Thursday, November 13, 2014

ఆరుద్ర చూపించిన మహాబలిపురం


 దేశభక్తిని చూపించే విధానాల్లో గతవైభవ స్మరణం అనేది కూడా ఒకటి. ఆ విధంగా ఒకప్పటి మన చరిత్రను స్మరించుకొని, ఆ వైభవాన్ని పదే పదే కీర్తించి, ప్రస్తుత పరిస్థితులనుంచి మరింత అభివృద్ధి సాధించే విధంగా జాతిని ఉత్తేజపరచడానికి ఇది ఉపయోగిస్తుంది. 

ముఖ్యంగా మనదేశంలో విదేశీపాలనలో మగ్గిపోతూ సాంస్కృతికంగానే కాక మానసికంగా కూడా విదేశీభావజాలానికి దాసులవుతున్న జాతిని మేల్కొలిపి పురాతన వైభవాన్నిఎత్తిచూపించి స్ఫూర్తి కలిగించడానికి ఈ అంశం ఎంతగానో ఉపయోగపడింది.  మన కావ్యాలలోను, ఆధునిక పద్య వచన కవితలలో ఇలా పురావైభవాన్ని చాటేవి ఎన్నో ఉన్నాయి. వేల సినిమా పాటలు వచ్చినా ఈ విధమైన పద్ధతిలో రాసిన గేయాలు చాలా తక్కువ. సినీకవులు- ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అంటూ రామప్ప సౌందర్యాన్ని కీర్తించినా, శిలలపై శిల్పాలు చెక్కినారూ మనవారు సృష్టికే అందాలు తెచ్చినారూ అని మెచ్చుకున్నా, ఇదే చంద్రగిరి శౌర్యానికి గీసిన గిరి అంటూ రాయలవారి పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన ప్రాంతాన్ని ప్రశంసించినా, ఆడవే ఆడవే అంటూ ఆంధ్రదేశంలోని నదీమతల్లులను స్తుతించినా అన్ని సినిమా పాటలను ప్రజలు మనసారా మెచ్చారు. సూపర్ డూపర్ హిట్లు చేసారు. నలభై ఏళ్ళయినా వాటిని పునశ్చరణ చేసుకుంటూనే ఉన్నారు.

అదిగో...........

అలాంటి చారిత్రాత్మకస్థలాన్ని వర్ణించే మరో గొప్ప పాటే ఈ -"మహాబలిపురం మహాబలిపురం "అనే పాట. ముళ్ళపూడి వెంకటరమణ, బాపుగారి రాత, తీతలతో కలబోసుకున్న  బాలరాజు కథ కోసం ఈ పాట రాసారు ఆరుద్ర.

బాలరాజు అనే పది, పన్నెండు సంవత్సరాల చిన్నకుర్రవాడు బాలరాజు.  మహాబలిపురం ప్రాంతానికి వచ్చే యాత్రికులకు ఆ ప్రాంత విశేషాలను చూపించే ఒక గైడ్. వయసుకి చిన్నవాడే అయినా చెల్లిని, మేనమామ సంసార బాధ్యతను నెత్తిన వేసుకుని చలాకీగా హుషారుగా తిరుగుతూ తనకు తెలిసిన విశేషాలన్నీ ఎంతో ఆసక్తి కరంగా అందరికీ వివరిస్తూ ఆకట్టుకునే పెద్దమనసున్న చిన్నవాడు.

అతని నోటివెంట వచ్చే ఈగీతం మహాబలిపురం విశేషాలను కమనీయంగా వివరిస్తుంది. శిలలు శిల్పాలుగా మారి మామళ్ళపురంలో కొలువై మనకి చెప్పే అనేక విశేషాలను బాలరాజు పాటద్వారా మనకు చూపించారు ఆరుద్ర.
తమిళనాడులోని  చెన్నపట్టణానికి (చెన్నై నగరానికి) సుమారు 50 కిమీ. దూరంలో  ఉంది మహాబలిపురం.
దక్షిణభారతదేశంలో  ఎక్కువకాలం, ఎక్కువభాగాన్ని పరిపాలించిన చక్రవర్తులు పల్లవరాజులు.
కేవలం యుద్ధాలు, సైన్యసమీకరణలు, మత ప్రచారాలు అనే రాజధర్మంమాత్రమే కాకుండా ప్రజలలో కళాభిరుచిని గుర్తించి ప్రోత్సహించి, స్వధర్మంతో పాటు పరధర్మాన్ని అనుసరించేవారిని కూడా సమానంగా ఆదరించిన గొప్ప సంస్కృతి పల్లవులది.

మహాబలిపురం అనే స్థలం పేరుకి ఓ చరిత్ర ఉంది. పల్లవులకాలానికి ముందు ఈ ప్రాంతాన్ని మహాబలిపురం అని పిలిచేవారు. బలిచక్రవర్తి పరిపాలించిన స్థలంగా ఈ ఊరుపేరు వచ్చింది. అయితే పల్లవరాజులు ఈ ప్రాంతాన్ని గొప్ప శిల్పకళా తోరణంగా తీర్చడంతో పాటు ఈ ప్రాంతానికి పేరును కూడా మార్చారు. పల్లవ చక్రవర్తి మహేంద్రవర్మ, అతని కుమారుడు నరసింహవర్మ ఈ మామల్లపురం శిల్ప జగత్తుకు శ్రీకారం చుట్టారు. మామల్ల పురం అనే పేరుతో పల్లవుల కాలంలో ఈ ఊరు ప్రసిద్ధి చెందింది.  పల్లవరాజు నరసింహవర్మగొప్ప యోధుడు. అతనికి మామల్ల అనే బిరుదు ఉండేది. అతని బిరుదు పేరుమీద ఈ ఊరును మామల్ల పురం అని పిలిచారు.
ఈ చోటును పరిచయం చేస్తూ ఆరుద్ర తొలి పల్లవి ఇలా రాసారు-

మహా బలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు  - ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు.

మహాబలిపురం దగ్గర శిలలను శిల్పాలుగా మార్చి మరో గొప్ప కళా ప్రపంచాన్నే ఆవిష్కరించారు పల్లవరాజులు . సుమారు 5వ శతాబ్దంనుంచి 9వ శతాబ్ది వరకు పల్లవ ప్రాభవం దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. పల్లవ చక్రవర్తులలో మహేంద్రవర్మ, నరసింహవర్మలు గొప్ప కళాహృదయులు. వీరి కాలంలో దక్షిణభారతదేశంలో దేవాలయ వాస్తుశిల్పం ఉచ్ఛ స్థితిని అందుకొంది. గొప్ప గోపురాలతో కూడిన ఆలయాలు నిర్మించబడ్డాయి. వారిలో రెండవ నరసింహవర్మ కళాహృదయానికి నిదర్శనంగా మహాబలిపురంలో సాగరతీరాన వెలసిన గొప్ప కళా ప్రదర్శనశాల (Open Art museum) - ఈ మహాబలిపురం.

కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచి రేవు పట్నంగా మలిపించాడు
తెలుగు సీమ శిల్పుల్నీ రప్పించాడు
పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు

పల్లవుల రాజధాని సమీపంలో ఉన్న   కంచి. శ్రీలంక, పశ్చిమాసియా దేశాలతో వర్తకవాణిజ్యాలన్నీ  మామళ్ళపురం  రేవుపట్టణం ద్వారానే జరిగేవి.  సముద్రతీరంలోని ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉండేది.   పల్లవులు ఆకాలంలో తమిళదేశంలో ప్రధానంగా స్థిరపడినా అటు ఆంధ్రదేశం సరిహద్దులవరకు వారి సామ్రాజ్యాన్ని విస్తరించారు. మామళ్ళపురంలో అద్భుతమైన కళాజగత్తును ఆవిష్కరించడానికి నిర్ణయించాడు నరసింహవర్మ. ఇందుకోసం తమిళనాడులోనే కాక, తెలుగు సీమ నుంచి కూడా ఎందరో శిల్పకారులను నియోగించాడు.

పాండవుల రథాలనీ పేరు పడ్డవీ
ఏకాండీ శిలలనుండి మలచబడ్డవీ
 వీటిమీద బొమ్మలన్నీ వాటమైనవి
తాము సాటిలేని వాటిమంటూ చాటుతున్నవీ

మహాబలిపురంలో చాలా విశేషంగా చెప్పవలసిన శిల్పం రాతిరథాల నిర్మాణం. పెద్ద పెద్ద శిలలను గొప్ప రథాకృతిలో తీర్చి దిద్దడం. కొయ్యతో చేసిన రథాలకు బదులు రాతితో చెక్కిన ఈ రథాలు అప్పటి శిల్పకళకు తార్కాణాలుగా నిలుస్తాయి. ఇక్కడ పంచపాండవుల పేరుతో చెక్కిన పాండవుల రథాలు చాలా పేరు పొందాయి. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులతో పాటు వారి భార్య ద్రౌపది పేరుతో ఈ రథాలు చెక్కబడ్డాయి. ఒక్కో రథంలోను ఒక్కొక్క భిన్నమయిన శిల్పకళారీతులను ఆవిష్కరించారు శిల్పులు.


ధర్మరాజు రథం
భీమరథం
అర్జునుడిరథం








 




సహదేవరథం


మహాబలిపురంలో ఆరుబయటే ఈ శిల్పాలన్నీ కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పెద్ద శిలమీద ఒక్కో దృశ్యం మనసును రంజింపచేస్తుంది. ఏడవ శతాబ్దిలోనే దక్షిణ భారతదేశంలో  ఉత్తమస్థాయికి పరిణతి చెందిన శిల్పకళ పరిఢవిల్లిందని తెలియజేస్తాయి.  అందుకే ఆ బొమ్మలన్నీ వాటమైనవి. అవి ప్రపంచంలోనే గొప్పగా నిరూపించుకోగలిగే స్థాయికి చేరుకున్నాయి. ఆ విషయాన్నే ఈ బొమ్మలు చాటి చెప్తున్నాయి అంటారు ఆరుద్ర.

మహిషాసుర మర్దనం
 గోవర్థనమెత్తడం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం
పురాణాల ఘట్టాలూ పొందు పర్చిరీ
ముచ్చటగా కన్నులకూ విందునిచ్చిరీ

మహాబలిపురంలో శిల్పాలకు ఆధారం ఎక్కువగా భారతీయ పురాణగాథలు. పల్లవరాజు మహేంద్రవర్మ జైనమతం నుంచి హైందవమతానికి మారాడు. అందుకే ఇప్పటి శిల్పాలన్నీ శివుడు, విష్ణువు, గణపతి మొదలైన హిందూ పురాణాలకు చెందినవిగా కనిపిస్తాయి. ఒక్కొక్క శిలమీద ఒక్కొక్క పురాణఘట్టం రూపుదిద్దుకుంది.  భారత, భాగవతాలలో వర్ణించబడిన ఘట్టాలనే ప్రధానంగా చెక్కారు. రాక్షస సంహారిణి మహా దుర్గ చేసిన మహిషాసుర మర్దనం ఒక శిలమీద రూపుదిద్దుకుంటే,  మరొక శిల్పంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తనను ఆశ్రయించిన సకల గోబాలక ప్రపంచాన్ని సంరక్షించాడు చిన్నికృష్ణుడు. వరాహ అవతారం దాల్చిన మహావిష్ణువు కథను మరొక శిల్పం చూపుతుంది. ఇలా ఎన్నో పురాణ గాథలు  శిల్పాలపై పొందు పరిచి మన కళ్ళకు విందు చేసారు ఆ శిల్పులు.

వీనులకు విందు చేయడం అనేది జాతీయం. పాట వరుసకోసం వేసిన పొందు పర్చిరీ కి ప్రాస కోసం కళ్ళకు విందునిచ్చిరీ అనడం ఆరుద్రీయం.

    మహిషాసుర మర్దనం
                                               శ్రీకృష్ణుడు  గోవర్ధన పర్వతం ఎత్తడం
                                                      వరాహావతారం ఘట్టం
మహాబలిపురం శిల్పాల్లో కనిపించే పురాణఘట్టాలు ఇవి.

పాశుపతం కోరెనూ పార్ధుని మనసూ
పరమశివుని కోసమూ చేసెను తపసూ
సృష్టంతా కదలి వచ్చి చూడసాగెనూ
ప్రతిసృష్టి ఈ శిల్పమనీ పేరు వచ్చెనూ

పురాణ ఘట్టాలను పొందుపరిచిన మహాబలిపురం శిల్పజగత్తులో ప్రముఖమైన శిల్పం అర్జునుడి తపస్సు(గంగావతరణం?).
 అర్జునుడి తపస్సు (ఆ భంగిమ చెప్తుంది ఎంత తీవ్రమయిన తపమో అది)

 ఈ వింతను చూడడానికి వచ్చిన వాటి సృష్టి ఈ శిల్పంలోనే. కుడివైపున భూమిమీద కనిపించే అనేక రకాల జీవజాలం,ఎడమపక్కన హిమాలయాలు, ప్రమధగణాలు, దేవతామూర్తులు, యక్షకిన్నెర కింపురుష జాతులు, సిద్ధులు అందరూ ఈ శిల్పంలో కనిపిస్తారు.

పాండవులు మాయా జూదంలో కౌరవుల వద్ద ఓడిపోయారు. కౌరవులను జయించే దీక్షతో తపస్సు చేసాడు అర్జునుడు. ముందు దేవేంద్రుడికోసం తపస్సు చేసాడు. కౌరవులను ఓడించడానికి శక్తి కావాలన్నాడు. పరమేశ్వరుని దయతోనే అది సాధ్యం అవుతుందని దేవేంద్రుడు చెప్పాడు. అప్పుడు పరమశివుని కోసం తపస్సు చేసాడు అర్జునుడు. అది అత్యంత ఘోరమైన తపస్సు. మనోవాక్కాయకర్మల శుద్ధిగా జీవించి, ఆత్మార్పణ చేసుకుంటే భగవంతుడు మనకు అన్ని శక్తులను ప్రసాదిస్తాడని ఈ శిల్పం వివరిస్తుంది. 

అత్యంతనైపుణ్యంతో తయారైన గొప్ప శిల్పకళ - మహాబలిపురంలోని అర్జునుడి తపస్సు పేరుతో వెలసిన బృహత్ శిల్పం. అర్జునుడు చేస్తున్న ఘోరమైన తపస్సు  దేవతలనే కాదు, సృష్టిలోని జీవులన్నిటినీ సంభ్రమానికి గురిచేసింది. ఆ శిల్పాన్ని గురించి ఆరుద్ర ఇలా  అంటారు. అర్జునుడి భీకరమైన తపస్సుకి ఈ శిల్పం ప్రతి సృష్టి అనే ఒక్క మాటతో  అద్భుతంగా ఆ శిల్పంలోని గొప్పదనాన్ని చూపిస్తారు ఆరుద్ర. ఈ అర్జునుడి తపస్సు రెండు పెద్ద శిలలపై చెక్కబడింది. ఈ శిల్పాన్నే గంగావతరణం శిల్పం అని కూడా అంటారు. తపస్సుచేసే అర్జునుడి స్థానంలో భగీరథుడిని ఊహించి గంగావతరణం సమయంలో సృష్టి అంతా ఏవిధంగా ఆశ్చర్యపడి నిలిచిందో ఇక్కడ చెక్కబడింది అని కొందరి ఊహ. ఎలా ఊహించినా ఆత్మ నిగ్రహంతో ఉండి,  భగవంతుడినే సర్వస్వంగా నమ్మితే కార్యసిద్ధి జరుగుతుందని ఈ శిల్పం సందేశంగా భావించవచ్చు.





సంద్రంలో కలిసినవి కలిసిపోయెనూ
ఒంటరిగా ఈ కోవెలా మిగిలిపోయెనూ
దేవుని పాదాలు కెరటాలు కడుగును నిత్యం
మనుషుల పాపాలు ఇవి చూడ తొలగును సత్యం సత్యం



వందల సంవత్సరాలు గడిచిపోయాయి. రాజులు పోయారు. వారి రాజ్యాలు పోయాయి. కాలంలోను, ప్రకృతిలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సముద్రతీరంలో ఉన్న ఈ శిల్పకళ అంతా ఈ మార్పులను ప్రతినిత్యం  అనుభవిస్తూ వచ్చింది. సాగరం ముందు ముందుకు జరుగుతూ కొద్ది కొద్దిగా దేవాలయాన్ని తనలో లీనం చేసుకుంటూ ఉంది. గొప్ప ప్రాకారాలు, ఎన్నో గొప్ప శిల్పాలు అన్నీ సముద్రంలో మునిగిపోయాయి. విదేశీ యాత్రికుడు మార్కోపోలో మామళ్ళపురం వర్ణనలో ఏడు గొప్ప పగోడాల గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక గోపురం వాటి అవశేషమే. మిగిలివున్న దేవాలయం మాత్రం జరిగిన సంఘటనలకు మూగ సాక్ష్యంగా ఇక్కడ నిలిచి ఉంది. ఎంతో గొప్ప శిల్పకళ సముద్రం పాలయిపోగా దేవాలయం మాత్రమే మిగిలింది అనే బాధను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెనూ అంటూ చెప్పారు. 

 సముద్రం ఒక్కొక్క అడుగూ ముందుకు జరుగుతూ చివరికి ఆ కోవెలలోని మూలవిరాట్టుని తాకేవరకు వచ్చింది. అందుకే ప్రకృతి ధర్మంగా  ప్రతినిత్యం జరుగుతున్న ఈ చర్యను - "దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం" అంటూ  సముద్రం ఆ దేవుడికి చేసే సేవగా  వర్ణించి విషయాన్ని తేలిక చేసారు ఆరుద్ర.

చివరగా " మనుషుల పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం "అన్న మాటను ఆధ్యాత్మికమైన సందేశంగా కాక కళాత్మకమైన సందేశంగా భావించవచ్చేమో. కళను దర్శించి అందులో లీనమైనప్పుడు ప్రేక్షకుడిలో రసానందం కలుగుతుంది. అదే బ్రహ్మానందం అన్నారు విమర్శకులు. అలాంటి మానసిక స్థితి మనసులోని మలినాన్ని పోగొట్టి స్వచ్ఛంగా చేస్తుందని అటువంటి రసానందం ఇచ్చేదే గొప్ప కళ అని చెప్పారు భారతీయ లాక్షణికులు. ఈ మహాబలిపురం చూసాక కలిగే అనుభూతి కూడా రసానందమే అని అదే మనుషుల్లోని పాపాలని కడిగేయగల బ్రహ్మానందస్థితిని కలిగిస్తుందని అని  ఆరుద్ర భావించారు. అందుకే అదే సత్యం సత్యం అని నొక్కి చెప్పారు.

భారతీయ కళాజగతికి గొప్ప గోపురంగా మహాబలిపురం గొప్పదనాన్ని  మూడు నిముషాల పాటలోకి కుదించి  పాటగా అందించిన ఆరుద్ర ఇంకా మరెన్నో చక్కని పాటలను ఈ చిత్రానికి అందించారు. 

ఒకనాటి చారిత్రక జ్ఞాపకాన్ని పదికాలాలు పచ్చగా  పదిలపరిచారు ఈ బాలరాజు కథ చిత్రంతో. అప్పటి మహాబలిపురం గ్రామాన్ని, పరిసరాలను గొప్ప శిల్పాలను అందంగా, ఆహ్లాదంగా చిన్న పిల్లల ఆటపాటలతో సందడిగా చిత్రించిన దర్శకుడు బాపు,   చక్కని హాస్యంతో, వర్తమాన సమాజ స్థితిపైన  చురుక్కనిపించే వ్యాఖ్యలతో,  చిన్నపిల్లల పాత్రలను కూడా చక్కని వ్యక్తిత్వంతో తీర్చి ఇంచక్కని కథ అందించిన ముళ్లపూడి,  చిత్ర దర్శకుడు బాపు   కలిసి తెలుగు సినీ కళా మారాణి కిరీటంలో పెట్టిన  ఓ కలికి తురాయి బాలరాజు కథ.