈ పదానికి
వ్యుత్పత్తి చెప్తారు పండితులు. తాను
ధరించి స్వామికి మాలను ఇచ్చిన కన్య గా ఈ గోదాదేవి చూడికుడుత్త నాంచారి గా
ప్రసిద్ధి పొందింది. ఈ గోదాదేవి గాధనే శ్రీ కృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద (మాలను
ధరించి విడిచి స్వామికి ఇచ్చినది )అనే గొప్ప
వైష్ణవ మత ప్రబోధ ప్రబంధంగా రచించాడు. గోదాదేవిని సాక్షాత్తూ భూదేవి అవతారంగా భావిస్తారు.
ఆండాళ్, కోదై అనే పేర్లు కూడా గోదాదేవి పేర్లే.
ఆ శ్రీ మహావిష్ణువు గొప్పదనాన్ని కీర్తిస్తూ, ప్రపంచానికి
శాంతి సౌఖ్యాలను చేకూర్చాలని ఆశిస్తూ రోజుకొక్కటి చొప్పున ముప్ఫయి కీర్తనలతో గోదాదేవి స్వామిని ఆరాధించింది. ఈ కీర్తనలను
పాశురాలు అంటారు. నాలుగు వేదాల సారాన్ని క్రోడీకరించి గోదాదేవి గానం చేసిన ఈ
పాశురాలన్నీ దివ్యగాన ప్రబంధంగా తిరుప్పావై అనే పేరుతో శ్రీ వైష్ణవులు పాడతారు. తిరు
అంటే శ్రీ అని అర్ధం. పావై అంటే పాటలు అని గానీ వ్రతం అని గానీ అర్థం. భగవంతుడిని
భర్తగా ఆశిస్తూ చేసిన వ్రతాన్ని వివరించే పాటలతో కూడినది తిరుప్పావై. ఇందులో 30
పాశురాలు ఉన్నాయి. పాశురాలు ఛందోబద్ధంగా ఉండే గీతాలు. కేవలం భగవంతుడి లీలా
విలాసాన్ని వర్ణించడమే కాకుండా ప్రకృతిలోని అద్భుతమైన అంశాలెన్నిటినో పాశురాలు
వివరిస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుడిని
ప్రార్థిస్తే ప్రకృతి కూడా మానవుడికి అనుకూలంగా మారుతుందని, మనిషి జీవితంలో శాంతి సౌబాగ్యం నిండుగా ఉంటాయని ఈ పాశురాలు
వర్ణిస్తాయి. చివరి పాశురాల్లో ఈ పాశురాలను తాను రచించి పాడానని, వీటిని గానం
చేసినవారికి భగవంతుడి కటాక్షం కలిగితీరుతుందని చెప్తుంది గోదాదేవి. తిరుపతిలోని శ్రీనివాసుడికి
ప్రతిదినమూ వినిపించే సుప్రభాతానికి బదులుగా ఈ ధనుర్మాసం నెలరోజులూ తిరుప్పావైలోని
పాశురాలనే ఆలాపన చేస్తారు. పన్నెండుమంది ఆళ్వారులలో ప్రముఖస్థానం గోదాదేవిదే.
కాత్యాయనీ వ్రతం – శ్రీ వ్రతం
శ్రీ
మహావిష్ణువులాంటి చక్కని అందమైన ప్రేమించే భర్త రావాలని కోరుకుంటూ కన్నెపిల్లలు
కాత్యాయనీ వ్రతం చేస్తారు. రాహుకేతువుల దోషం వలన వివాహం ఆలస్యమైన కన్యలు త్వరగా
వివాహం జరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కృత్తికానక్షత్రంతో కలిసిన మంగళవారాలు ఈ
వ్రతానికి శ్రేష్ఠమైనవని అంటారు. అందుకే సుబ్రహ్మణ్యషష్ఠనాడు ఈ వ్రతం చేస్తారు కొందరు. కలశం పెట్టి శక్తిని
బట్టి బంగారు లేదా పసుపు కొమ్ములతో మంగళసూత్రాలను తయారుచేసి కలశానికి
అలంకరిస్తారు. ఏడు చెరుకుముక్కలు, ఏడు అప్పాలతో నైవేద్యం పెట్టి వ్రత కథను విని
అక్షింతలు వేసుకుంటారు. ఈ విధంగా ఏడు
మంగళవారాలు వ్రతం చేసాక 8వ వారం ఉద్యాపన చేస్తారు. ఏడుగురు ముత్తయిదువలకి తలంటుపోసి,
కొత్త చీరలు, ఏడు అప్పాలు, ఏడు చెరుకుముక్కలు వాయనం ఇచ్చి వారితో ఆశీర్వచనం పొందుతారు.
కాత్యాయని కథ
కాత్యాయని అంటే
పార్వతీదేవి. సతీదేవిగా దేహత్యాగంచేసిన అమ్మవారు హిమవంతుడి పుత్రికగా పార్వతిగా
జన్మించింది. పరమేశ్వరుడిని భర్తగా కోరి తపస్సుచేసి అతనిని పొందింది.హిమవంతుడు
పూర్వజన్మలో కతి అనే ముని అందువల్ల కతి పుత్రికగా కాత్యాయనిగా పిలువబడుతుంది
పార్వతీదేవి. శివుడిని ఆశ్రయించిన కుజుడి వలన సతీదేవిగా అతనికి దూరమైన దేవి కుజుడు
శివుడిని వీడిన తర్వాత పార్వతిగా అతన్నిచేరింది. అందుకే కాత్యాయని వ్రతం చేసి
కుజదోషం పోగొట్టుకుని చక్కని భర్తను పొందాలని కన్నెపిల్లలు ఈ వ్రతం వలన ఆశించే
ఫలితం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలలో ఈ కాత్యాయనీ వ్రతం చేస్తారు.
ఈ కాత్యాయనీ వ్రతంతో గోపికలు శ్రీ కృష్ణుడిని పొందారని, తాను
కూడా శ్రీ రంగనాథుడిని పొందడానికి ఆండాళ్
ఈ వ్రతాన్నే విభిన్నంగా ఆచరించింది. పాశురాల గానంతో పూజించింది. చివరకు ఆయనని
వివాహమాడింది. అందుకనే ఈ ధనుర్మాసంలో శ్రీవ్రతం పేరుతో చేసే పూజలు ఆండాళ్ వ్రత
విధానాన్నే సూచిస్తాయి. తిరుప్పావై పాశురాలలో ఈ శ్రీ వ్రతం ఆచరణ వివరించబడింది. ఈ
వ్రతాన్నే పావైనోంబు అని అంటారు. తమిళనాడులో
ధనుర్మాసంలో గోదాదేవి కల్యాణం చేస్తారు. వేకువజామునే నిద్రలేచి తలస్నానం
చేసి స్వామివారి కీర్తనలను క్రమం తప్పకుండా పాడడం, పేదలకు దానధర్మాలు చేయడం, పండిత
సత్కారం చేయడం ఈ తిరుప్పావై వ్రతం చేసేవారు చేయవలసిన విధులు. అలాగే స్వామివారికి
చక్కెర పొంగలి లేదా, పప్పు పొంగలి నైవేద్యాలు, ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో
పూజించడం కూడా ఈ వ్రతంలో ముఖ్యమైనది.
వైష్ణవాలయాల్లో తిరుప్పావై ని ప్రతిరోజూ తెల్లవారుఝాము ఘడియల్లో ఆలపించడం,
నగరవీధుల్లో సంకీర్తనలు చేస్తూ తిరగడం, స్వామికి ఘుమఘుమలాడే నేతి ప్రసాదాలను నైవైద్యంగా అందించి వాటిని మాత్రమే
భుజించడం ఈ ధనుర్మాసంలో విశేషాలు.
తెలుగునాట గొబ్బిపాటలు
ధనుర్మాసం ఆరంభంతోనే సంక్రాంతి పండుగ సంబరాలు కూడా
మొదలవుతాయి తెలుగు ఇళ్ళలో. సూర్యుడు ధనుస్సు రాశినుంచి మకరరాశికి సంక్రమణం చేసే
రోజు సంక్రాంతి. ధనుర్మాసం నుంచి సంక్రాంతి ప్రవేశించేవరకు తెల్లవారుఝాములోనే లేచి
కళ్లాపి జల్లి ముంగిళ్ళలో అందమైన ముగ్గులు వేసి రంగు రంగుల పూలతో అలంకరించిన
ఆవుపేడతో గొబ్బిళ్ళు పెడతారు. “ సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బడ్నియ్యవే “ అంటూ
పాటలు పాడతారు. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి ప్రతిరూపం. సంక్రాంతి
రోజు సాయంత్రం సందెగొబ్బెమ్మ పేరంటం పిలుచుకుని అందరికీ వాయనాలు ఇస్తారు.
తెలుగునాట ధనుర్మాసం తెచ్చే సందడిలో ముగ్గులూ గొబ్బెమ్మలతో
పాటు చెప్పుకోవలసిన ముఖ్యమైన విశేషాలు ఇంటింటికీ రంగురంగుల వస్త్రాలను కప్పుకుని
వచ్చే గంగిరెద్దులు
అలాగే ముచ్చటైన
వస్త్రధారణతో చేతిలో చిడతలు తట్టుకుంటూ, కృష్ణార్పణం చేస్తూ భిక్షను స్వీకరించే
హరిదాసులు చేసే భగవన్నామ స్మరణతో
ధనుర్మాసం ఎంతో ముచ్చటగొలుపుతుంది.
ధనుర్మాసం – పండుగలు పర్వదినాలూ
ధనుర్మాసంలో వచ్చే గురువారాలు చాలా పవిత్రమైనవి
శుభప్రదమైనవి. మార్గశిరమాసం మహా విష్ణువుకు ఎంతో ప్రీతి అని చెప్తారు. భగవద్గీత
విభూతి యోగంలో “ మాసానాం మార్గశీర్షాహం” అని చెప్పబడింది. మార్గశిరమాసం గురువారాలు
లక్ష్మీదేవిని పూజించి ఆమె కటాక్షం పొందాలి. లక్ష్మీపూజ విధానంలోనే ఈ వ్రతం కూడా
చేయాలి. అయితే మార్గశిరమాసంలోని నాలుగు గురువారాలతో పాటు, పుష్యమాసంలోని ఐదవ
గురువారం కూడా లక్ష్మీ పూజ చేయాలి. ఈ వ్రతానికి
నైవేద్యం కూడా భిన్నమైనవి. మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, ఐదవ వారం అంటే పుష్యమాసం లోవచ్చే మొదటి గురువారం నాడు పూర్ణం కుడుములు నైవేద్యం పెట్టాలి.
మార్గశిర శుద్ధ షష్టినాడు సుబ్రహ్మణ్య
షష్టి..కుమారస్వామి తారకాసురుడిని సంహరించి లోకాలను కాపాడిన పర్వదినం.
ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే
ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం. దీనిని
వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని స్వర్గద్వారం అనీ పేర్లతో పిలుస్తారు. ఆరోజు
విష్ణుమూర్తి ఉత్తరం దిక్కున తన వైకుంఠ ద్వారాన్ని తెరిచి తన గరుడ వాహనం పై ముక్కోటి దేవతలతో సహా
వచ్చి దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఒక్క ఏకాదశే ముక్కోటి ఏకాదశులకి సమానమైన
ఫలితాన్నిస్తుందని అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అమృతాన్ని మధించగా
వచ్చిన హాలాహలాన్ని శివుడు ఈరోజే తన కంఠంలో ధరించాడని పురాణాలు చెబుతాయి. వైకుంఠ ఏకాదశినాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో
దాగి ఉంటాడని అందుకనే దాన్ని తినకూడదని ఆరోజు ఉపవాసం చేస్తారు. ఏకాదశినాడు ఉపవాసం
చేసి, ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. కొందరు భగవద్గీత గ్రంధాలను దానం కూడా
చేస్తారు. జపతపాలతో, ఉపవాసాలతో పరమనిష్ఠా గరిష్ఠులై వైకుంఠ ఏకాదశిని ఆచరించి
తరిస్తారు భక్తులు. ఈ ఏకాదశినాడే
భగవద్గీతను కృష్ణభగవానుడు అర్జునుడికి బోధించాడని గీతాజయంతిగా ఈ దినాన్ని
జరుపుకుంటారు.
మార్గశిర శుద్ధ పౌర్ణమినాడు
దత్తాత్రేయ జయంతి. మార్గశిర శుద్ధ
త్రయోదశినాడు హనుమత్ వ్రతం ఆచరింపబడుతుంది.
ధనుర్మాసంలోని ఆఖరి రోజు భోగి పండుగ
తో ఈ మాసం ముగుస్తుంది. భోగి పండుగనాడు బలిచక్రవర్తిని విష్ణువు పాతాళానికి అణిచిన
రోజు. భగ అంటే వేడి అని అర్థం ఇచ్చే మాట నుంచి భోగి వచ్చింది. ఆవు పేడతో పిడకలు చేసి ఆ పిడకలను దండలుగా గుచ్చి అగ్నిదేవుడికి సమర్పిస్తారు. తాము దక్షిణాయనంలో పడిన చీడపీడ
బాధలన్నీ ఈ మంటల్లో పిడకలుగా వేసి ఉత్తరాయణకాలంలో సుఖసంతోషాలు కలగాలని ప్రజలు కోరుకుంటారు.
ఇలా ఎన్నో పర్వదినాలతో అతి పవిత్రంగా
తరతరాలనుంచి ఆచరించబడుతున్న ధనుర్మాసం
దక్షిణ భారతదేశపు సంఘ జీవనంలో, సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం వహించి ఉంది.
ప్రతి రోజు, ప్రతిపూటా అయ్యవారి కథలు, అమ్మవారి పాటలతో శ్రవణశుభగంగా
వినిపిస్తూ, కన్నులపండువగా జరుగుతుంది
ధనుర్మాసం.


