Thursday, October 10, 2013

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!


ఓ తరానికి ఈ పాట అంటే మహా ఇష్టం. తెలుగు సినిమాలలో హాస్యం అంటే రేలంగే, రేలంగి అంటేనే హాస్యం. రేలంగిగారిమీద చిత్రించబడిన పాటల్లో ఇది ఒకటి.  రేలంగికి చాలామంది జంటగా నటించినా గిరిజతో నటించిన చిత్రాలు, పాటలు చాలా హిట్ అయ్యాయి. ప్రజలు ఆదరించిన జంట రేలంగి -గిరిజ. వారిద్దరి మీద చిత్రించబడిన గీతం ఇది.
ఈ పాట చిత్రీకరణ ఆరోజుల్లో ఎప్పుడూ ఉండేలా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టో, పార్కుల్లో డాన్సు చేస్తున్నట్టో కాకుండా ఒక జూపార్క్ లో చిత్రించబడడం విశేషం.
అమ్మాయి పల్లెటూరు అమ్మాయి. మంచి కట్టుబాట్ల మధ్య పెరిగింది. కొద్దిగా మోటుతనం, అమాయకత్వం నిండిన పడుచు. తండ్రి పల్లెటూరువాడైనా డబ్బు బాగా ఉంది కనుక కూతురుకి కొంచెం నాగీరకం నేర్పించి నాజూగ్గా కనిపించేలా  చెయ్యాలని, విదేశాలలో ఉండే డాక్టరుకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని కోరిక. అలాంటి అమ్మాయి పట్నవాసంలో పరిచయమయ్యాడు ఈ కుర్రవాడు. పట్నం చూపిస్తానంటూ ఇంటినుంచి బయటకి తీసుకువచ్చాడు. అదీ పాటకి సందర్భం.
 అబ్బాయి ఆ అమ్మాయికి వరసకి మామయ్య కాబట్టి -
 "ఓహోహో మామయ్యా ఇదేమయ్యా బలె బలెబాగా ఉందయ్యా.
ఇంటిని విడిచి షికారు కొస్తే ఎంతో హాయి కలదయ్యా...."
అంటూ తనకి  తండ్రి కట్టుబాట్ల మధ్యనుంచి దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఇంటిని విడిచి వచ్చి షికార్లు కొడుతున్నందుకు సంతోషం ప్రకటిస్తుంది.
అమ్మాయిని సంబోధిస్తూ ఆ మామయ్య తాము వచ్చిన చోటు గురించి చెప్తాడు.
"ఓహొహో అమ్మాయి ఇది కాలేజీ బలె బలె బతికిన కాలేజీ
మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠ చెబుతాయి"
అంటూ తాము జూ పార్క్ అని పిలవబడే జంతు ప్రదర్శనశాలకి వచ్చామని చెప్తాడు. జూలో బంధించబడిన జంతువులనుంచి మనం తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నాయంటూ, "మాటలు రాని మృగాలు సైతం మనిషికి పాఠం చెబుతాయి "అంటాడు.

ఇక్కడ జూ పార్కుని బతికిన కాలేజీ అనే పదంతో ప్రయోగించడమే సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ళపాటు ఆంధ్ర ప్రాంతాలలో  చాలామంది మద్రాసులోని జూని బతికిన కాలేజీ అని, మ్యూజియం ని చచ్చిన కాలేజీ అని పిలిచేవారు
పాలగుమ్మి పద్మరాజుగారు మొదటిగా  తన రచనలలో  మద్రాసు జూపార్కు గురించి రాస్తూ బతికిన కాలేజీ అనే పద ప్రయోగం చేసారని తెలిసింది. ఆ ప్రభావంతోనేమో ఆరుద్రగారు కూడా ఈ పాటలో జూపార్క్ ని బతికిన కాలేజీ అని సంబోధించారు. ఇది చాలా పాపులర్ అయింది కూడా. మద్రాసులో చూడదగిన స్థలాల జాబితాలో  బతికిన కాలేజీ, చచ్చినకాలేజీ అని చెప్పుకోవడం చాలామందికి తెలుసు.

పులి, సింహం వంటివి క్రూర జంతువులు. సాధుజంతువులను, మనుషులను వేటాడి భుజించే స్వభావం కలిగినవి. అవి అడవిలో నివసిస్తాయి. కానీ మనుషులు ఈవిధంగా వాటిని బోనుల్లో బంధించి ఉంచడం ఆ అమ్మాయికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే-
"పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగితే ప్రమాదమే"
 అంటూ అందుకే వాటిని ఇలా జూలో బంధించారా? అని అడుగుతుంది. అందుకు ఆ మామయ్య ఇలా అంటాడు.

"కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు"
 అంటూ మనుషుల్లో ఉండే క్రూర స్వబావం జంతువుల క్రౌర్యాన్ని మించిపోయిందని చెప్తాడు.  అంతే కాక క్రౌర్యం పెరిగిన మనిషిని, మృగాన్ని కటకటాలలో పెడతారు అంటూ మనుషులలో క్రూర స్వభావం ఉన్నవారు చివరకు జైలు శిక్ష అనుభవిస్తారని ఓ మంచి నీతి పాఠం చెప్తాడు. జూలో జంతువులయినా, మనుషులలో నేరస్వభావం ప్రదర్శించిన వారైనా వారి నివాసం కటకటాల గదుల్లోనే అనే విషయాన్ని ఆరుద్ర ఎంతో చక్కగా చెప్పారు.

"గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రాది"
 అంటూ జూపార్క్ లోని జీబ్రా  అనే జంతువును చూపించి దాని లక్షణాన్ని ఆమెకి వివరిస్తాడు మామయ్య.  జీబ్రా చూడడానికి గాడిదలాగా ఉంటుంది. ఒళ్ళంతా నలుపురంగు నిలువు చారలుంటాయి. ఈ జీబ్రాపేరు లాటిన్ లో అడవిగుర్రం అనే అర్థంతో ఉండే పదం. అందుకే ఆరుద్రగారు జీబ్రాని అమ్మాయికి పరిచయం చేస్తూ గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రా అంటూ ఆమె ఎప్పుడూ చూడని జీబ్రాని చూపించాడు.
జిరాఫీ ని చూపిస్తూ

"చుక్కల జిరాఫీ ఒంటెకు బంధువు" అని చెప్పాడు. ఒంటె చాలా ఎత్తుగా బాగా సాగిన మెడతో ఉంటుంది. అందుకే చూడడానికి ఒంటెలా ఉండే ఆఫ్రికన్ జంతువు జిరాఫీ లేత పసుపురంగులో చుక్కలు నిండిన చర్మంతో బాగా ఎత్తుగా, పెద్ద తల మెడతో ఉంటుంది అందుకని దాన్ని ఒంటె కి బంధువు అంటూ వివరించాడు.
ఆ పక్కనే కోతి జాతికి చెందిన చింపాంజీలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ జిరాఫీ ఒంటెకి బంధువయితే "మనిషికి బంధువు  ఈ చింపాంజీ" అని పరిచయం చేసాడు. మనిషి  ఈ రూపంలోకి రావడానికి ముందు కోతి ఆకారంలో ఉండే జంతువునుంచి పరిణమించాడని డార్విన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతం. అందుకే ఎంతో కాలంనుంచి  మనమంతా "కోతి నుంచి పుట్టాడు మానవుడు" అంటూ నమ్ముతున్నాం.

ఆరుద్రగారు కూడా దీన్నే దృష్టిలో పెట్టుకుని మనిషికి బంధువు చింపంజీ అంటూ ఆ అమ్మాయికి చూపించారు. కోతులను దగ్గరగా గమనిస్తే అవి మనుషులను ఎంత చక్కగా అనుకరించగలవో చూడగలం. అందుకే
"మనుషుల చేష్టలు కోతులవైతే - కోతి చేష్టలు కొందరివి"
 అంటూ కోతులు జంతువులు కనుక  జంతు స్వభావంతో మనుషులను అనుకరించడం లాంటివి చేస్తాయి. కానీ మనుషులు కోతి కన్నా అభివృద్ధి చెందిన జీవులు. మెదడు పెరిగింది. అయినా కొందరు తను మనిషిని అన్నమాట మరిచిపోయి కోతుల్లా ప్రవర్తించడం గురించి ఇలా అన్నారు ఆరుద్ర. కోతి వేషాలు అంటూ ఆకతాయిగా ఉండే మనుషులగురించి మనం అనుకుంటూ ఉంటాం. దానిగురించే  ఆరుద్ర ఇక్కడ చక్కగా విడమర్చి చెప్పి చీవాట్లు పెట్టారు.
"తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది"
 అంటూ అమ్మాయి మామయ్యని ఓ జంతువును చూపించి అడిగింది.

"ఏనుగు వంటిది నీటిగుర్రము దానికి తమ్ముడు ఖడ్గమృగం " అని చెప్పాడు మామయ్య. ఏనుగు లాగా పెద్ద శరీరంతో నోరు ను బాగా తెరుస్తూ ఉన్న ఆ జంతువు ఏనుగులాగా పెద్దగా ఉన్నా దాని పేరు నీటిగుర్రము అని చెప్పాడు మామయ్య. అంతే కాక ఆ పక్కనే ఉన్న మరో జంతువు ఉంది. అది కూడా ఏనుగు లాగే భారీ శరీరంతో తిరుగుతోంది. దాన్ని చూపిస్తూ నీటిగుర్రంలాగే అది కూడా పెద్ద శరీరంతో ఉందని దాని పేరు ఖడ్గ మృగం అని చెప్పాడు.

ఇక్కడ మనుషుల స్వభావం మీద మరో చురకవేసారు ఆరుద్ర.
"అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకూ అలమే తింటాయి" అంటూ.
నీటిగుర్రం, ఖడ్గమృగం రెండూ ఏనుగు లాగా అతి భారీ శరీరాలున్న జంతువులే కానీ అవి కేవలం ఆకూ అలములు తిని బతికే శాకాహార జంతువులు. మనుషుల్లో అధికులు అంటే సంపన్నులు పేదవారిని దోచుకుని తింటూ వారి రక్తమాంసాలను కష్టం రూపంలో దోచుకుని తమ సంపదను పెంచుకుంటారు. నీటిగుర్రం, ఖడ్గమృగం ఆకారంలో అధికమే అయినా అవి సాత్వికమైనవే అని చెప్తూ మనిషిలోని దుర్గుణాన్ని ఎత్తిచూపించారు.

జూ పార్క్ లో సందర్శకులు ఏనుగుపైన ఎక్కి ఒకసారి విహరించడానికి అవకాశం కల్పిస్తారు జూ వారు. ఆ మామయ్య, అమ్మాయి అలా ఆ జూలో ఏనుగును ఎక్కారు. ఏనుగుఅంబారీ ఎక్కడం అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు కదా. పాతకాలంలో రాజులు, చాలా గొప్పవారు మాత్రమే ఏనుగును ఎక్కగలిగేవారు. అందుకే అమ్మాయికి పట్టలేని సంతోషం కలిగింది.కానీ " రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా" అంటూ రాజులు ఎక్కే అంబారీపైన సామాన్యులమైన తమలాంటి వారు ఎక్కి తిరగడం తప్పేమో అనే అమాయకపు ఆలోచనతో మామయ్యని అడిగింది.


మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఒకప్పుడు మాహారాజులు పరిపాలించిన ప్రాంతాలన్నిటా రాజరికం పోయి  ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులతో నడిచే ప్రభుత్వాలు వచ్చాయి. అదే ప్రజా స్వామ్యం.  అందుకే ఆరుద్ర  ఇక్కడ-
" రాజులు పోయి రోజులు మారి ప్రజలే ప్రభువులు ఈనాడు "
అంటూ భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాన్ని  మామయ్యతో చెప్పించి అమ్మాయికి పరిచయం చేసారు.
ఒహొహో మామయ్యా ఇదేమయ్యా అంటూ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు, ఒహొహో అమ్మాయి అంటూ ప్రతి సంబోధనతో మామయ్యతో జవాబులు చెప్పించిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సరదా పాటల్లో మేటిగా నిలిచింది.

పాట రచన   ఆరుద్ర(భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)
చిత్రం          ఆరాధన
గానం         ఘంటసాల , పి. సుశీల
అభినయం   గిరిజ, రేలంగి

Sunday, October 6, 2013

అందాల రాముడు - ఆరుద్ర గీతం

ఆరుద్ర ప్రవృత్తి రీత్యా కమ్యూన్-ఇష్టు.అయినా సినీకవిత్వం వృత్తీ ప్రవృత్తీ కూడా అయిన వేళ ఎన్నో భక్తి పాటలు రాసారు. వాటిలో ఎన్నో పాటలు సూపర్ హిట్లు అయ్యాయి. చాలా పాటలలో రాముడే ప్రధానంగా కనిపిస్తాడు. రామాయణాన్ని ఔపోసన పడితే తప్ప తెలియని రామాయణ లోని రహస్యాలు ఆరుద్రకెరుక. ఈవిషయం ఆయన సాహిత్యమే నిరూపిస్తుంది. రామాయణానికి సంబంధించి సినిమాలలో ఏ ఘట్టానికి రాయవలసి వచ్చినా, ఏ పాత్రని తీర్చవలసి వచ్చినా ఆ సాహిత్యం ఆరుద్ర పాండిత్యానికి నిలువెత్తు అద్దం పడుతుంది. సినీమా పాటలో పల్లవి, రెండు చరణాలు వెరసి మూడు నిముషాల్లో విషయాన్ని కుదించి రాయాలి. అందుకు ఎంతో సమర్థత కావాలి. ఆరుద్రకి అది మెండుగా ఉందని ఆయన పాటలే నిరూపిస్తాయి.
వాటిలో ఒకటి -

 "అందాల రాముడు ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ధి సోముడు,  ఎందువలన దేవుడు?"

తరతరాలుగా భారతజాతి శ్రీరాముడిని ఆదర్శ దైవంగా కొలుస్తోంది. భూమిపైన స్వర్గాన్ని తలపించే రామరాజ్యాన్ని స్థాపించిన వాడిగా, ఎన్నో ఆదర్శాలను ఆచరించి ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన గొప్ప రాజు శ్రీరాముడు. మరి ఆ రాముడినే ఎందుకు దేవుడిగా కొలవాలి అనే ప్రశ్న ఎవరికైనా వస్తే , వేస్తే దానికి జవాబు ఇదిగో ఇలా చెప్పొచ్చని చెప్పారన్నమాట ఆరుద్ర. రామాయణం మొత్తం సారాంశంగా రాముడి జీవితాన్ని రెండు చిన్న చరణాలలో  చెప్తూ
చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా సాగుతుంది ఈ పాట.

రాముడు అందమైనవాడు.  నల్లకలువ వంటి  మేని రంగు ఉన్నవాడు. సూర్య వంశస్థుడు
సూర్యవంశం  అనే గొప్ప సాగరంలో ఉదయించిన చంద్రుడిలాంటి చూడచక్కనివాడు. ఈ విషయాలను చెపుతుంది పల్లవి.  అటువంటి అందాలున్నవాడు, గొప్ప వంశంవాడు – రాముడు.  అయితే సరే... కానీ ఎందువలన దేవుడు అయ్యాడు అనే ప్రశ్న వేసారు పల్లవి చివర.

ఇక ఆ ప్రశ్నకి జవాబు తొలి చరణం. తండ్రిమాటకై పదవుల త్యాగమే జేసెనూ, తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెనూ ... దశరథుడు కైకకి ఇచ్చిన వరాలవల్ల మర్నాడు పట్టాభిషేకం పొంది చక్రవర్తిగా పదవి పొందవలసినవాడు, తండ్రిమాట నిలబెట్టడానికి తన పదవికి త్యాగం చేయడానికి సంతోషంగా సిద్ధపడ్డాడు. తండ్రి మాటకై - అనే మాటను గమనించాలి. తాను తండ్రికి మాట ఇవ్వడం కాదు. తండ్రి తన ముద్దులభార్య కైకాదేవికి వరంగా ఇచ్చిన మాట అది.  దాన్ని నిలబెట్టడం కొడుకుగా తన ధర్మం అనుకున్నాడు. అందుకే సంతోషంగానే అడవికి వెళ్ళాడు.
తను తప్పుకుంటే తమ్ముడు భరతుడు సింహాసనం ఎక్కి ఉన్నత స్థానం పొందుతాడు. అందుకే వనవాసం అనేది ఎంత బాధ కలిగించేదో తెలిసినా ఆ బాధని అనుభవించడానికే సిద్ధ పడ్డాడు. అందాల రాముడు అందువలన దేవుడు అంటూ ఆ చరణం ముగుస్తుంది.

రెండవ చరణంలో మళ్ళీ ఎందువలన దేవుడో మరోసారి చెప్పారు. అనుభవించదగిన వయసు అడవిపాలు చేసెను, అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను - అందాల రాముడు అందువలన దేవుడు. సన్యాసం తీసుకునే వయసులో అడవికి పొమ్మంటే పోవడం గొప్పేం కాదు కదా...మంచి వయసులో ఉండి రాజ్యం, పదవి, భోగభాగ్యాలు అనుభవించవలసిన వయసులో అడవికి పోవలసి వచ్చినా సంతోషంగా వెళ్ళాడు రాముడు. ఊరికే వనవాసం చేయడం కాదు, తాను అడుగుపెట్టినంత మేరా ఎక్కడా అసురులవల్ల మంచివారికి, పుణ్యమూర్తులకి ఇబ్బంది కలగకుండా ఆ భూమినంతా ఆర్యభూమిగా మార్చేసాడు తన రామబాణంతో. అందువలన రాముడే గొప్ప దేవుడు మరి. అందాల రాముడు అందువలన దేవుడు అంటూ ముగుస్తుంది ఈ చరణం.

మూడో చరణంలో-“ధర్మపత్ని చెరమాపగ దనుజుని దునుమాడెను, ధర్మము కాపాడుటకాసతినే విడనాడెనూ...అందాల రాముడు అందువలన దేవుడు!! అదే ....అదే రాముడి గొప్పదనం. ధర్మపత్ని అయిన సీతను కాపాడడం పతిగా తన ధర్మం. తన భార్యను తననుండి దూరం చేసి చెరపట్టినందుకు  ఆమెను కాపాడడం కోసం దనుజుడైన రావణాసురుడిని దునిమాడు (చంపాడు). కానీ తను భర్తమాత్రమే కాక రాజ్యానికి భర్తగా ధర్మ రక్షణ కోసం ఆ సతిని విడనాడాడు. సీతా పరిత్యాగం చేసాడు. రెండే రెండు వాక్యాలలో రామ ధర్మాన్ని వివరించారు ఆరుద్ర.

అందుకే అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాబ్ది  సోముడు - ఇలలో మన దేవుడు అంటూ పాట ముగుస్తుంది. పదే పదే రాముడిని అందాల రాముడు అంటూ ఈ పాటలో సంబోధించడంలో రాముడి బాహ్య సౌందర్యం మాత్రమే కాక అతను పాటించిన గొప్ప మానవ ధర్మాల వల్ల అతనిలోని అంతఃసౌందర్యాన్ని కవి గుర్తించారనిపిస్తుంది. అందానికి, సుగుణ శీలానికి రాజు మన రాముడు. రాముడి గురించి అతి చక్కని పాటని ఆరుద్రనుంచి అందుకున్న మనం ధన్యులం.

 ఆరుద్ర  ఈపాటలో   ఎన్నో సంస్కృత సమాసాలు, తెలుగు పదాలు కలగలిసిపోయి ఉంటాయి. అన్నిటికీ అర్థాలు తెలుసుకుంటే మనకి బోల్డు తెలుగు కూడా వస్తుంది.

ఇందీవరము అంటే నల్లకలువ పూవు. శ్యాముడు అంటే అటువంటి శరీరం రంగు
ఇనకులము అంటే సూర్య వంశం.అబ్ధి అంటే సముద్రం. సోముడు అంటే చంద్రుడు. వెరసి ఇనకులాబ్దిసోముడు అనే సమాసరూపంలో  సూర్యవంశం  అనే సముద్రంలో ఉదయించిన చందమామ – అంతటి అందమైనవాడు శ్రీరాముడు.  అడవిపాలు చేయడం, చెరబాపడం,  దునుమాడడం వంటివి చక్కని తెలుగు పదాలు.
చిత్రం: ఉయ్యాల - జంపాల (1965)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: సుశీల

పల్లవి:
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
ఎందువలన దేవుడు
చరణం 1:
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను...ఊ..ఊ..
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు...
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
చరణం 2:
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను..ఊ...ఊ..
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను..
అందాల రాముడు అందువలన దేవుడు ...
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు

చరణం 3:
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను...ఊ..ఊ..
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మము కాపాడుటకాసతినే విడనాడెను...
అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... అందాల రాముడు
ఇందీవర శ్యాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు


Monday, May 6, 2013

పిండితార్థం





చదువుకునే రోజుల్లో తరచు పిండితార్థం అనే మాట వినేవాళ్ళం. సారాంశం అని అర్థం. పిండితే వచ్చే అర్థం కాబోలు - అని సరదాగా అనుకునేవాళ్ళం. కావ్యాలలో కవులు వారు ఏం ఊహించి ఏం రాసేవారో కానీ ఒక్కోసారి ఈ విమర్శకులు చెప్పే అర్థం చూస్తుంటే ఇది పిండితార్థమేమో అనిపిస్తూ ఉండేది. అంటే కవులు వేరే ఉద్దేశంతోనో లేదా యథాలాపంగానో  చెప్తే విమర్శకాగ్రేసరులు వారికి కావలసినట్టు దాన్ని పిండుకుంటారని.

సినిమాల్లో దర్శకులు చేసిన షాట్స్ లో ఒక్కోసారి వారి ప్రమేయం లేకుండా కనిపించే షాట్లను సినీ అభిమానులు దర్శకుడి ప్రతిభగా పొరబాటు పడడం కూడా కద్దు.  ఇలాంటి డిపి ల (దర్శకత్వ ప్రతిభ) గురించి  కోతికొమ్మొచ్చి లో మన ముళ్ళపూడిగారు బాగా వివరించారు.
అలాంటి  ఓ తమాషా కథ ఇది.

ఓ రెండువందలేళ్ళక్రితం అనుకోండి. ఇటలీలో ఓ పోప్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారుట. దేశంలోని ఓ మైనారిటీ వర్గాన్ని(ఆ వర్గం పేరు ఇక్కడ నేను చెప్పను. ఎందుకంటే మనకు కథ ముఖ్యం కాబట్టి) దేశం వదిలిపెట్టి వెళ్ళాలని. సహజంగానే పెద్ద ఎత్తున వారంతా నిరసన వ్యక్తంచేసారు. పోప్ గారు ఓ ప్రతిపాదన తెచ్చారు.  ఆ మైనారిటీ వర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో తాను మతపరమైన చర్చ జరుపుతానని, ఆ చర్చలో ఒకవేళ మైనారిటీ వర్గం వారు జయిస్తే వారు ఇక దేశం వదిలి వెళ్ళనక్కరలేదని. ఒకవేళ పోప్ గారు గెలిస్తే వారు తప్పనిసరిగా దేశాన్ని వదిలి వెళ్ళనక్కరలేదని.
సరే మరి ఆ వర్గంవారికి వేరే దిక్కులేదు. కనీసం పోప్ గారి ఈ ప్రతిపాదనను ఉపయోగించుకోవాలని అనుకున్నారు. తమనుండి ఒక మధ్యవయసు వ్యక్తిని తమకు ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి పోప్ తో ఒక అంగీకారానికి వచ్చాడు. పోటీ జరుగుతున్నప్పుడు ఇటూ అటూ ఎవరూ ఒక్క మాటయినా మాట్లాడకూడదు. పోప్ అంగీకరించాడు.
మతచర్చ అనుకున్న సమయానికి ప్రారంభమైంది.
పోప్, ఆ వర్గ ప్రతినిధి ఎదురెదురుగా కూర్చున్నారు.
పోప్ గారు తన కుడి చెయ్యి ఎత్తి మూడు వేళ్ళు చూపించాడు.
ఆ ప్రతినిధి ఒక్కక్షణం ఆలోచించి తన చెయ్యి ఎత్తి ఒకవేలు చూపించాడు.
పోప్ గారు తన చేతివేళ్ళను తలచుట్టూ తిప్పాడు.
ఆ ప్రతినిధి తన   చేతి చూపుడువేలుని నేలవైపుకి చూపాడు.
పోప్ గారు తన బాగ్ లోంచి ఓ వేఫర్ ని, వైన్ గ్లాస్ ని తీసి బల్లమీద పెట్టాడు.
ప్రతినిధి సాలోచనగా చూసి తన బేగ్ లోంచి ఓ ఆపిల్ ని తీసి బల్లమీద పెట్టాడు.
పోప్ ఆశ్చర్యపోయాడు. లేచినిలబడ్డాడు.
ఇతను చాలా మేధావి.  నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. వారంతా ఈ దేశంలోనే ఉండవచ్చు
అని ప్రకటించాడు.
చుట్టూ ఉన్నవారికి చాలా విస్మయం కలిగింది. ఏం జరిగిందో సరిగ్గా అర్థం కాలేదు.
ఓ గంట గడిచాక మెల్లగా భక్తులందరూ పోప్ చుట్టూ చేరారు.
ఏం జరిగిందని అడిగారు. పోప్ అన్నాడు కదా.,.....
నేను మన హోలీ ట్రినిటీ గురించి చెప్తూ మూడు వేళ్ళు చూపించాను. అతను మన రెండు మతాలు వేరు వేరు అయినా ఇద్దరికీ దేవుడు ఒకడే కదా అని ఒకవేలు చూపించాడు.
నేను నా చేతిని తిప్పుతూ దేవుడు మనచుట్టూ ఉన్నాడని చూపించాను. అతను నేలని చూపుతూ దేవుడు ఇక్కడే మన మధ్యనే ఉన్నాడని చెప్పాడు.
నేను వేఫర్ ని వైన్ ని చూపిస్తూ దేవుడు మననుండి మనం చేసిన పాపాలను పీల్చేస్తాడని సంకేత భాషలో చెప్పాను. అతను ఎంత మేధావి అంటే  అసలు పాపాలన్నిటికీ మూలం అని మనం చెప్పుకునే ఆపిల్ ని తీసి చూపించాడు. ఆహా.ఎంతగొప్పవాడు అంటూ ఆ ప్రతినిధిని మెచ్చుకున్నాడు.

సరే, నాణేనికి మరోవేపు
ఆ వర్గం అంతా మేధావిగా పోప్ తో కొనియాడబడ్డ ప్రతినిధి చుట్టూ మూగారు.
పోప్ గారు నిన్ను ఏం అడిగారు అని అడిగారు.
అతను ఇలా అన్నాడు.
మొదట పోప్ గారు తన మూడు వేళ్ళు చూపించి మూడ్రోజుల్లో మీరు దేశం వదిలి పోవాలన్నారు.
నేను ఒకవేలు చూపించి ఒక్కడు కూడా ఇక్కడ్నుంచి కదలం అని చెప్పాను.
తర్వాత పోప్ గారు తన చేతిని తన తలచుట్టూ తిప్పి మీ అందరి తలలు తీయిస్తాను అన్నాడు.
నేను ఎట్టిపరిస్థితుల్లోనూ మేం ఇక్కడ్నుంచి కదిలేది లేదు అని నేలని చూపించి బాగా అర్థమయ్యేలా చెప్పాను.
ఆశ్చర్యపోయిన ఆ జనం అంతా ఆ తర్వాత?” అని అడిగారు.
తర్వాత....తర్వాత ఏముందీ...అతను తన లంచ్ తీసి టేబిల్ మీద పెట్టాడు. నేను నా లంచ్ తీసి అక్కడ పెట్టుకున్నాను. అంతే”  అని ముగించాడు.


అదండీ కథ. పిండితార్థం అంటే అది...పిండుకున్నవారికి పిండుకున్నంత.








Saturday, December 24, 2011

రాజాధిరాజు




క్రైస్తవగీతాలు తెలుగు సినిమాలలో చాల తక్కువగానే వింటాం.  "మిస్సమ్మ" లోని 'కరుణించు మేరిమాతా' , "మేరీమాత" సినిమాలోని 'సాగరతీరసమీపాన- తరగని కావ్యసుధామధురం'  పాటలు చాలాకాలం క్రైస్తవ మతసంబంధమైన సినీ గీతాలుగా వినబడేవి. కరుణామయుడు సినిమా విడుదల అయిన తర్వాత ఆచిత్రంలో క్రీస్తుకి శిలువవేసేటప్పుడు నేపథ్యంగా వచ్చే కదిలింది కరుణరథం పాట ప్రజల హృదయాలని కరుణ రససాగరంలో ముంచేసింది. ముఖ్యంగా క్రీస్తు- "అమ్మలారా!! నాకోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లలకోసం ఏడవండి!!" అనే వాక్యాలు విన్నప్పుడే కాదు, జీవితంలో చాలా సార్లు- గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది. 
ప్రేమ, త్యాగం సేవ అనే పదాలలోని ఔన్నత్యాన్ని ప్రచారంచేసే ఆ పాట సాహిత్యం మనసుని కుదిపేస్తుంది. మత పరమైన ఆదర్శాన్ని సాహిత్య రూపంలో ప్రదర్శించడంలో గీతరచయిత మోదుకూరి జాక్సన్ కృతకృత్యుడయ్యారు.
కరుణామయుడు చిత్రం సాధించిన విజయం స్ఫూర్తితోనేమో బాపు రమణలు కూడా  క్రైస్తవమతానికి సంబంధించిన కథతో  1980లో రాజాధిరాజు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దైవాన్ని నమ్మని మనిషి తన జీవితాన్నే కాక సమాజాన్ని ఏవిధంగా అస్తవ్యస్తం చేస్తాడో, ఆ దైవం కరుణించి అభయహస్తం అందించిననాడు ఆ జీవి ఏ విధంగా ధన్యత పొందుతాడు అనే అంశాన్ని కథా వస్తువుగా స్వీకరించారు.  మనిషిలోని చెడు - మంచితనం మీద పెత్తనం చేయడం అనే అంశాన్ని  వివరిస్తూ క్రైస్తవమతగ్రంధాలలో చెడుకి ప్రతినిధిగా కనిపించే  సైతాను పాత్రను ఈ సినిమా కథలో  'నైతాసు'  అనే పేరుతో  సృష్టించి సైతాను చేయించే పనులన్నీ ఆ పాత్రతో చేయించారు కథా రచయిత(ముళ్ళపూడి వెంకట రమణ). తద్వారా చెడుమీద అసహ్యాన్ని, చెడ్డతనంమీద జుగుప్సనీ కలిగించడం, మంచిగా ఉండడంలోని గొప్పతాన్ని నిరూపించడం రచయిత ఉద్దేశం.

మనిషై పుట్టినవాడికి ఉండవలసిన లక్షణాలు,  సర్వమానవ జాతిని తనతో సమానంగా ప్రేమించి, తనకన్నా దైన్యస్థితిలో ఉన్నవారికి తన ప్రేమను పంచి సేవాభావంతో వారిని చేరదీయడం. ఎప్పుడైతే మనిషిలో ఈ విధమైన లక్షణం నశిస్తుందో అప్పుడే మనిషిగా అతని పతనం ప్రారంభమవుతుంది. సరిగ్గా అప్పుడే అతనికి దైవ సహాయం అవసరం అవుతుంది కూడా. అటువంటి స్థితిలో ఉన్న తన మరిదిని, కన్నకొడుకులాగా తన చేతులమీద  పెంచిన వాడిని, క్రమ క్రమంగా  పరిస్థితులప్రభావంతో అతనిలో పతనమయిపోతున్న విలువలను గమనిస్తూ, అతన్ని ఓ మంచి దారిలోకి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తుంది ఓ వదిన. కానీ  తన ప్రయత్నం ఎంతవరకూ  ఫలిస్తుందో తెలియని స్థితిలో తనమరిది జీవితాన్ని మార్చమని సకల జీవరాశికి ప్రభువైన ఆ పరమాత్ముడిని వేడుకుంటూ ఉన్న ఆ వదిన లోని స్త్రీమూర్తి మనో వేదనని, ఓ తల్లి తన బిడ్డకోసం పడే వేదనలోని  ఆరాటాన్ని, పాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూనే ఎన్నో సత్యాలను అలవోకగా ప్రదర్శించారు పాట రచయిత వేటూరి సుందరరామ మూర్తి.

చీకటినిండిన మానవుల జీవితాలలో వెలుగుదివ్వెలు కాంతులు విరజిమ్మాలని, సకల జనులకూ రక్షణ ఇవ్వగల సమర్థుడు ఆ ప్రభువు మాత్రమేనని, మనిషికి ఏర్పడే కష్టకాలం అతని శోధన (పరీక్ష)లో  ఓ భాగమని, ఆ  ప్రభువును  శరణువేడితే ఈ పరీక్షలో నెగ్గి సత్యాన్ని తెలుసుకోగలుగుతామని నమ్మిన ఆ స్త్రీమూర్తి ఆలపించే పాట ద్వారా  జీవితంలో ఎన్నో సందర్బాలలో మనిషి ప్రవర్తనను సునిశితమైన పరిశీలనతో అలతి అలతి మాటలతో  గీత రచయిత ప్రదర్శించారు. 
మనిషి ఎన్ని రాజ్యాలు సంపాదించినా, ఎంత పరాక్రమం ప్రదర్శించినా దానికి కారణం, అతనిలో పుష్కలంగా ధైర్య స్థైర్యాలు,జవజీవాలు ఉండాలంటే దానికి ఆలంబనం  ఆ ప్రభువే. అవన్నీ మరియ తనయుడైన ఆ క్రీస్తు దయ వల్లనే మనిషికి అవి సమకూరుతాయి. అతను మధురమయిన హృదయం కలిగిన వాడు. అంతే కాదు. అణువణునా కరుణరసం నింపుకున్నవాడు. అమిత కారుణ్య మూర్తి.  ఆ ప్రభువే దయతో  మనకి  ప్రసాదించవలసిన వాడు.

మనిషికి బ్రతకడానికి కావలసిన వాటిలో ప్రధానమైనవి తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికింత నీడ. ఇవి చాలు. కానీ మనకి ఆ ప్రభువు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కొరత మిగిలిపోతూనే ఉంటుంది. పీత కష్టాలు పీతవి అన్నట్టు ఏ స్థాయిలో ఎంత ఐశ్వర్యం ఉన్నా మనిషికి తృప్తికలగదు.ఎంత ఉన్నా ఇంకా కావాలనే అంటుంది మనిషిలోని స్వార్థం. అలా అని భగవంతుడు మనిషికి కావలసిన దానికన్నా ఐశ్వర్యం ప్రసాదిస్తే అతనికి అహంకారం నెత్తికెక్కుతుంది. కన్ను మిన్ను కానడు. మనిషి ప్రపంచాన్ని డబ్బుకళ్లతో చూడడం మొదలుపెడితే సమాజానికి ప్రమాదం. 


డబ్బు మంచిదికాదు కదా అని అది మనిషికి జబ్బు చేస్తుంది అనుకొని భగవంతుడు మనిషికి ఐశ్వర్యం ఇవ్వకుండా బీదవాడిగానే ఉంచితే, తను సంపాదించే సొమ్ము తో కనీసం తన కడుపుకు కావలసినంత కబళం కూడా సంపాదించుకోలేకపోతే ఇక మనిషిలో  ఆత్మవిశ్వాసం నశిస్తుంది. నీతి నియమాలను తుంగలో తొక్కుతాడు. తన ప్రాణాన్ని నిలపడానికి వీలు కల్పించలేని సాంఘిక నియమాలని తోసిరాజంటాడు.  

అందువలన మనిషికి కావలసింది ఎంత అంటే దానికి నిర్వచనం ఎవరూ చెప్పలేరు. కేవలం అతనిని సృష్టించిన ఆ ప్రభువుకి మాత్రమే తెలుసు ఎంత ఇవ్వాలో. మనిషి జీవించడానికి కావలసినంత సంపద మాత్రమే ఇచ్చి, ఆ సంపదతో పాటు మనశ్శాంతితోను,  తన తోటివారిని  ప్రేమిస్తూ, ఉన్నదాంతో తృప్తిగా బ్రతికే జీవితం ఇవ్వమని అదే మనిషిని మనిషిగా నిలుపుతుందని ప్రభువును వేడుకుంటుంది ఆమె. మనిషి మనిషిగా మిగిలే రోజు వచ్చిననాడు, ప్రపంచంలోని మానవులందరి హృదయాలు ఆ ప్రభువు గుడిలో వెలిగించే దీపాల్లా వెలుగులతో ప్రకాశిస్తాయి. మొత్తం ప్రపంచమంతా ఆ ప్రభువుకి కోవెలగా మారిపోతుంది అంటుంది.

మనిషికి కనీసావసరాలు కూడు,గూడు, బట్ట. ఇవి తీరిపోయాక కావలసినవి సమాజంలో ఓ స్థానం. ఉన్న స్థానం కన్నా ఉన్నతమైన స్థానం కోసం మనిషి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అడవిలో మృగాలు  తమకంటే బలహీనమైనవాటి పై అధికారాన్ని ప్రదర్శిస్తాయో మనిషి కూడా తన కన్నా బలహీనులైన వారిపైన తన అధికారాన్ని ప్రదర్శించి తృప్తిపడతాడు. ఇది మనిషిలోని మృగలక్షణం. అందువలన అధికారం పొంది ఇతరులపై పెత్తనం చేయాలనుకునేవారు అర్హతలేనివారయితే సమాజానికి కలిగే హాని అంతా ఇంతా కాదు. రాజు ధర్మం తప్పాడు అంటే సమాజానికి జరిగే హానిని ఊహించలేము. అందువలన అర్హత కలిగినవారి చేతిలోనే అధికారం ఉండాలి.  

మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండలేడు. తన జీవితంలో ఎదురైన రకరకాల పరిస్థితులు అతనిని ఒక్కో విధంగా తీర్చి దిద్దుతాయి.  అధర్మ పరుడై జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నవాడు ఎవరైనా ఉంటే, అది వాడి ఖర్మ అనుకొని, అతనిని భగవంతుడు కూడా చేరదీయకపోతే, అతనిలో జ్ఞానం కలిగించకపోతే ఆ నీతినియమాలు తప్పిన మనిషి లో  కనీస విచక్షణ నశిస్తుంది. మనిషిలో పశు ప్రవృత్తి బయటపడి  మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన అర్హతలేనివారి చేతికి అధికారం ఇవ్వకుండా చూసుకోవడమే కాక, ఏవో పరిస్థితులవలన ఎవరైనా దారితప్పి, అధర్మమార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అటువంటివారికి ఆపన్న హస్తం అందించి కాపాడవలసిన బాధ్యత కూడా ఆ ప్రభువే వహించాలి అంటుంది ఆమె. 

అర్హతకలిగిన వారి చేతిలోనే అధికారం ఉంటే  ప్రజా జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది. ప్రజలంతో తమ మనసులలో సహనం, క్షమా భావం పెంచుకోవడం వలన సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. ప్రతి జీవికి రక్షణ లభిస్తుంది.  ప్రతి మనిషి తనువులో, అణువణువులో నిండిపోయిన దైవం మనిషిలో ఆత్మ బలాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. 

ఈ విధంగా దైవం మనిషి పట్ల వహించవలసిన బాధ్యతను దైవానికే మరోసారి గుర్తుచేస్తూ మనిషిని మంచివేపు నడిపించమని ప్రార్థిస్తుంది ఆమె. ఆ విధంగా మనిషిని రక్షించే శక్తి ఉన్న ఆ ప్రభువు లోని గొప్పదనాన్ని వర్ణిస్తుందిక్కడ. అతని ఘటనా ఘటన సామర్థ్యం, శరణువేడినవారిని కరుణించే ఆ ప్రభువు  దయార్ద్ర హృదయాన్ని వివరిస్తుంది.

ప్రజలకోసం, వారి సౌఖ్యంకోసం తన రక్తాన్ని చిందించాడు ఏసు ప్రభువు. అతని తనువునుండి ప్రవహించిన రక్తంతో  ప్రజల పాపాలన్నీ కొట్టుకుపోయాయి. తనని నమ్మినవారికోసం అతను చేసిన త్యాగం ఎంతో అద్భుతమైనది. అతనికి మరణం లేదు. అతను మరణాన్ని గెలిచి పునరుద్భవించడం వలన లోకాలన్నీ అతని రక్షణలో సేదదీరాయి. లోకంలో  ఇక అంతా ఆనందమే. శోక భావం మరణించింది. లోకంలో  మానవులు అనుభవించే చావు, పుట్టుక అనే సహజ ధర్మాలన్నీ ఆ ప్రభువుకు శ్వాసక్రియలో ఓభాగం. మానవులను దయగా చూసినా, దండన విధించి శిక్షించినా అది అతను విధించే పరీక్షయే కానీ మరేమీ కాదు. లోకంలో మనం అనుభవించే  కష్టసుఖాలన్నీ వెలుగు నీడలలాంటి  దోబూచులాట.  అంతా మాయే, మనం సుఖం అనుకుంటూ  అనుభవించేదంతా మిథ్యే, కేవలం ఆ భగవంతుడైన ప్రభువు మాత్రమే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ఈ మాయని ఛేదించడానికి ప్రయత్నం చేయాలి. మనిషిలో ఈ ప్రయత్నం ప్రారంభం జరగాలంటే కూడా ఆ దైవమే సహకరించాలి.

అందుకే మహిమ చూపవయ్యా..నీ మహిమ చూపవయ్యా అని ఎలుగెత్తి ప్రార్థిస్తుంది ఆమె.



క్రైస్తవమత ప్రచారంలో, ఉపన్యాసాలలో మనం తరచు వినే పదాలు, వాక్యాల విరుపులూ తొంగిచూస్తూ ఉన్నా కేవలం మత ప్రచారగీతంలా కాక మనిషి జీవితాన్ని వ్యాఖ్యానం చేస్తూ, మనిషి మనిషిగా, మానవత్వం తో మనీషిగా మారడానికి కావలసినదేమిటో అన్న విషయాన్ని ఆలోచిస్తూ,  ఆ విధంగా జరగడానికి కావలసిన దైవ సహాయాన్ని ఆకాంక్షిస్తూ, ఆ ప్రభువు శరణాగత వాత్సల్యాన్ని నిరూపిస్తూ మూడు చరణాలలో  సాగింది

- ఈ గీతం.

 ఈ గీతంలో కవి చెప్పిన విషయాలు క్రైస్తవమతానికే కాక సర్వమతాలకు వర్తించేవి. మనిషి సంసారంలోను, లోకంలోను ఉన్న మాయను గుర్తించి,  లేనిదానికోసం తపించడం మాని ఉన్న దాంతో తృప్తిపడుతూ, ప్రేమ, క్షమ లను జీవితాదర్శాలుగా గ్రహించి    తోటివారిని మనిషిగా గుర్తించడం జరిగిన నాడు లోకంలో మనిషి మనుగడ సుఖశాంతులతో సాగుతుంది. మంచితనంతో మనసులను నింపుకొని మాయను ఛేదించి సత్యాన్ని శోధించే దిశగా మనిషి ప్రయాణం సాగితే  మనిషి ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు. తనలోనే భగవంతుడిని దర్శించగలుగుతాడు. సర్వమత సారాంశం బోధించే నీతి ఇదే.


చిత్రం              రాజాధిరాజు (1980)

బానర్             రమాచిత్ర
దర్శకుడు         బాపు
సంగీతదర్శకుడు  కె.వి. మహదేవన్
గీత రచయిత      వేటూరి సుందరరామ మూర్తి
గానం              పి. సుశీల



Saturday, December 3, 2011

సరే సరే.....ఓరన్నా!! సరే సరే!!

వియోగం అత్యంత కరుణరసాత్మకమైనది. అది ఎవరిమధ్య సంభవించినా కూడా.

క్రౌంచ పక్షులమధ్య కలిగిన వియోగం ఓ బోయవానిచేత మధురమైన కావ్యమే పలికించిందట. మరి ఎంతో భాష,  కవిత్వంలోతులు తెలిసిన సినీకవుల గురించి వేరే చెప్పాలా.

భావకవితా యుగంలోను, సినీమా  గీతాలలోను ఎన్ని వియోగగీతాలు చూసి ఉంటాం - అదే, వినిఉంటాం!!

వియోగ గీతాలన్నీ  సాధారణంగా ప్రేమికుల మధ్య కలిగిన ఎడబాటునే చిత్రిస్తూ సాగుతాయి. ఈ గీతాలకు నేపథ్యం వారి మధ్య కలిగే ప్రణయానికి భంగకరంగా సంభవించే సన్నివేశాలే అయి ఉంటాయి.

కానీ ఆరుద్ర రచన  అయిన ఈ పాట వియోగ గీతాలలోనే భిన్నమైనది. సంగీత రచనలోనే కాక సాహిత్యరచనలోను, భాష, శిల్పం దృష్ట్యా కూడా కొత్తగా అనిపించి కరుణరసార్ద్రతతో హృదయం చెమ్మగిల్లుతుంది.

ఈ గీతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది యువతీ యువకుల మధ్య కలిగే ఎడబాటును, దానివల్ల కలిగే దుఃఖాన్ని చిత్రించినది కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఏదో అవగాహన లోపం వలన సంభవించిన ఎడబాటు,  ఆ వియోగం వలన ఆ ఎడబాటులోని బాధను సహించలేని హృదయం పడే ఆరాటం ఇవి ఈగీతానికి నేపథ్యమైన అంశాలు.
గీతం ఎత్తుగడ చాలా నూతనమైన విధానంలో ప్రారంభమవుతుంది.

సరే సరే ఓరన్నా సరే సరే.....అంటూ.
తెలుగు భాషలో చాలా సందర్భాలలో రక రకాలుగా, ఒక్కోసారి ఊతపదంగా కూడా ప్రయోగించబడే ఈ సరే అనే పదాన్ని ఆరుద్ర పాట ఎత్తుగడకి వాడడం లోనే ఓ కొత్తదనం కనిపిస్తుంది. సరే సరే అంటూ మనం వ్యవహారంలో వాడే మాటని -ఇక ఇంకేంలేదు కదా, అంతే కదా!! అంటూ ఆ సంభాషణకో, ఆ సందర్భానికో ముగింపుగా వాడతాం.

పాటలో కూడా సరే సరే ఓరన్నా సరే సరే అని మొదలవుతుంది. కానీ ఇక్కడా ఆ సరే సరే  అంటే ఏదో అక్కడ జరిగిన విషయం, అంతటితో  ముగిసిపోయిన విషయం గురించే కాక  ఆ విషయం చెప్పడానికి - ఓ మొదలు అని మనకు అర్థం అవుతుంది.

ఆ వెంటనే...." పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే", "గుండె కలచి కలచి ఇంక నిన్ను బాధించనులే"  అంటూ సరే సరే అంటూ పల్లవి ముగుస్తుంది. ఆ స్నేహితుడి కోసం ఎంతగానో పిలిచాడని, తన పిలుపు అతనికి ఇష్టం లేదు కాబట్టి అతనికి బాధ కలిగిందేమో అని అనుమానం వస్తుంది  కాబోలు. అందుకే ఇంక నిన్ను నా పిలుపుతో వేధించను, బాధించను అంటూ సరే సరే ఇక నిన్ను పిలవదలుచుకోలేదు అంటాడు.


వెర్రిగాలి వీచినపుడు వెదురైనా పాడుతుంది

నల్ల మబ్బు పట్టినప్పుడు నెమిలైనా ఆడుతుంది

నీ నేస్తం నీకోసం చావు కేక వేస్తే పలుకనైన పలుకవు

రాయిలా ఉలకనైన ఉలకవు........
సరే...సరే...ఓరన్నా...సరే సరే.

గాలి బాగా వీచినప్పుడు వెదురు బొంగులలోంచి ప్రవహించినపుడు వేణుగానం వినిపిస్తుంది. ఆకాశంలో నల్లగా మబ్బు పట్టినప్పుడు నెమలి ఎంతో కనువిందుగా నాట్యం చేస్తూ ఆడుతుంది. ఇవి ప్రకృతిలో ఒకదానికొకటి జతలుగా,  నేస్తాలుగా చెప్పబడుతున్నవి. ఒకటి లేనిది మరొకటి లేదు. కానీ ఈ స్నేహితుడు ఒకనాడు తనతోనే ప్రాణంగా మసిలినవాడు,  ఈనాడు  ఎంతో బాధతో మరణమాసన్నమవుతున్నవేళ వేసిన చావుకేకలాంటి తన కేక ని ఆ స్నేహితుడు ఎందుచేతనో  వినడం లేదు. కనీసం పలకనైనా పలకడం లేదు. రాయిలా ఉలకడూ పలకడూ ఆ స్నేహితుడు. ఎందువలనో తెలియడంలేదని అనుకుంటూనే సరే ఇంక ఈ జీవితానికి ఇంతే ప్రాప్తం అనుకుంటాడు.


అనుక్షణం నీపేరే పిలుచుకుంటాను
మనసులోన నీ ఊసే తలుచుకుంటాను
నీవే దిగివస్తావని నిలిచి ఉంటాను
నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను

తన బహిప్రాణంగా మసిలిన తన స్నేహితుడిని తాను మరిచిపోలేకపోతున్నాడు. అనుక్షణమూ అతని జ్ఞాపకాలు వేధిస్తున్నాయి.  అతని పేరు పదే పదే జ్ఞాపకం వస్తూఉంది. ప్రతిక్షణం మనసులో అతనితో గడిపిన కాలమే ఊహలలో కదులుతోంది.   ఏ సందర్భమూ చూపకుండా అకారణంగా తనను వదిలివెళ్ళిపోయాడు ఆ స్నేహితుడు. కారణం అతను చెప్పలేదు. కాబట్టి అతనే తనకోసం దిగిరావాలి కానీ వేరే అవకాశం లేదు. వదిలిపెట్టిన కారణం ఏదో తెలిస్తే దానికి కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నీవే దిగి వస్తావని నిలిచిఉంటాను అంటాడు. అక్షరాలనే కాక పదాలను ఇక్కడ అంత్యప్రాసలుగా వాడారు ఆరుద్ర. స్నేహితుడి చెలిమి కోసం అతను పడుతున్న ఆరాటాన్నంతా  ఈ పదాలు వెల్లడిస్తాయి.

నిజమైన ప్రేమ కానీ,  స్నేహం కానీ తమ వలపును, స్నేహాన్ని పంచిన వారి ఉన్నతినే కోరతారు కానీ నాశనాన్ని కాదు. అందుకే తనని ఇంత బాధ పెట్టి, ఏ కారణం లేకుండా తన ఖర్మానికి తనను వదిలిపెట్టిన ఆ స్నేహితుడు తనను వదిలి వెళ్ళినా అతను బాగుండాలని వేయి దేవుళ్ళను కోరుకుంటాడు తప్ప తనని కాదని వెళ్ళిన అతని నాశనాన్ని కాదు.

పాటలో పదే పదే చర్వితచరణంగా వచ్చే సరే సరే ఓరన్నా సరే సరే...సరే సరే ఓరన్నా సరే సరే అనే పదాలు
శ్రోతలోని కరుణరసోత్ర్పేరణకు సోపానాలు వేస్తూ పాట చివర పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే, గుండె కలచి కలచి ఇంక బాధించనులే అంటూ ముగించడంతో  శోకరసం శిఖరాయమాన స్థాయికి చేరి కళ్ళు చెమ్మగిల్లుతాయి.

నిజమైన స్నేహంలోని అందమైన బంధాన్నే కాదు, అది వీడిపోయినప్పుడు హృదయాలలో చెలరేగే బడబాగ్నిని కూడా ఎంతో నేర్పుగా చిత్రించి చూపారు ఆరుద్ర.

 బాలసుబ్రహ్మణ్యంగారు  పాటలోని సాహిత్యంతో లీనమై  ఎంతో గాఢమైన అనుభూతితో తాను అనుభవించి పలవరించినట్టనిపించే పాట ఇది. సరే సరే అంటూ ...అన్న అన్ని సందర్భాలలోను ఆ విషాదాన్ని తారస్థాయికి చేర్చి అతను పాటను ఆలపించిన విధానం విషాదమాధుర్యాన్ని చవిచూపుతుంది.

పాటని సినిమాలో స్నేహబంధానికి సంబంధించిన వియోగం పొందిన పాత్ర మనస్థితిని  దృష్టిలో పెట్టుకొని రాసినదే కావచ్చు.

కానీ,  ఒక్కోసారి మనం అత్యంత గాఢమైన మమతలతో అల్లుకున్న ఏ అనుబంధమైనా అపార్థానికి గురైనపుడు,  వారినుండి  వియోగం పొందినప్పుడు ఈ పాటని వింటే  అచ్చు మనం కూడా ఇలాగే అనుకున్నామే అనిపించక మానదు.
అదే పాటని పదికాలాలు నిలిపి ఉంచే జీవలక్షణం.


ఈ పాట స్నేహం సినిమా కోసం రచించబడింది. పాట రచన ఆరుద్ర. సంగీతం కె.వి.మహదేవన్.
 పాటని అత్యంత విషాదభరితంగా ఆలపించిన మధుర గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.

పాటని ఇక్కడ వినవచ్చును.