Thursday, August 18, 2011

ఓ ప్రశ్న... మరో ప్రశ్నే జవాబు....!!


రాధాకృష్ణులు అంటేనే ప్రేమకు పర్యాయపదం.

రాధలాగే తాను ఎంతగానో ఇష్టపడి ఆరాధించిన ప్రేమికుడు, కృష్టుడిలాగే తన వలపు రుచి చూపి తనను అనురాగ వర్షంలో తడిపిన తన ప్రియతముడు ఒక్కసారిగా తనను, తన ప్రేమను మరిచి, చివరకు తననే నీవెవరు, నాకు నీతో ఏం సంబంధం ఉందని ప్రశ్నిస్తే ఆ వలచిన హృదయం ఏమయిపోతుంది?

అటువంటి ప్రశ్నకి ఆ క్షణాన ముక్కలుగా విడిపోయి, వలచిన, వలపించబడిన హృదయం పగిలిన గుండెతో ఆవేదనతో రగిలిపోతూ ఇలాగే పాడుకుంటుందేమో.

నల్లనయ్యా...ఎవరని అడిగావా నన్నూ..

మురళిని కాలేను

పింఛమయినా కాను

నల్లని కృష్ణయ్యకి ఎల్లవేళలా అంటి పెట్టుకొని ఉండేవి అతని పింఛమూ, మురళీ. మరి తాను ఆరెండూ కాదు. అందుకే అతనికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఆ నల్లనయ్యని ఎదలో ఎంతో దగ్గరగా ఊహించినా వాస్తవంగా దగ్గరకు చేరలేకపోయింది.

ఎవరని చెప్పాలీ నేనూ....ఏమని చెప్పాలీ నేనూ...

వలచిన రాధమ్మనూ విరహాన దించావు

పెంచినమ్మ యశోదనూ శోకాన ముంచావు

నీవు నేర్చినదొకటే -నిన్ను వలపించు కోవడం

నాకు తెలియని దొకటే - నా మనసు దాచుకోవడం

ఎవరని చెప్పాలీ నేనూ...ఏమనిచెప్పాలీ నేనూ.

ఆ నల్లనయ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాధమ్మను ఏనాడు తన దగ్గరకు చేర్చుకోలేదు. గోకులంలో బృందావనంలో యమున ఒడ్డున విరహగీతాలను ఆలపిస్తూ ఏనాడైనా అతనికి కనికరం కలగకపోతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది రాధ. రాధమ్మ సరే...మరి తల్లి యశోద సంగతి ? అల్లారుముద్దుగా తనని పెంచినందుకు ఏం చేసాడు. పెరిగి పెద్దవాడై గోకులాన్ని, గోపాలకులని విడిచిపెట్టి వెళ్ళడమే కాక వారితో పాటు ఆ పల్లెలో తనకో తల్లి ఉందని తనతోటిదే లోకంగా బతికిందని మర్చిపోయి దేవకీ నందనుడిగా ద్వారకలో వెలిగిపోయాడు. తల్లిని మరచాడు, చెలినీ మరచాడు.

అతనిగురించి ఇప్పుడు ఇక్కడ ఈ చెలికి అర్థమైన విషయం ఒకటే. అతనికి ఎన్నో విషయాలు తెలుసు. ఎంతో అనుభవజ్ఞుడు. ఎన్నోనేర్చాడు. వాటిలో జగమంతా అతన్ని విశ్వప్రేమికుడిగా భావించి అతని ప్రేమలో లీనమైపోయేలా చేయడం - ఇది అన్నిటికన్నా అతనికి బాగా తెలిసిన విద్య. కానీ ఆ గోపాలుడిని ప్రేమించిన ఆ బాల ఒట్టి ముగ్థ. కేవలం నల్లనయ్యనే సర్వస్వమని నమ్మింది. ఏకళలూ తెలియని బేల. అందుకే తన మనసును ఎప్పటికప్పుడు అతని ఎదుట విప్పి చెప్పి అతనిపై ప్రేమను ప్రదర్శించింది. కోరిచేరిన ఆడమనసు ఎవరికైనా అలుసే. అందుకే గోపాలుడికి ఆమె మీద అంత నిర్లక్ష్యం. అది ఇప్పుడు గ్రహించింది ఆమె.
వెన్నయినా మన్నయినా ఒకటే అన్నావు

దొంగవయిన గానీ దొరవై నిలిచావూ

ఎంత మరవాలన్నా మనసును వీడిపోనంటావూ

ఎంత కలవరించినా కనులకు కానరాకున్నావూ

ఎవరని చెప్పాలీ నేనూ....ఏమనిచెప్పాలీ నేనూ...


ఇక ఇక్కడ నుంచి మనకు కృష్ణతత్వం ఆవిష్కృతమవుతుంది. వెన్నతిన్నాడు, మన్నూ తిన్నాడు. ఆ మన్ను తిన్న నోటిని లోనే పదునాలుగు లోకాలనూ చూపాడు. వెన్ననీ మన్నునీ సమానంగా చూసిన ఆ కృష్ణ భగవానుడు భగవత్ స్వరూపుడుగా నిలిచాడు. చిలిపి దొంగతనాలు చేసి వ్రేపల్లె వాసులకు, గోపికలకు గుండెల్లో గుబులు పుట్టించాడు. దొంగ అయితేనేం దర్జాగా దొరగా మారిపోయి అనంతమైన గౌరవాలను, మర్యాదలను అందుకున్నాడు. కానీ తనను ప్రేమించినవారిపైన మాత్రం కినుక వహించాడు.

తనకోసం కలవరించే తన తల్లి యశోదను, తన రాధమ్మను, తన అడుగుల సవ్వడికై వేచి ఉండే యమునాతీరాన్ని, పొదపొదలో వెతుకుతూ తనని గాలించే గోపెమ్మలను అందరినీ మరిచాడు. రాజులా గా వెలగిపోతున్నాడు. తనను మరువలేక ప్రతి క్షణం తన నామజపమే చేస్తూ, ఒళ్ళంతా కళ్ళై వేచి ఉన్న తనవారి చూపులకు అందనంద దూరంగా అందలాలెక్కి ఉన్నవాడు...
ఆ నల్లనయ్య ఇప్పుడు ఈ క్షణాన ఎదురుపడితే తనను గుర్తించలేకపోతే.....
ఎవరని అడిగితే...
ఇక తాను ఏమని చెపుతుంది..
ఏమని చెప్పాలి.....??
నల్లనయ్యా...ఎవరని అడిగావా నన్నూ..అంటూ తన నయనాల కరువు తీరా రోదించడం తప్ప!!

వలచిన హృదయం తానే నేనని, నేనే తానని నమ్ముకొని ఉండగా తాను వేరు, నేను వేరు అని అతనిచేత భావించబడి తిరస్కారానికి గురై తే పొందే వేదనను కృష్ణుడిపరంగా అన్వయిస్తూ రచించిన అతి చక్కని సాహిత్యం ఈ పాటలో మనం చూస్తాం.

ఈ పాట రచన దాశరథి.

సంగీతం చక్రవర్తి సమకూర్చగా పి. సుశీల తన కమ్మని కంఠంతో పాటకు
జీవం పోసారు