Wednesday, September 28, 2011

కవి గుండెకు రాజు పెట్టినకోత - జాషువాచెప్పిన' పిరదౌసి' కత

  కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
  పంజరాన గట్టు వడను నేను
  నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
  తరుగులేదు విశ్వనరుడ నేను

ఏ సమాజంలో అయితే కులం, మతం అనేవి వ్యక్తి లోని వ్యక్తిత్వానికి కాక వారి బాహ్య అస్థిత్వాన్ని నిర్ణయించే ప్రాతిపదికలు అవుతాయో అలాంటి సమాజాన్ని త్రోసిరాజని, ఆ కులమతాల పంజరంలో తాను చిక్కబోనని, లోకం తన గురించి ఏమనుకున్నా తాను విశ్వం మొత్తానికి చెందిన మానవుడిని అని చెప్పుకున్న గొప్ప మానవతావాది గుఱ్ఱం జాషువ.


1895 సం. సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాషువ రచనలలో చాలా కావ్యాలలో కథా వస్తువుకు, ఆయన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. బాల్యంనుండి తన కులం వలన తాను పొందిన అనుభవాలు బాధామయమైన జీవితంలోని అనేక సంఘటనలు ఆయన రచనలలో అనుభూతులను, ఆవేదనను అత్యంత కరుణరసాభినివేశంతో వెల్లడించారు జాషువ. అస్పృశ్యత ను నిరసించడం, మూఢాచారాలను గర్హించడం, జాతీయోద్యమం, స్త్రీజన అభ్యుదయ కాంక్ష మొదలైనవి  జాషువ రచనలలో ప్రధానంగా కనిపించే అంశాలు.
కాదేదీ కవితకనర్హం అంటూ ఆయన తరువాత కాలంలో శ్రీశ్రీ చెప్పినా జాషువ గారు స్పృశించిన కవితా వస్తువులను చూస్తే నిజమే ననిపిస్తుంది.


జాషువ గారి కవితలో   సంప్రదాయ కవిత కాలంనుంచి, భావకవిత్వ యుగం వరకు  కనిపించే ప్రభావాలన్నీ కనిపిస్తాయి. సంప్రదాయ కవిత్వంలో లాగే పద్యాలతో కావ్య రచన చేసినా అందులో సరళ వ్యావహారిక పదాలను అందులోనూ అరబ్బీ, పారశీకం, ఆంగ్ల భాషల పదాలను కూడా అలవోకగా ప్రయోగిస్తూ రచనలు చేసారు. కొన్ని రచనలలో భగవంతుడిమీద నమ్మకం కలిగిన ఆస్తికుడిగాను, మరికొన్ని రచనలలో నిరీశ్వర తత్వం తోను రచనలు చేసి నాస్తికుడిగాను కనిపించినా జాషువ రచనలద్వారా ప్రధానంగా మనం గ్రహించగలిగే తత్వం - ఆయన లోని మానవత్వం.


'క్రీస్తు చరిత్ర' పేరుతో  జాషువ రచించిన కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడెమీ వారి బహుమతి 'పద్మ భూషణ' బిరుదు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలంయం నుండి ' కళా ప్రపూర్ణ '  పొందారు. తన కావ్యరచనా పటిమకు ప్రజలనుండి నీరాజనాలు అందుకున్నారు. గండ పెండేరం తొడిగించుకున్నారు. గజారోహణం చేసారు. కనకాభిషేకాలు చేయించుకున్నారు. కవి కోకిలగా, నవయుగ కవి చక్రవర్తిగా, కవి దిగ్గజంగా,  మధుర శ్రీనాధుడు గా ప్రజల లో కీర్తించబడ్డారు.

ఒకడు ప్రోత్సహింప నొక్కడు నిరసింప
నొకడు చేరబిలువ నొకడు తరుమ
మిట్ట పల్లములను మెట్టుచు నెట్టులో 
పలుకులమ్మ సేవ సలిపినాడ

అంటూ లోకం తనను ఎన్ని విధాల  తిరస్కరించినా, సత్కరించినా ఎక్కడా నిరుత్సాహ పడక పోవడమే కాక పూర్ణోత్సాహంతో తన కవితా ప్రస్థానాన్ని సాగించానన్నారు జాషువ. తిరుపతి వేంకట కవులలో ఒకరైన కవిదిగ్గజం చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి వంటి మాన్యులతో గౌరవంగా గండపెండేరం తొడిగించుకున్న అదే జాషువ, మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ వంటి వారి చేత అవమానాలు పొందారు. కానీ దూషణ భూషణాలను సమానంగా భరిస్తూ  మొక్కవోని దీక్షతో సాహితీ వ్యవసాయాన్ని కొనసాగించిన స్థితప్రజ్ఞత జాషువకు మాత్రమే చెల్లింది.


ఇటువంటి తన జీవిత కాలంలో తాను పొందిన అనుభవాలను తాను పొందిన సన్మానావమానాలను ఎంతో సమర్థంగా కమ్మని కావ్యరూపం ఇచ్చి నా కథ అనే పేరుతో పద్యాలలో రచించారు.

తెలుగువారికి మాత్రమే చెందిన పద్య ప్రక్రియలోనే రచనలు చేసినా అందులో కవిగా తన స్వాతంత్య్ర దృష్టిని ప్రకటించారు.  ఆధునిక దృష్టితో, వ్యావహారిక శైలిలో గుండె లోతుల్లోనుండి పొంగి వచ్చిన కవితా ప్రవాహం అనదగిన చిక్కని కవిత్వం రాస్తూ అందమైన అచ్చతెలుగు పదాలతో పాటు అరబ్బీ, పార్శీ, సంస్కృతం లాంటి ఇతర భాషల పదాలను కూడా సందర్భానుసారం, అత్యంత భావగర్భితంగా ప్రయోగిస్తూ
తెలుగు పద్యానికి కొత్త సొబగులు అద్దారు జాషువ.


కులమతాలనే కుళ్ళుతో కునారిల్లుతున్న సమాజంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులనుండి  సమ సమాజం, సమతావాదపు పునాదులతో ఏర్పడాలని కోరుకున్నారు జాషువ.


జాషువ పద్య కృతులు హిమధామార్కధరా పరిణయం, శివాజీ ప్రబంధం, కన్యకా పరమేశ్వరి మొదలయినవి.ఇవి మొత్త ఏడు సంపుటాలలో ప్రకటించబడ్డాయి.

రక్తగానం అనేపేరుతో గల రచన యుద్ధ ప్రచార గీతాల సంకలనం. 

ఫిరదౌసి,ముంటాజ్ మహల్, క్రీస్తుచరిత్ర, గబ్బిలం, నాగార్జున సాగరం, స్వయం వరం, నేతాజీ, కాందిశీకుడు, రాష్ట్ర పూజ, కొత్తలోకం, ముసాఫరులు,బాపూజీ  అనే ఖండ కావ్యాలు, దావీదు చరిత్ర , ధ్రువ విజయము, చిదానంద ప్రభాతము, రుక్మిణీ కల్యాణం, మీరాబాయి, తెరచాటు  జాషువ రచించిన నాటకాలు. ఇంకా చిన్నానాయకుడు, కుశలవోపాఖ్యానం అనే వచన రచనలు కూడా చేసారు. కానీ జాషువ రచనలలో గద్యం కన్నా పద్యరచనలకే ఎక్కువ ప్రజాదరణ లభించింది.


జాషువ రచనలలో పిరదౌసి కావ్యం చాలా విశిష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానమైన కథాంశం - గజనీ మహమ్మద్ అనే రాజు చేతిలో మోసపోయి ఆ అవమానంతో బాధతో చేయని నేరానికి శిక్షను అనుభవించిన పిరదౌసి అనే పారశీక కవి జీవితంలోని వేదనను కావ్యంగా మలచడం.


గజనీ మహమ్మదు అనే ఆఫ్ఘను దేశపు రాజు పారశీక కవి అయిన పిరదౌసిని పిలిపించి తన వంశ చరిత్రను కావ్యంగా రాయమని, ఆ కావ్యాన్ని తనకు  అంకితం ఇవ్వమని కోరతాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు దీనారం చొప్పున బహుమతి ఇస్తానని అల్లాపై ఒట్టు వేసి  కవికి వాగ్దానం చేస్తాడు. కవి పిరదౌసి ఎంతో సంతోషించి కవి ముప్ఫయి సంవత్సరాల పాటు కష్టపడి అరవై వేల పద్యాలతో రాజుగారి వంశ చరిత్రను, ఆ రాజుల పరాక్రమాలను వర్ణిస్తూ అత్యంత ప్రతిభతో కావ్య రచన చేసాడు.  

ఈ కావ్యరచన చేసినప్పుడు ప్రకృతిలో ఒక భాగంగా ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ , తన అనుభవాన్ని తన రచనలోకి అనువదిస్తూ కవి ఎంత గొప్పగా ఆ కావ్య రచన చేసాడో  జాషువ వర్ణిస్తారు. కవిని కన్న తల్లి గర్భము ధన్యమయింది అంటారు జాషువ. అటువంటి కవి రచనని అంకితంగా అందుకున్న కృతి భర్త అయినవాడికి కూడా మరణం అంటూ ఉండదు. కావ్య రచన చేసినవాడు, దానిని అంకితం పొందినవారికి కూడా ఎప్పుడూ మరణమనేది ఉండదంటారు జాషువ. ఎంతో కష్టపడి  తాను రచించిన షానామా గ్రంథాన్ని ముగించి రాజుగారికి అంకితం ఇచ్చాడు పిరదౌసి. రాజు చాలా సంతోషించాడు. మరునాడు సభకు వచ్చి ఆ కావ్యాన్ని పఠించమని అడిగాడు.


పూలమాల చేతపట్టుకుని లజ్జావతియై సభాప్రాంగణంలోకి ప్రవేశించే రాజకుమార్తెలా పిరదౌసి తను రచించిన కావ్యాన్ని చంకలో పెట్టుకుని తనకు లభించబోయే అత్యున్నతమైన గౌరవాన్ని గురించి ఊహిస్తూ ఉత్సాహంగా సభలోకి ప్రవేశించాడు పిరదౌసి.  తనను వరించబోతున్న కావ్యకన్యను గ్రహించబోతున్న గజనీ మహమ్మదు సభలో సింహాసనం పై కూర్చొని కొత్త పెళ్ళికొడుకులా చిరునవ్వుతో ప్రకాశిస్తున్న మోముతో  కవి పిరదౌసి ని కావ్య పఠనం చేయమని ఆదేశించాడు. 

బయటకు ప్రకాశిస్తూ ఉన్న లోపల డొల్లగా ఉండే కరిమింగిన వెలగపండు వంటి జ్ఞానంతో పెద్ద పెద్ద బొజ్జలతో,  మీసాలు దువ్వుతూ ఉన్న తురుష్కపండితులు నిండి ఉన్న సభలో  తన కావ్యాన్ని పఠించడం ప్రారంభించాడు పిరదౌసి.  అరవై వేల పద్యాలను తన కల్పనాశక్తితో , గుర్రంలా కదనుతొక్కే పద్యగమనంతో చదువుతూ సభలోని రాజును, పండితులను కూడా అలరింపజేసి  కావ్య పఠనం పూర్తిచేసి తనకు కలగబోయే గౌరవ సన్మానాలను ఊహిస్తూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు పిరదౌసి.


కానీ కవి ఊహించినది వేరు, జరిగినది వేరు. పిరదౌసి రచించిన కావ్యం లోని మాధుర్యాన్ని ఎంతగానో అనుభవించి, ఉత్తేజితులై కూడా రాజుగారు కవికి తను బాస చేసినట్టు బంగారు దీనారాలను కాక ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క వెండి నాణెం  చొప్పున రాజు  అతని ఇంటికి పంపించారు.  దానికి కారణంగా జాషువ గారు ఇక్కడ ఓ పదం వేసారు.
పండితులేమి చెప్పిరో అంటూ. దేవుడు వరమిచ్చినా పూజారి కూడా కనికరించాలంటారు. రాజు దగ్గర ఉన్న పండితులు ఈర్ష్యాసూయలతో  కల్మషం నింపుకొని పిరదౌసి గురించి అతని కావ్యాన్ని గురించి చెప్పిన చెడ్డమాటలు రాజు మనసులో కూడా విషాన్ని నింపాయి. అందుకే పిరదౌసి కి తాను చేసిన వాగ్దానాన్ని దాటి రాజు ఒక్కొక్క పద్యానికి బంగారు నాణాలకు బదులు, వెండి నాణాలు పంపించాడు.  రాజు చేసిన ఈ మోసానికి పిరదౌసి గుండె దహించుకుపోయింది. భరించలేని అవమానంతో, వేదనతో అతని శరీరంలోని రక్తమాంసాలతో పాటు మనసు కూడా ఉడికిపోయింది.


ఎన్నో కొండలు గుండెలోఁగరఁగి పోయెన్, వార్ధి సంతానముల్ 
గన్నీరయ్యె, సమస్త లోకము నిరాకారస్థితింబొల్చె, ను
త్పన్నం బయ్యె విషాద మేఘ పటలధ్వాంతౌఘ,మాశాలతల్
సున్నాలయ్యె నగాధ కూపజలరాసుల్ దోఁచెఁ బిర్దౌసికిన్


అన్న పద్యంలో రాజుగారు చేసిన అవమానాన్ని  భరించలేని పిరదౌసి  ఆవేదనను, మానసిక స్థితిని అద్భుతంగా వర్ణించారు జాషువ. రాజు పంపిన కానుకను, తిరస్కరించి పంపివేసాడు పిరదౌసి. తాను నిర్మించుకున్న ఆశా సౌధాలు నేలకూలిపోగా ఆవేదనతో , దుర్బరమైన మానసిక వ్యథతో  రాజు తనకు చేసిన అవమానాన్ని నిరసిస్తూ ఓ లేఖ రాసి రాజుకు పంపించాడు.

ప్రపంచ సాహిత్యంలో లేఖారచన - గొప్ప సాహితీ  ప్రక్రియగా  ఎంతో ఆదరణ పొందిన ప్రక్రియ.   లేఖల ద్వారా తమ మానసికమైన అనుభూతులను అద్భుతంగా వర్ణించి కావ్యస్థాయికి చేరిన వర్ణనలతో, కల్పనలతో కూడినవి సాహిత్యంలో అత్యున్నతమైన స్థాయిని అందుకున్న రచనలెన్నో.  జాషువ - పిరదౌసి తనకు రాజు కలిగించిన ఆశా భంగాన్ని వర్ణిస్తూ గజనీ మహమ్మదును సంబోధిస్తూ అతనికి రాసిన లేఖ అటువంటి గొప్ప అనుభూతిని కలిగించే రచన.

ఆ లేఖ ఈ విధంగా ఉంటుంది. పిరదౌసి రాజును సంబోధిస్తూ రాసిన లేఖ కనుక సందర్బంలో కవి ఓ సుల్తాను మహమ్మదూ అంటూ రాజును సంబోధిస్తారు.
ఓ సుల్తాను మహమ్మదూ కృతకవిద్యుద్దీపముల్ నమ్మ యా
శాసౌధంబును గట్టికొంటి నది నిస్సారంపుటాకాశమై
నా సర్వస్వము దొంగిలించి నరకానం గూలిపోయెన్ వృథా
యాస ప్రాప్తిగ నిలినాఁడనొక దుఃఖా క్రాంత లోకంబునన్ 


పిరదౌసి సుల్తాను తనకు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆశాభంగం పొందడాన్ని గురించి ఇలా అంటాడు.  "ఓ సుల్తాను మహ్మదూ, నకిలీకాంతులు నమ్ముకొని ఆశా సౌధాన్ని కట్టుకున్నాను. కానీ అది ఏ వెలుగూలేని చీకటినిండిన ఆకాశంలో, నరకంలో కూలిపోయింది. చేసిన పని అంతా నిష్ప్రయోజనం కాగా చీకటి లోకంలో నిలిచిపోయాను.
ఇక నా కలంలో మసి అనే సిరా నిండిపోయింది.  విషాద గీతాలను మాత్రమే రచించగలను. నీకు చేసిన ముప్పయి ఏళ్ళ సేవకు ప్రతిఫలంగా నాకు వయస్సు పట్టుతప్పి, వార్థక్యం అలముకున్న  శరీరం మాత్రమే మిగిలింది."


ఒక్కొక్క పద్దియంబునకు నొక్కొక్క నెత్తురు బొట్టు మేనిలోఁ
దక్కువగా రచించితి వృథా శ్రమయయ్యెఁ గులీనుడైన రా
జిక్కరణిన్ మృషల్ పలుకునే కవితాఋణమీయకుండునే
నిక్కమెఱుంగనైతి గజనీసులతాను మహమ్మదగ్రణీ.


అల్లా తోడని పల్కి పసిఁడి కావ్య ద్రవ్యమున్ వెండితో
జెల్లింపన్ దొరఁకొన్న టక్కరివి నీచేఁ బూజితుండైనచో
నల్లాకున్ సుఖమే మహమ్మదు నృపాలా సత్యవాక్యంబెవం
డుల్లంఘింపడొ వాఁడెపో నరుఁడు, ధన్యుండిద్ధరా మండలిన్.


"ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క నెత్తురు బొట్టు కర్చు అవుతూఉండగా నీ వంశ చరిత్రను రాసాను. కవితకు బహుమతి ఇస్తానన్నావు. మంచి వంశంలో పుట్టిన వాడివికదా మరి. ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేయవచ్చునా రాజా?
నీవు చాలా టక్కరి వాడివి సుమా. అల్లా తోడుగా నాకు బంగారం దీనార్లు చెల్లిస్తానని చెప్పి, వెండి నాణాలను పంపించావు. ఈ విధంగా అబద్ధాలాడే నీలాంటి మోసగాడితో పూజించబడితే అల్లాకు సుఖంగా ఉంటుందా చెప్పు.
ఎవడైతే సత్యవాక్పరిపాలన చేస్తాడో వాడే ఈ భూమ్మీద గొప్పవాడు" అంటూ పిరదౌసి  రాజుకి సత్యవాక్య పరిపాలన గొప్పతనాన్ని చెప్తాడు.

హాయిగ నీ యశస్సు వెలయం గల చక్కని మేడఁగట్టి దీ
ర్ఘాయువుఁబోసినాడను తదన్వయవల్లికి వట్టి చేతులన్
బోయెద నంధకారమున మున్గి సుఖంబులఁబొద్దు గ్రుంకె రా
జా యికఁ దాండవించెద భయంకర ఖేద తమాల వాటికన్.


సుల్తాను వంశ ప్రతిష్టను పెంచేవిధంగా తాను రాసిన కావ్యం వలన అతని వంశం తరతరాల పాటు వర్థిల్లే విధంగా  కీర్తి అనే మేడకట్టి దానికి వంశ చరిత్ర అనే తీగను పాకించి సుదీర్ఘకాలం మన్నేలా చిరాయువు పోసానని, కానీ సుల్తానుకు ఇంత చేసిన తాను ఒట్టి చేతులతో వెళుతున్నానని, ఇక తన జీవితంలో సుఖాల పొద్దులు గ్రుంకి పోయాయని, చీకటి తోటలలో తానిక ఒంటరియై దుఃఖంతో తాండవిస్తానని అంటాడు పిరదౌసి.


దిరముగ బానిసీని నభిషేక మొనర్చితి మల్లె పూవుట
త్తరు లొలికించి మాయ జలతారున రాదు గదా పసిండి యో
కఱకు తురుష్క భూపతి యఖండ మహీవలయంబునందు నా
శిరమునఁబోసికొంటిని నశింపని దుఃఖపు టగ్నిఖండముల్.


గజనీ మహమ్మదు వంశం బానిస రాజుల వంశం. అందువల్ల జాషువ పిరదౌసి తో ఇలా అనిపిస్తారు. ఓ కఱకు తురుష్క భూపతీ అంటూ  రాజుగారిని సంబోధిస్తూ  పిరదౌసి ఇలా అంటాడు. "నేను ఒక బానిస రాజును మల్లెపూల అత్తరుతో అభిషేకించాను అదే నేను చేసిన తప్పు. నకిలీ జరీ వస్త్రం లోంచి బంగారం తీయాలనుకుంటే సాధ్యం అవుతుందా. ఇక ఎప్పటికీ ఆరిపోని  నిప్పుకణికల లాంటి దుఃఖాన్ని నా నెత్తిన పోసుకున్నాను."


అలసటఁదీర్చుకొందును మహమ్మదు రాజులతో సమాధి శ
య్యలపయి ముప్పదేఁడుల ప్రయాసకు డెందము గందిపోయె ని
ర్మలమగు చిత్తశాంతి కిఁక మార్గము లేదెనలేని పండు వె
న్నెల గురియించు నా కవిత నీకు లభించె నసత్యవాదికిన్.


"ముప్పయి ఏళ్ళపాటు నేను చేసిన ఈ కావ్యరచన అనే శ్రమవలన నా మనసు అలసిపోయింది. ప్రశాంతమైన మనసుతో జీవించే అవకాశం నాకిక లేదు.  మహమ్మదు రాజుల కోసం కట్టిన సమాధులనే పడకగా చేసుకొని వాటిమీదనే విశ్రమించి నా అలసటను తీర్చుకుంటాను. నీవు ఎంతో అదృష్టవంతుడివి.  నీవంటి అసత్యవాదికి పండు వెన్నెల కురిపించే కవితని బహూకరించినందుకు నాకు తగిన సత్కారమే లభించింది సుమా!!"


పిరదౌసి ఈవిధంగా తనను సంబోధిస్తూ రాసిన లేఖను అందుకున్న రాజుగారికి కళ్ళు ఎర్రబడ్డాయి.
 చాలా కోపించాడు. ఆవేశంతో ఊగిపోయాడు. చుట్టూ ఉన్న పరిజనంలో పిరదౌసి పై ఈర్ష్యపడే కవులూ ఉన్నారు. వారు రాజును  మరికొంచెం రెచ్చగట్టారు. పిరదౌసి పాటి కవిత్వం  చెప్పగలిగే కవులెందరో తమలోనూ ఉన్నారని, పిరదౌసి రాసిన కావ్యంలో రాజుగారి వంశానికి కీర్తి కన్నా అపకీర్తి ఎక్కువ కలిగే అంశాలే ఉన్నాయిని వాళ్ళు రాజుగారికి చెప్పారు.  అయినా నల్లని తేనెటీగలు తెల్లని మల్లెపూల నడుమ తిరుగుతున్నా వాటి నలుపు మల్లెలకు అంటనట్టే రాజుగారి వంశం గురించి తక్కువ చేసి రాసినా  రాజుగారి వంశ మర్యాదకు భంగం కలగదంటూ పిరదౌసి పై రాజు కోపం ఇనుమడించేలా మాట్లాడారు.


నరపతి ప్రేమతో నొక తృణంబొ పణంబొ యెసంగె దానితోఁ
గరము వహింప కిక్కరణిఁ గాఱులు కూయునే పారసీకుంఢె
వ్వరు రచియింపలేరితని పాటి కవిత్వ మటంచుఁ బల్క జొ
చ్చిరి సభలోన నిచ్చకపు జీతములందెడు పండితబ్రువుల్


"రాజుగారు కరుణించి ఇచ్చిన తృణమో పణమో  కిమ్మనకుండా తీసుకొని ఊరుకోకుండా, ఈ విధంగా కారుకూతలు కూస్తాడా, ఈ పాటి కవిత్వం మేము మాత్రం చేప్పలేమా" అంటూ పండితులు రాజుగారిని ఎగదోసారు. వాళ్ళు
" ఇచ్చకపు జీతములందెడు పండితబ్రువుల్ " అనడంలో ఈనాడు కూడా  ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారికి ఇచ్చకాలు చెప్పేవారు తలచుకుంటే ఏ విధంగా అయినా చేయగలరని, వారి దయా దాక్షిణ్యాల పైనే కళాకారుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుందనీ అన్యాపదేశంగా చెప్పారు జాషువ. వెంటనే రాజు కోపంతో ఊగిపోయి పిరదౌసిని పట్టి బంధించి అతనిని వెంటనే చంపమని ఆజ్ఞ ఇచ్చాడు తన సేవకులకు.


రాజుగారి సభలో సత్కవులు, ప్రతిభను గుర్తించే వారు ఉన్నారు. వారు మాత్రం రాజు చేస్తున్న ఈ పనికి చాలా బాధ పడ్డారు. రాజు అప్పటికే ఎంతో దుర్మార్గుడని పేరు పొందినవాడు. ఇక "ఇక్కడితో అతని పాపం పండినట్టుంది, అందుకే సత్కవి అయిన పిరదౌసిని చంపదలచుకున్నాడు ఈ రాజు అని " అనుకున్నారు.  ఆశాభంగం వలన కలిగిన దుఃఖంతో ఉడికిపోతున్న కవి రక్త పాతం వలన రాజుకి ఇక అమంగళం జరుగుతుందని భావించారు ఆ ధర్మపరులు.


రాజు తలమీఁద గవి కప్పురంబు చల్లె
సుకవి తలమీఁద రాజు నిప్పు కలు విసరె
కొందఱే పుణ్యమో చేసుకొనియె ననిరి
కొందఱే పాపమో పట్టి కుడిపెననిరి
రాజు తన వంశచరిత్రను కావ్యంగా రాయమని అడిగితే పిరదౌసి ఎంతో మహాద్భుతమైన కావ్యరచనా శక్తితో కావ్యాన్ని రచించి  రాజుకి అంకితం ఇచ్చి అతని తల మీద కర్పూరం చల్లాడు ట. కానీ అటువంటి కవిని గౌరవించి నెత్తిమీద పెట్టుకుని పూజించవలసినది పోయి రాజు  పిరదౌసి తలమీద నిప్పులను రాళ్ళలాగా చేసి విసిరాడుట. ఉపకారానికి అపకారం చేయడం అంటే ఎలా ఉంటుందో అన్న భావనని ఎంత అద్భుతంగా చెప్పారు జాషువ !! కొందరే పుణ్యమో చేసుకొనియె ననిరి అన్న వాక్యం రాజుకి వర్తిస్తుంది. ఏదో పూర్వజన్మ పుణ్యం వలన రాజు ఇటువంటి కావ్యాన్ని అంకితంగా పొందాడు అని కొందరు భావించారుట. కానీ మరికొందరు పిరదౌసి గురించి  ఏ పూర్వ జన్మ పాపమో ఇతనిని పట్టి కుడుపుతోంది కదా అని బాధ పడ్డారుట. భారతదేశం లో మానవసమాజంలో లోతుగా పాతుకు పోయిన భావన కర్మ సిద్ధాంతం ఇక్కడ జాషువ గారి పద్యంలో కనిపిస్తుంది. మనుషులు చేసిన, పొందిన అనుభవాలన్నిటినీ కర్మసిద్ధాంతాన్ని ఆపాదించి గాఢంగా నిట్టూర్చి  అది అంతే అంటూ వాటిని సరిపెట్టుకునే మనస్తత్వాన్ని ఇక్కడ చూపారు జాషువ.


కానీ ఒక పుణ్యాత్ముడు పిరదౌసిని వధించడానికి బయలుదేరిన సైనికుల కన్నా ముందుగానే బయలుదేరి, పిరదౌసిని చేరుకొని రాజుగారి ఆదేశాన్ని వినిపించి అతనిని అక్కడనుంచి పారిపోమని హెచ్చరించాడు.


అరువది వేల దిన్హరము లస్త్రములై తుద కిట్లు కుత్తుకన్
దఱకుట కుద్యమించిన విధానము సర్వము నాలకింపఁగా
పిరదవుసీ ముఖాబ్జమునఁ బిన్నని నవ్వుదయించె మింట నీ
శ్వరుండు కలండొ లేఁడొ యను సంశయమున్ దళుకొత్తె నెమ్మదిన్


రాజుగారి ఆజ్ఞ విన్న పిరదౌసి హతాశుడయ్యాడు. తాను రాజుగారి ప్రీతి కోసం రచించిన కావ్యంలోని అరవై వేల పద్యాలు     అరవై వేల ఆయుధాలుగా మారిపోయి చివరకు తన కుత్తుకను కోయడానికి ప్రయత్నం చేయడాన్ని ఊహించిన పిరదౌసి కి ఒళ్ళు జలదరించింది.


అసలు ఆ పైన దేవలోకంలో భగవంతుడు  అనేవాడు ఉన్నాడా?  ఉంటే  ఈ అన్యాయాన్ని చూడకుండా ఏం చేస్తున్నాడు?  అనే సదస్త్సంశయానికి లోనయ్యాడు. ఆ ఆలోచన క్రమంగా అతనిలో ఓ నైరాశ్య భావానికి లోను చేసింది. చివరకు అతని ముఖం పై ఓ సన్నని నవ్వు ఉదయించింది. ఈ పద్యంలో బీభత్సరస ప్రధానమైన ఓ సన్నివేశం చిత్రించారు జాషువ. పిరదౌసి ముఖంలో కనిపించిందని కవి వర్ణించిన చిరునవ్వు పాఠకుడి మనసులో తీవ్రమైన అలజడి సృష్టిస్తుంది.


కృతి యొక బెబ్బులింవలె శరీరపటుత్వము నాహరింప శే
షితమగు నస్థి పంజరము జీవలంబున నూఁగులాడఁగా
బ్రతికియుఁ జచ్చియున్న ముదివగ్గు మహమ్మదుగారి ఖడ్గ దే
వతకు రుచించునా పరిభవ వ్యధ యింతట నంతరించునా


అంటూ తను రచించిన షానామా కావ్యం ఒక బెబ్బులిలా తనపైన పడి తనలోని జవసత్వాలన్నీ ఆరగించగా కేవలం అస్థిపంజరంలా మిగిలిఉన్నానంటూ, ఇటువంటి ముసలివాడి శరీరం మహమ్మదు గారి ఖడ్గదేవతకు బలి గా ఇస్తే ఆ దేవత సంతోషిస్తుందా అనుకున్నాడు.


ముత్యముల కిక్కయైన సముద్రమునను
బెక్కుమాఱులు మున్కలు వేసినాఁడ
భాగ్య హీనుఁడ ముత్యమ్ము పడయ నయితి
వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు


ముత్యాలకు నిలయమైన సముద్రంలో ఎన్నో సార్లు మునకలు వేసాను. కానీ ఎంత భాగ్యహీనుడిని. ఒక్క ముత్యాన్నయినా సంపాదించుకోలేక పోయాను. సరికదా ఆ సముద్రమే నన్ను మింగడానికి నోరుతెరిచింది అంటూ ఓ పద్యాన్ని ఆ ఊరి మసీదు గోడలమీద లిఖించి ఆ అర్థరాత్రి సమయంలో భార్యను, పుత్రికను తీసుకుని ఊరువిడిచి తన స్వగ్రామమైన తూసు పట్టణానికి వెళ్ళిపోయాడు పిరదౌసి. వేకువజామునే ప్రార్థన కోసం వచ్చిన భక్తులు ఈ పద్యాన్ని చదువుకొని ఒళ్ళు జలదరించగా పిరదౌసి మీద జాలితో కదిలిపోయారు.


మరి కొన్నేళ్ళకు మహారాజుగారికి పశ్చాత్తాపం కలిగింది. తను చేసిన ఘోరాపరాధాన్ని తెలుసుకున్నాడు. కవికి తాను చేసిన ద్రోహానికి చాలా బాధ పడ్డాడు. పిరదౌసి కవికి తాను ఋణ పడిన బహుమతి మొత్తాన్ని అరవై వేల బంగారు దీనారాలను ఒంటెలపైకి ఎత్తించి  భటులకు చెప్పి పిరదౌసి కి చెల్లించమని తూసు పట్టణానికి పంపించాడు.


కానీ విధి బలీయమైనది. మనం తలచుకున్నది ఏదీ జరగదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. రాజు పంపిన బహుమతి మొత్తం పిరదౌసి కి చేరవేయడానికి రాజు బలగం తూసు పట్టణం తూర్ప ద్వారానికి చేరుకున్నది. కానీ అదే సమయానికి కవి పిరదౌసి తీరని దుఃఖంతో,  చేసిన మంచి పనికి గుర్తింపు లేకపోవడమే కాక, చేయని నేరానికి పొందిన శిక్ష  గా అకాల వార్థక్యాన్ని పొంది అవమానంతో అలమటిస్తూ మరణించగా అతని శవం పడమటి ద్వారం ద్వారా స్మశానానికి బయలుదేరింది.


రాజ భటులు మరేం చేయాలో తోచక ఆ ధనాన్ని పిరదౌసి కుమార్తెను స్వీకరించమని ప్రార్థించారు. కానీ అభిమానంలో తండ్రికి తగిన కూతురు పిరదౌసి కుమార్తె. ఆమె ఆ బహుమానాన్ని అంగీకరించలేదు సరికదా నా తండ్రిని నిరంతరం మరణించే వరకు దుఃఖ పెట్టిన ఈ నీచమైన ధనాన్ని నేను కంటితో కూడా చూడను, ముట్టలేను అంటూ తిరస్కరించింది. 


తాను కవి ఋణం తీర్చుకుందామనుకున్నా వీలుకాలేదని, సమయం మించిపోయిందని గ్రహించిన గజనీ మహమ్మదు ఎంతగానో బాధ పడ్డాడు. చేసిన పాపానికి నిష్కృతిగా తూసు పట్టణంలో ఒక గొప్ప సత్రాన్ని పిరదౌసి పేరు మీద  అతని పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్మిచాడు.  సమయం మించిపోయిన తర్వాత చేసిన  పని, మంచిపనే అయినా అది ఫలితాన్నివ్వదు. కవి పిరదౌసికి కీర్తి మిగిలింది. రాజుకు అపకీర్తి మిగిలింది. 


పిరదౌసి కావ్యాన్ని జాషువ గారు ఒక పారశీక కవి జీవితాన్ని చిత్రించడం అనే ఇతివృత్తం తోనే రచించినా తాను నివసిస్తున్న సమకాలిన సమాజంలోని వాస్తవాన్ని సామాజిక వాస్తవికతో చిత్రించడం వలన అది సజీవకావ్యంగా నేటికీ నిలిచిపోయింది. కవి స్వీకరించిన ఇతివృత్తానికి తగిన  సన్నివేశ కల్పన, పాత్ర చిత్రణలో - పాత్ర బహిరంతర స్థితిగతులను వర్ణించడంలో జాషువ చూపిన ప్రతిభా పాటవాలు పిరదౌసి పాత్రను నేటికీ సజీవంగా నిలిపాయి. సమకాలిన భారతీయ జీవితంలోని వ్యక్తుల మానసిక, సాంఘిక స్థితిగతులపైన, మానవ ప్రవర్తనపైన లోతైన అవగాహన కలిగిన కవిగా జాషువ తన ప్రతిభను పిరదౌసి కావ్యంలో  వ్యక్తీకరించారు.


"రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు" అని జాషువ గారు చెప్పిన  మాటలు జాషువ గారికే వర్తిస్తాయి. తెలుగు సాహితీ లోకంలో  మరణంలేని మహాకవి , గొప్ప మానవతావాది - అమరుడు మన గుఱ్ఱం జాషువ.


(గుఱ్ఱం జాషువాగారి నూట పదహారేళ్ళ జయంతి ఉత్సవం సందర్భంగా ఆ మహాకవికి  జోహార్లర్పిస్తూ)