చదువుకునే
రోజుల్లో తరచు పిండితార్థం అనే మాట వినేవాళ్ళం. సారాంశం అని అర్థం. పిండితే వచ్చే
అర్థం కాబోలు - అని సరదాగా అనుకునేవాళ్ళం. కావ్యాలలో కవులు వారు ఏం ఊహించి ఏం రాసేవారో కానీ
ఒక్కోసారి ఈ విమర్శకులు చెప్పే అర్థం చూస్తుంటే ఇది పిండితార్థమేమో అనిపిస్తూ
ఉండేది. అంటే కవులు వేరే ఉద్దేశంతోనో లేదా యథాలాపంగానో చెప్తే విమర్శకాగ్రేసరులు వారికి కావలసినట్టు దాన్ని
పిండుకుంటారని.
సినిమాల్లో
దర్శకులు చేసిన షాట్స్ లో ఒక్కోసారి వారి ప్రమేయం లేకుండా కనిపించే షాట్లను సినీ
అభిమానులు దర్శకుడి ప్రతిభగా పొరబాటు పడడం కూడా కద్దు. ఇలాంటి డిపి ల (దర్శకత్వ ప్రతిభ) గురించి కోతికొమ్మొచ్చి లో మన ముళ్ళపూడిగారు బాగా వివరించారు.
అలాంటి ఓ తమాషా కథ ఇది.
ఓ
రెండువందలేళ్ళక్రితం అనుకోండి. ఇటలీలో ఓ పోప్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారుట.
దేశంలోని ఓ మైనారిటీ వర్గాన్ని(ఆ వర్గం పేరు ఇక్కడ నేను చెప్పను. ఎందుకంటే మనకు కథ
ముఖ్యం కాబట్టి) దేశం వదిలిపెట్టి వెళ్ళాలని. సహజంగానే పెద్ద ఎత్తున వారంతా నిరసన
వ్యక్తంచేసారు. పోప్ గారు ఓ ప్రతిపాదన తెచ్చారు.
ఆ మైనారిటీ వర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో తాను మతపరమైన చర్చ జరుపుతానని,
ఆ చర్చలో ఒకవేళ మైనారిటీ వర్గం వారు జయిస్తే వారు ఇక దేశం వదిలి వెళ్ళనక్కరలేదని.
ఒకవేళ పోప్ గారు గెలిస్తే వారు తప్పనిసరిగా దేశాన్ని వదిలి వెళ్ళనక్కరలేదని.
సరే మరి
ఆ వర్గంవారికి వేరే దిక్కులేదు. కనీసం పోప్ గారి ఈ ప్రతిపాదనను ఉపయోగించుకోవాలని అనుకున్నారు.
తమనుండి ఒక మధ్యవయసు వ్యక్తిని తమకు ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి పోప్ తో
ఒక అంగీకారానికి వచ్చాడు. పోటీ జరుగుతున్నప్పుడు ఇటూ అటూ ఎవరూ ఒక్క మాటయినా
మాట్లాడకూడదు. పోప్ అంగీకరించాడు.
మతచర్చ
అనుకున్న సమయానికి ప్రారంభమైంది.
పోప్, ఆ వర్గ
ప్రతినిధి ఎదురెదురుగా కూర్చున్నారు.
పోప్
గారు తన కుడి చెయ్యి ఎత్తి మూడు వేళ్ళు చూపించాడు.
ఆ
ప్రతినిధి ఒక్కక్షణం ఆలోచించి తన చెయ్యి ఎత్తి ఒకవేలు చూపించాడు.
పోప్
గారు తన చేతివేళ్ళను తలచుట్టూ తిప్పాడు.
ఆ
ప్రతినిధి తన చేతిచూపుడువేలుని నేలవైపుకి చూపాడు.
పోప్
గారు తన బాగ్ లోంచి ఓ వేఫర్ ని, వైన్ గ్లాస్ ని తీసి బల్లమీద పెట్టాడు.
ప్రతినిధి
సాలోచనగా చూసి తన బేగ్ లోంచి ఓ ఆపిల్ ని తీసి బల్లమీద పెట్టాడు.
పోప్
ఆశ్చర్యపోయాడు. లేచినిలబడ్డాడు.
“ఇతను చాలా మేధావి. నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. వారంతా ఈ
దేశంలోనే ఉండవచ్చు”
అని
ప్రకటించాడు.
చుట్టూ
ఉన్నవారికి చాలా విస్మయం కలిగింది. ఏం జరిగిందో సరిగ్గా అర్థం కాలేదు.
ఓ గంట
గడిచాక మెల్లగా భక్తులందరూ పోప్ చుట్టూ చేరారు.
ఏం
జరిగిందని అడిగారు. పోప్ అన్నాడు కదా.,.....
“నేను మన హోలీ ట్రినిటీ
గురించి చెప్తూ మూడు వేళ్ళు చూపించాను. అతను మన రెండు మతాలు వేరు వేరు అయినా
ఇద్దరికీ దేవుడు ఒకడే కదా అని ఒకవేలు చూపించాడు.
నేను నా
చేతిని తిప్పుతూ దేవుడు మనచుట్టూ ఉన్నాడని చూపించాను. అతను నేలని చూపుతూ దేవుడు
ఇక్కడే మన మధ్యనే ఉన్నాడని చెప్పాడు.
నేను
వేఫర్ ని వైన్ ని చూపిస్తూ దేవుడు మననుండి మనం చేసిన పాపాలను పీల్చేస్తాడని సంకేత
భాషలో చెప్పాను. అతను ఎంత మేధావి అంటే
అసలు పాపాలన్నిటికీ మూలం అని మనం చెప్పుకునే ఆపిల్ ని తీసి చూపించాడు. ఆహా.ఎంతగొప్పవాడు
” అంటూ ఆ ప్రతినిధిని
మెచ్చుకున్నాడు.
సరే, నాణేనికి మరోవేపు –
ఆ వర్గం అంతా మేధావిగా పోప్ తో కొనియాడబడ్డ ప్రతినిధి
చుట్టూ మూగారు.
“పోప్ గారు నిన్ను ఏం
అడిగారు” అని అడిగారు.
అతను ఇలా అన్నాడు.
“మొదట పోప్ గారు తన మూడు
వేళ్ళు చూపించి మూడ్రోజుల్లో మీరు దేశం వదిలి పోవాలన్నారు.
నేను ఒకవేలు చూపించి ఒక్కడు కూడా ఇక్కడ్నుంచి కదలం అని
చెప్పాను.
తర్వాత పోప్ గారు తన చేతిని తన తలచుట్టూ తిప్పి మీ అందరి
తలలు తీయిస్తాను అన్నాడు.
నేను ఎట్టిపరిస్థితుల్లోనూ మేం ఇక్కడ్నుంచి కదిలేది లేదు
అని నేలని చూపించి బాగా అర్థమయ్యేలా చెప్పాను.”
ఆశ్చర్యపోయిన ఆ జనం అంతా “ఆ తర్వాత?” అని అడిగారు.
“తర్వాత....తర్వాత
ఏముందీ...అతను తన లంచ్ తీసి టేబిల్ మీద పెట్టాడు. నేను నా లంచ్ తీసి అక్కడ
పెట్టుకున్నాను. అంతే” అని ముగించాడు.
అదండీ కథ. పిండితార్థం అంటే అది...పిండుకున్నవారికి
పిండుకున్నంత.
క్రైస్తవగీతాలు తెలుగు సినిమాలలో చాల తక్కువగానే వింటాం. "మిస్సమ్మ" లోని 'కరుణించు మేరిమాతా' , "మేరీమాత" సినిమాలోని 'సాగరతీరసమీపాన- తరగని కావ్యసుధామధురం' పాటలు చాలాకాలం క్రైస్తవ మతసంబంధమైన సినీ గీతాలుగా వినబడేవి. కరుణామయుడు సినిమా విడుదల అయిన తర్వాత ఆచిత్రంలో క్రీస్తుకి శిలువవేసేటప్పుడు నేపథ్యంగా వచ్చే కదిలింది కరుణరథం పాట ప్రజల హృదయాలని కరుణ రససాగరంలో ముంచేసింది. ముఖ్యంగా క్రీస్తు- "అమ్మలారా!! నాకోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లలకోసం ఏడవండి!!" అనే వాక్యాలు విన్నప్పుడే కాదు, జీవితంలో చాలా సార్లు- గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది.
ప్రేమ, త్యాగం సేవ అనే పదాలలోని ఔన్నత్యాన్ని ప్రచారంచేసే ఆ పాట సాహిత్యం మనసుని కుదిపేస్తుంది. మత పరమైన ఆదర్శాన్ని సాహిత్య రూపంలో ప్రదర్శించడంలో గీతరచయిత మోదుకూరి జాక్సన్ కృతకృత్యుడయ్యారు.
కరుణామయుడు చిత్రం సాధించిన విజయం స్ఫూర్తితోనేమో బాపు రమణలు కూడా క్రైస్తవమతానికి సంబంధించిన కథతో 1980లో రాజాధిరాజు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దైవాన్ని నమ్మని మనిషి తన జీవితాన్నే కాక సమాజాన్ని ఏవిధంగా అస్తవ్యస్తం చేస్తాడో, ఆ దైవం కరుణించి అభయహస్తం అందించిననాడు ఆ జీవి ఏ విధంగా ధన్యత పొందుతాడు అనే అంశాన్ని కథా వస్తువుగా స్వీకరించారు. మనిషిలోని చెడు - మంచితనం మీద పెత్తనం చేయడం అనే అంశాన్ని వివరిస్తూ క్రైస్తవమతగ్రంధాలలో చెడుకి ప్రతినిధిగా కనిపించే సైతాను పాత్రను ఈ సినిమా కథలో 'నైతాసు' అనే పేరుతో సృష్టించి సైతాను చేయించే పనులన్నీ ఆ పాత్రతో చేయించారు కథా రచయిత(ముళ్ళపూడి వెంకట రమణ). తద్వారా చెడుమీద అసహ్యాన్ని, చెడ్డతనంమీద జుగుప్సనీ కలిగించడం, మంచిగా ఉండడంలోని గొప్పతాన్ని నిరూపించడం రచయిత ఉద్దేశం.
మనిషై పుట్టినవాడికి ఉండవలసిన లక్షణాలు, సర్వమానవ జాతిని తనతో సమానంగా ప్రేమించి, తనకన్నా దైన్యస్థితిలో ఉన్నవారికి తన ప్రేమను పంచి సేవాభావంతో వారిని చేరదీయడం. ఎప్పుడైతే మనిషిలో ఈ విధమైన లక్షణం నశిస్తుందో అప్పుడే మనిషిగా అతని పతనం ప్రారంభమవుతుంది. సరిగ్గా అప్పుడే అతనికి దైవ సహాయం అవసరం అవుతుంది కూడా. అటువంటి స్థితిలో ఉన్న తన మరిదిని, కన్నకొడుకులాగా తన చేతులమీద పెంచిన వాడిని, క్రమ క్రమంగా పరిస్థితులప్రభావంతో అతనిలో పతనమయిపోతున్న విలువలను గమనిస్తూ, అతన్ని ఓ మంచి దారిలోకి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తుంది ఓ వదిన. కానీ తన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో తెలియని స్థితిలో తనమరిది జీవితాన్ని మార్చమని సకల జీవరాశికి ప్రభువైన ఆ పరమాత్ముడిని వేడుకుంటూ ఉన్న ఆ వదిన లోని స్త్రీమూర్తి మనో వేదనని, ఓ తల్లి తన బిడ్డకోసం పడే వేదనలోని ఆరాటాన్ని, పాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూనే ఎన్నో సత్యాలను అలవోకగా ప్రదర్శించారు పాట రచయిత వేటూరి సుందరరామ మూర్తి.
చీకటినిండిన మానవుల జీవితాలలో వెలుగుదివ్వెలు కాంతులు విరజిమ్మాలని, సకల జనులకూ రక్షణ ఇవ్వగల సమర్థుడు ఆ ప్రభువు మాత్రమేనని, మనిషికి ఏర్పడే కష్టకాలం అతని శోధన (పరీక్ష)లో ఓ భాగమని, ఆ ప్రభువును శరణువేడితే ఈ పరీక్షలో నెగ్గి సత్యాన్ని తెలుసుకోగలుగుతామని నమ్మిన ఆ స్త్రీమూర్తి ఆలపించే పాట ద్వారా జీవితంలో ఎన్నో సందర్బాలలో మనిషి ప్రవర్తనను సునిశితమైన పరిశీలనతో అలతి అలతి మాటలతో గీత రచయిత ప్రదర్శించారు.
మనిషి ఎన్ని రాజ్యాలు సంపాదించినా, ఎంత పరాక్రమం ప్రదర్శించినా దానికి కారణం, అతనిలో పుష్కలంగా ధైర్య స్థైర్యాలు,జవజీవాలు ఉండాలంటే దానికి ఆలంబనం ఆ ప్రభువే. అవన్నీ మరియ తనయుడైన ఆ క్రీస్తు దయ వల్లనే మనిషికి అవి సమకూరుతాయి. అతను మధురమయిన హృదయం కలిగిన వాడు. అంతే కాదు. అణువణునా కరుణరసం నింపుకున్నవాడు. అమిత కారుణ్య మూర్తి. ఆ ప్రభువే దయతో మనకి ప్రసాదించవలసిన వాడు.
మనిషికి బ్రతకడానికి కావలసిన వాటిలో ప్రధానమైనవి తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికింత నీడ. ఇవి చాలు. కానీ మనకి ఆ ప్రభువు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కొరత మిగిలిపోతూనే ఉంటుంది. పీత కష్టాలు పీతవి అన్నట్టు ఏ స్థాయిలో ఎంత ఐశ్వర్యం ఉన్నా మనిషికి తృప్తికలగదు.ఎంత ఉన్నా ఇంకా కావాలనే అంటుంది మనిషిలోని స్వార్థం. అలా అని భగవంతుడు మనిషికి కావలసిన దానికన్నా ఐశ్వర్యం ప్రసాదిస్తే అతనికి అహంకారం నెత్తికెక్కుతుంది. కన్ను మిన్ను కానడు. మనిషి ప్రపంచాన్ని డబ్బుకళ్లతో చూడడం మొదలుపెడితే సమాజానికి ప్రమాదం.
డబ్బు మంచిదికాదు కదా అని అది మనిషికి జబ్బు చేస్తుంది అనుకొని భగవంతుడు మనిషికి ఐశ్వర్యం ఇవ్వకుండా బీదవాడిగానే ఉంచితే, తను సంపాదించే సొమ్ము తో కనీసం తన కడుపుకు కావలసినంత కబళం కూడా సంపాదించుకోలేకపోతే ఇక మనిషిలో ఆత్మవిశ్వాసం నశిస్తుంది. నీతి నియమాలను తుంగలో తొక్కుతాడు. తన ప్రాణాన్ని నిలపడానికి వీలు కల్పించలేని సాంఘిక నియమాలని తోసిరాజంటాడు.
అందువలన మనిషికి కావలసింది ఎంత అంటే దానికి నిర్వచనం ఎవరూ చెప్పలేరు. కేవలం అతనిని సృష్టించిన ఆ ప్రభువుకి మాత్రమే తెలుసు ఎంత ఇవ్వాలో. మనిషి జీవించడానికి కావలసినంత సంపద మాత్రమే ఇచ్చి, ఆ సంపదతో పాటు మనశ్శాంతితోను, తన తోటివారిని ప్రేమిస్తూ, ఉన్నదాంతో తృప్తిగా బ్రతికే జీవితం ఇవ్వమని అదే మనిషిని మనిషిగా నిలుపుతుందని ప్రభువును వేడుకుంటుంది ఆమె. మనిషి మనిషిగా మిగిలే రోజు వచ్చిననాడు, ప్రపంచంలోని మానవులందరి హృదయాలు ఆ ప్రభువు గుడిలో వెలిగించే దీపాల్లా వెలుగులతో ప్రకాశిస్తాయి. మొత్తం ప్రపంచమంతా ఆ ప్రభువుకి కోవెలగా మారిపోతుంది అంటుంది.
మనిషికి కనీసావసరాలు కూడు,గూడు, బట్ట. ఇవి తీరిపోయాక కావలసినవి సమాజంలో ఓ స్థానం. ఉన్న స్థానం కన్నా ఉన్నతమైన స్థానం కోసం మనిషి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అడవిలో మృగాలు తమకంటే బలహీనమైనవాటి పై అధికారాన్ని ప్రదర్శిస్తాయో మనిషి కూడా తన కన్నా బలహీనులైన వారిపైన తన అధికారాన్ని ప్రదర్శించి తృప్తిపడతాడు. ఇది మనిషిలోని మృగలక్షణం. అందువలన అధికారం పొంది ఇతరులపై పెత్తనం చేయాలనుకునేవారు అర్హతలేనివారయితే సమాజానికి కలిగే హాని అంతా ఇంతా కాదు. రాజు ధర్మం తప్పాడు అంటే సమాజానికి జరిగే హానిని ఊహించలేము. అందువలన అర్హత కలిగినవారి చేతిలోనే అధికారం ఉండాలి.
మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండలేడు. తన జీవితంలో ఎదురైన రకరకాల పరిస్థితులు అతనిని ఒక్కో విధంగా తీర్చి దిద్దుతాయి. అధర్మ పరుడై జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నవాడు ఎవరైనా ఉంటే, అది వాడి ఖర్మ అనుకొని, అతనిని భగవంతుడు కూడా చేరదీయకపోతే, అతనిలో జ్ఞానం కలిగించకపోతే ఆ నీతినియమాలు తప్పిన మనిషి లో కనీస విచక్షణ నశిస్తుంది. మనిషిలో పశు ప్రవృత్తి బయటపడి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన అర్హతలేనివారి చేతికి అధికారం ఇవ్వకుండా చూసుకోవడమే కాక, ఏవో పరిస్థితులవలన ఎవరైనా దారితప్పి, అధర్మమార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అటువంటివారికి ఆపన్న హస్తం అందించి కాపాడవలసిన బాధ్యత కూడా ఆ ప్రభువే వహించాలి అంటుంది ఆమె.
అర్హతకలిగిన వారి చేతిలోనే అధికారం ఉంటే ప్రజా జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది. ప్రజలంతో తమ మనసులలో సహనం, క్షమా భావం పెంచుకోవడం వలన సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. ప్రతి జీవికి రక్షణ లభిస్తుంది. ప్రతి మనిషి తనువులో, అణువణువులో నిండిపోయిన దైవం మనిషిలో ఆత్మ బలాన్ని, ధైర్యాన్ని నింపుతుంది.
ఈ విధంగా దైవం మనిషి పట్ల వహించవలసిన బాధ్యతను దైవానికే మరోసారి గుర్తుచేస్తూ మనిషిని మంచివేపు నడిపించమని ప్రార్థిస్తుంది ఆమె. ఆ విధంగా మనిషిని రక్షించే శక్తి ఉన్న ఆ ప్రభువు లోని గొప్పదనాన్ని వర్ణిస్తుందిక్కడ. అతని ఘటనా ఘటన సామర్థ్యం, శరణువేడినవారిని కరుణించే ఆ ప్రభువు దయార్ద్ర హృదయాన్ని వివరిస్తుంది.
ప్రజలకోసం, వారి సౌఖ్యంకోసం తన రక్తాన్ని చిందించాడు ఏసు ప్రభువు. అతని తనువునుండి ప్రవహించిన రక్తంతో ప్రజల పాపాలన్నీ కొట్టుకుపోయాయి. తనని నమ్మినవారికోసం అతను చేసిన త్యాగం ఎంతో అద్భుతమైనది. అతనికి మరణం లేదు. అతను మరణాన్ని గెలిచి పునరుద్భవించడం వలన లోకాలన్నీ అతని రక్షణలో సేదదీరాయి. లోకంలో ఇక అంతా ఆనందమే. శోక భావం మరణించింది. లోకంలో మానవులు అనుభవించే చావు, పుట్టుక అనే సహజ ధర్మాలన్నీ ఆ ప్రభువుకు శ్వాసక్రియలో ఓభాగం. మానవులను దయగా చూసినా, దండన విధించి శిక్షించినా అది అతను విధించే పరీక్షయే కానీ మరేమీ కాదు. లోకంలో మనం అనుభవించే కష్టసుఖాలన్నీ వెలుగు నీడలలాంటి దోబూచులాట. అంతా మాయే, మనం సుఖం అనుకుంటూ అనుభవించేదంతా మిథ్యే, కేవలం ఆ భగవంతుడైన ప్రభువు మాత్రమే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ఈ మాయని ఛేదించడానికి ప్రయత్నం చేయాలి. మనిషిలో ఈ ప్రయత్నం ప్రారంభం జరగాలంటే కూడా ఆ దైవమే సహకరించాలి.
అందుకే మహిమ చూపవయ్యా..నీ మహిమ చూపవయ్యా అని ఎలుగెత్తి ప్రార్థిస్తుంది ఆమె.
క్రైస్తవమత ప్రచారంలో, ఉపన్యాసాలలో మనం తరచు వినే పదాలు, వాక్యాల విరుపులూ తొంగిచూస్తూ ఉన్నా కేవలం మత ప్రచారగీతంలా కాక మనిషి జీవితాన్ని వ్యాఖ్యానం చేస్తూ, మనిషి మనిషిగా, మానవత్వం తో మనీషిగా మారడానికి కావలసినదేమిటో అన్న విషయాన్ని ఆలోచిస్తూ, ఆ విధంగా జరగడానికి కావలసిన దైవ సహాయాన్ని ఆకాంక్షిస్తూ, ఆ ప్రభువు శరణాగత వాత్సల్యాన్ని నిరూపిస్తూ మూడు చరణాలలో సాగింది
- ఈ గీతం.
ఈ గీతంలో కవి చెప్పిన విషయాలు క్రైస్తవమతానికే కాక సర్వమతాలకు వర్తించేవి. మనిషి సంసారంలోను, లోకంలోను ఉన్న మాయను గుర్తించి, లేనిదానికోసం తపించడం మాని ఉన్న దాంతో తృప్తిపడుతూ, ప్రేమ, క్షమ లను జీవితాదర్శాలుగా గ్రహించి తోటివారిని మనిషిగా గుర్తించడం జరిగిన నాడు లోకంలో మనిషి మనుగడ సుఖశాంతులతో సాగుతుంది. మంచితనంతో మనసులను నింపుకొని మాయను ఛేదించి సత్యాన్ని శోధించే దిశగా మనిషి ప్రయాణం సాగితే మనిషి ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు. తనలోనే భగవంతుడిని దర్శించగలుగుతాడు. సర్వమత సారాంశం బోధించే నీతి ఇదే.
చిత్రం రాజాధిరాజు (1980)
బానర్ రమాచిత్ర దర్శకుడు బాపు సంగీతదర్శకుడు కె.వి. మహదేవన్ గీత రచయిత వేటూరి సుందరరామ మూర్తి గానం పి. సుశీల
వియోగం అత్యంత కరుణరసాత్మకమైనది. అది ఎవరిమధ్య సంభవించినా కూడా.
క్రౌంచ పక్షులమధ్య కలిగిన వియోగం ఓ బోయవానిచేత మధురమైన కావ్యమే పలికించిందట. మరి ఎంతో భాష, కవిత్వంలోతులు తెలిసిన సినీకవుల గురించి వేరే చెప్పాలా.
భావకవితా యుగంలోను, సినీమా గీతాలలోను ఎన్ని వియోగగీతాలు చూసి ఉంటాం - అదే, వినిఉంటాం!!
వియోగ గీతాలన్నీ సాధారణంగా ప్రేమికుల మధ్య కలిగిన ఎడబాటునే చిత్రిస్తూ సాగుతాయి. ఈ గీతాలకు నేపథ్యం వారి మధ్య కలిగే ప్రణయానికి భంగకరంగా సంభవించే సన్నివేశాలే అయి ఉంటాయి.
కానీ ఆరుద్ర రచన అయిన ఈ పాట వియోగ గీతాలలోనే భిన్నమైనది. సంగీత రచనలోనే కాక సాహిత్యరచనలోను, భాష, శిల్పం దృష్ట్యా కూడా కొత్తగా అనిపించి కరుణరసార్ద్రతతో హృదయం చెమ్మగిల్లుతుంది.
ఈ గీతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది యువతీ యువకుల మధ్య కలిగే ఎడబాటును, దానివల్ల కలిగే దుఃఖాన్ని చిత్రించినది కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఏదో అవగాహన లోపం వలన సంభవించిన ఎడబాటు, ఆ వియోగం వలన ఆ ఎడబాటులోని బాధను సహించలేని హృదయం పడే ఆరాటం ఇవి ఈగీతానికి నేపథ్యమైన అంశాలు.
గీతం ఎత్తుగడ చాలా నూతనమైన విధానంలో ప్రారంభమవుతుంది.
సరే సరే ఓరన్నా సరే సరే.....అంటూ.
తెలుగు భాషలో చాలా సందర్భాలలో రక రకాలుగా, ఒక్కోసారి ఊతపదంగా కూడా ప్రయోగించబడే ఈ సరే అనే పదాన్ని ఆరుద్ర పాట ఎత్తుగడకి వాడడం లోనే ఓ కొత్తదనం కనిపిస్తుంది. సరే సరే అంటూ మనం వ్యవహారంలో వాడే మాటని -ఇక ఇంకేంలేదు కదా, అంతే కదా!! అంటూ ఆ సంభాషణకో, ఆ సందర్భానికో ముగింపుగా వాడతాం.
పాటలో కూడా సరే సరే ఓరన్నా సరే సరే అని మొదలవుతుంది. కానీ ఇక్కడా ఆ సరే సరే అంటే ఏదో అక్కడ జరిగిన విషయం, అంతటితో ముగిసిపోయిన విషయం గురించే కాక ఆ విషయం చెప్పడానికి - ఓ మొదలు అని మనకు అర్థం అవుతుంది.
ఆ వెంటనే...." పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే", "గుండె కలచి కలచి ఇంక నిన్ను బాధించనులే" అంటూ సరే సరే అంటూ పల్లవి ముగుస్తుంది. ఆ స్నేహితుడి కోసం ఎంతగానో పిలిచాడని, తన పిలుపు అతనికి ఇష్టం లేదు కాబట్టి అతనికి బాధ కలిగిందేమో అని అనుమానం వస్తుంది కాబోలు. అందుకే ఇంక నిన్ను నా పిలుపుతో వేధించను, బాధించను అంటూ సరే సరే ఇక నిన్ను పిలవదలుచుకోలేదు అంటాడు.
వెర్రిగాలి వీచినపుడు వెదురైనా పాడుతుంది
నల్ల మబ్బు పట్టినప్పుడు నెమిలైనా ఆడుతుంది
నీ నేస్తం నీకోసం చావు కేక వేస్తే పలుకనైన పలుకవు
రాయిలా ఉలకనైన ఉలకవు........
సరే...సరే...ఓరన్నా...సరే సరే.
గాలి బాగా వీచినప్పుడు వెదురు బొంగులలోంచి ప్రవహించినపుడు వేణుగానం వినిపిస్తుంది. ఆకాశంలో నల్లగా మబ్బు పట్టినప్పుడు నెమలి ఎంతో కనువిందుగా నాట్యం చేస్తూ ఆడుతుంది. ఇవి ప్రకృతిలో ఒకదానికొకటి జతలుగా, నేస్తాలుగా చెప్పబడుతున్నవి. ఒకటి లేనిది మరొకటి లేదు. కానీ ఈ స్నేహితుడు ఒకనాడు తనతోనే ప్రాణంగా మసిలినవాడు, ఈనాడు ఎంతో బాధతో మరణమాసన్నమవుతున్నవేళ వేసిన చావుకేకలాంటి తన కేక ని ఆ స్నేహితుడు ఎందుచేతనో వినడం లేదు. కనీసం పలకనైనా పలకడం లేదు. రాయిలా ఉలకడూ పలకడూ ఆ స్నేహితుడు. ఎందువలనో తెలియడంలేదని అనుకుంటూనే సరే ఇంక ఈ జీవితానికి ఇంతే ప్రాప్తం అనుకుంటాడు.
అనుక్షణం నీపేరే పిలుచుకుంటాను మనసులోన నీ ఊసే తలుచుకుంటాను నీవే దిగివస్తావని నిలిచి ఉంటాను నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను
తన బహిప్రాణంగా మసిలిన తన స్నేహితుడిని తాను మరిచిపోలేకపోతున్నాడు. అనుక్షణమూ అతని జ్ఞాపకాలు వేధిస్తున్నాయి. అతని పేరు పదే పదే జ్ఞాపకం వస్తూఉంది. ప్రతిక్షణం మనసులో అతనితో గడిపిన కాలమే ఊహలలో కదులుతోంది. ఏ సందర్భమూ చూపకుండా అకారణంగా తనను వదిలివెళ్ళిపోయాడు ఆ స్నేహితుడు. కారణం అతను చెప్పలేదు. కాబట్టి అతనే తనకోసం దిగిరావాలి కానీ వేరే అవకాశం లేదు. వదిలిపెట్టిన కారణం ఏదో తెలిస్తే దానికి కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నీవే దిగి వస్తావని నిలిచిఉంటాను అంటాడు. అక్షరాలనే కాక పదాలను ఇక్కడ అంత్యప్రాసలుగా వాడారు ఆరుద్ర. స్నేహితుడి చెలిమి కోసం అతను పడుతున్న ఆరాటాన్నంతా ఈ పదాలు వెల్లడిస్తాయి.
నిజమైన ప్రేమ కానీ, స్నేహం కానీ తమ వలపును, స్నేహాన్ని పంచిన వారి ఉన్నతినే కోరతారు కానీ నాశనాన్ని కాదు. అందుకే తనని ఇంత బాధ పెట్టి, ఏ కారణం లేకుండా తన ఖర్మానికి తనను వదిలిపెట్టిన ఆ స్నేహితుడు తనను వదిలి వెళ్ళినా అతను బాగుండాలని వేయి దేవుళ్ళను కోరుకుంటాడు తప్ప తనని కాదని వెళ్ళిన అతని నాశనాన్ని కాదు.
పాటలో పదే పదే చర్వితచరణంగా వచ్చే సరే సరే ఓరన్నా సరే సరే...సరే సరే ఓరన్నా సరే సరే అనే పదాలు
శ్రోతలోని కరుణరసోత్ర్పేరణకు సోపానాలు వేస్తూ పాట చివర పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే, గుండె కలచి కలచి ఇంక బాధించనులే అంటూ ముగించడంతో శోకరసం శిఖరాయమాన స్థాయికి చేరి కళ్ళు చెమ్మగిల్లుతాయి.
నిజమైన స్నేహంలోని అందమైన బంధాన్నే కాదు, అది వీడిపోయినప్పుడు హృదయాలలో
చెలరేగే బడబాగ్నిని కూడా ఎంతో నేర్పుగా చిత్రించి చూపారు ఆరుద్ర.
బాలసుబ్రహ్మణ్యంగారు పాటలోని సాహిత్యంతో లీనమై ఎంతో గాఢమైన అనుభూతితో తాను అనుభవించి పలవరించినట్టనిపించే పాట ఇది. సరే సరే అంటూ ...అన్న అన్ని సందర్భాలలోను ఆ విషాదాన్ని తారస్థాయికి చేర్చి అతను పాటను ఆలపించిన విధానం విషాదమాధుర్యాన్ని చవిచూపుతుంది.
పాటని సినిమాలో స్నేహబంధానికి సంబంధించిన వియోగం పొందిన పాత్ర మనస్థితిని దృష్టిలో పెట్టుకొని రాసినదే కావచ్చు.
కానీ, ఒక్కోసారి మనం అత్యంత గాఢమైన మమతలతో అల్లుకున్న ఏ అనుబంధమైనా అపార్థానికి గురైనపుడు, వారినుండి వియోగం పొందినప్పుడు ఈ పాటని వింటే అచ్చు మనం కూడా ఇలాగే అనుకున్నామే అనిపించక మానదు.
అదే పాటని పదికాలాలు నిలిపి ఉంచే జీవలక్షణం.
ఈ పాట స్నేహం సినిమా కోసం రచించబడింది. పాట రచన ఆరుద్ర. సంగీతం
కె.వి.మహదేవన్.
పాటని అత్యంత విషాదభరితంగా ఆలపించిన మధుర గాయకుడు ఎస్. పి.
బాలసుబ్రహ్మణ్యం.
కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి పంజరాన గట్టు వడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను
ఏ సమాజంలో అయితే కులం, మతం అనేవి వ్యక్తి లోని వ్యక్తిత్వానికి కాక వారి బాహ్య అస్థిత్వాన్ని నిర్ణయించే ప్రాతిపదికలు అవుతాయో అలాంటి సమాజాన్ని త్రోసిరాజని, ఆ కులమతాల పంజరంలో తాను చిక్కబోనని, లోకం తన గురించి ఏమనుకున్నా తాను విశ్వం మొత్తానికి చెందిన మానవుడిని అని చెప్పుకున్న గొప్ప మానవతావాది గుఱ్ఱం జాషువ.
1895 సం. సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాషువ రచనలలో చాలా కావ్యాలలో కథా వస్తువుకు, ఆయన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. బాల్యంనుండి తన కులం వలన తాను పొందిన అనుభవాలు బాధామయమైన జీవితంలోని అనేక సంఘటనలు ఆయన రచనలలో అనుభూతులను, ఆవేదనను అత్యంత కరుణరసాభినివేశంతో వెల్లడించారు జాషువ. అస్పృశ్యత ను నిరసించడం, మూఢాచారాలను గర్హించడం, జాతీయోద్యమం, స్త్రీజన అభ్యుదయ కాంక్ష మొదలైనవి జాషువ రచనలలో ప్రధానంగా కనిపించే అంశాలు. కాదేదీ కవితకనర్హం అంటూ ఆయన తరువాత కాలంలో శ్రీశ్రీ చెప్పినా జాషువ గారు స్పృశించిన కవితా వస్తువులను చూస్తే నిజమే ననిపిస్తుంది.
జాషువ గారి కవితలో సంప్రదాయ కవిత కాలంనుంచి, భావకవిత్వ యుగం వరకు కనిపించే ప్రభావాలన్నీ కనిపిస్తాయి. సంప్రదాయ కవిత్వంలో లాగే పద్యాలతో కావ్య రచన చేసినా అందులో సరళ వ్యావహారిక పదాలను అందులోనూ అరబ్బీ, పారశీకం, ఆంగ్ల భాషల పదాలను కూడా అలవోకగా ప్రయోగిస్తూ రచనలు చేసారు. కొన్ని రచనలలో భగవంతుడిమీద నమ్మకం కలిగిన ఆస్తికుడిగాను, మరికొన్ని రచనలలో నిరీశ్వర తత్వం తోను రచనలు చేసి నాస్తికుడిగాను కనిపించినా జాషువ రచనలద్వారా ప్రధానంగా మనం గ్రహించగలిగే తత్వం - ఆయన లోని మానవత్వం.
'క్రీస్తు చరిత్ర' పేరుతో జాషువ రచించిన కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడెమీ వారి బహుమతి 'పద్మ భూషణ' బిరుదు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలంయం నుండి ' కళా ప్రపూర్ణ ' పొందారు. తన కావ్యరచనా పటిమకు ప్రజలనుండి నీరాజనాలు అందుకున్నారు. గండ పెండేరం తొడిగించుకున్నారు. గజారోహణం చేసారు. కనకాభిషేకాలు చేయించుకున్నారు. కవి కోకిలగా, నవయుగ కవి చక్రవర్తిగా, కవి దిగ్గజంగా, మధుర శ్రీనాధుడు గా ప్రజల లో కీర్తించబడ్డారు.
అంటూ లోకం తనను ఎన్ని విధాల తిరస్కరించినా, సత్కరించినా ఎక్కడా నిరుత్సాహ పడక పోవడమే కాక పూర్ణోత్సాహంతో తన కవితా ప్రస్థానాన్ని సాగించానన్నారు జాషువ. తిరుపతి వేంకట కవులలో ఒకరైన కవిదిగ్గజం చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి వంటి మాన్యులతో గౌరవంగా గండపెండేరం తొడిగించుకున్న అదే జాషువ, మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ వంటి వారి చేత అవమానాలు పొందారు. కానీ దూషణ భూషణాలను సమానంగా భరిస్తూ మొక్కవోని దీక్షతో సాహితీ వ్యవసాయాన్ని కొనసాగించిన స్థితప్రజ్ఞత జాషువకు మాత్రమే చెల్లింది.
ఇటువంటి తన జీవిత కాలంలో తాను పొందిన అనుభవాలను తాను పొందిన సన్మానావమానాలను ఎంతో సమర్థంగా కమ్మని కావ్యరూపం ఇచ్చి నా కథ అనే పేరుతో పద్యాలలో రచించారు. తెలుగువారికి మాత్రమే చెందిన పద్య ప్రక్రియలోనే రచనలు చేసినా అందులో కవిగా తన స్వాతంత్య్ర దృష్టిని ప్రకటించారు. ఆధునిక దృష్టితో, వ్యావహారిక శైలిలో గుండె లోతుల్లోనుండి పొంగి వచ్చిన కవితా ప్రవాహం అనదగిన చిక్కని కవిత్వం రాస్తూ అందమైన అచ్చతెలుగు పదాలతో పాటు అరబ్బీ, పార్శీ, సంస్కృతం లాంటి ఇతర భాషల పదాలను కూడా సందర్భానుసారం, అత్యంత భావగర్భితంగా ప్రయోగిస్తూ తెలుగు పద్యానికి కొత్త సొబగులు అద్దారు జాషువ.
కులమతాలనే కుళ్ళుతో కునారిల్లుతున్న సమాజంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులనుండి సమ సమాజం, సమతావాదపు పునాదులతో ఏర్పడాలని కోరుకున్నారు జాషువ.
జాషువ పద్య కృతులు హిమధామార్కధరా పరిణయం, శివాజీ ప్రబంధం, కన్యకా పరమేశ్వరి మొదలయినవి.ఇవి మొత్త ఏడు సంపుటాలలో ప్రకటించబడ్డాయి.
రక్తగానం అనేపేరుతో గల రచన యుద్ధ ప్రచార గీతాల సంకలనం.
ఫిరదౌసి,ముంటాజ్ మహల్, క్రీస్తుచరిత్ర, గబ్బిలం, నాగార్జున సాగరం, స్వయం వరం, నేతాజీ, కాందిశీకుడు, రాష్ట్ర పూజ, కొత్తలోకం, ముసాఫరులు,బాపూజీ అనే ఖండ కావ్యాలు, దావీదు చరిత్ర , ధ్రువ విజయము, చిదానంద ప్రభాతము, రుక్మిణీ కల్యాణం, మీరాబాయి, తెరచాటు జాషువ రచించిన నాటకాలు. ఇంకా చిన్నానాయకుడు, కుశలవోపాఖ్యానం అనే వచన రచనలు కూడా చేసారు. కానీ జాషువ రచనలలో గద్యం కన్నా పద్యరచనలకే ఎక్కువ ప్రజాదరణ లభించింది.
జాషువ రచనలలో పిరదౌసి కావ్యం చాలా విశిష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానమైన కథాంశం - గజనీ మహమ్మద్ అనే రాజు చేతిలో మోసపోయి ఆ అవమానంతో బాధతో చేయని నేరానికి శిక్షను అనుభవించిన పిరదౌసి అనే పారశీక కవి జీవితంలోని వేదనను కావ్యంగా మలచడం.
గజనీ మహమ్మదు అనే ఆఫ్ఘను దేశపు రాజు పారశీక కవి అయిన పిరదౌసిని పిలిపించి తన వంశ చరిత్రను కావ్యంగా రాయమని, ఆ కావ్యాన్ని తనకు అంకితం ఇవ్వమని కోరతాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు దీనారం చొప్పున బహుమతి ఇస్తానని అల్లాపై ఒట్టు వేసి కవికి వాగ్దానం చేస్తాడు. కవి పిరదౌసి ఎంతో సంతోషించి కవి ముప్ఫయి సంవత్సరాల పాటు కష్టపడి అరవై వేల పద్యాలతో రాజుగారి వంశ చరిత్రను, ఆ రాజుల పరాక్రమాలను వర్ణిస్తూ అత్యంత ప్రతిభతో కావ్య రచన చేసాడు.
ఈ కావ్యరచన చేసినప్పుడు ప్రకృతిలో ఒక భాగంగా ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ , తన అనుభవాన్ని తన రచనలోకి అనువదిస్తూ కవి ఎంత గొప్పగా ఆ కావ్య రచన చేసాడో జాషువ వర్ణిస్తారు. కవిని కన్న తల్లి గర్భము ధన్యమయింది అంటారు జాషువ. అటువంటి కవి రచనని అంకితంగా అందుకున్న కృతి భర్త అయినవాడికి కూడా మరణం అంటూ ఉండదు. కావ్య రచన చేసినవాడు, దానిని అంకితం పొందినవారికి కూడా ఎప్పుడూ మరణమనేది ఉండదంటారు జాషువ. ఎంతో కష్టపడి తాను రచించిన షానామా గ్రంథాన్ని ముగించి రాజుగారికి అంకితం ఇచ్చాడు పిరదౌసి. రాజు చాలా సంతోషించాడు. మరునాడు సభకు వచ్చి ఆ కావ్యాన్ని పఠించమని అడిగాడు.
పూలమాల చేతపట్టుకుని లజ్జావతియై సభాప్రాంగణంలోకి ప్రవేశించే రాజకుమార్తెలా పిరదౌసి తను రచించిన కావ్యాన్ని చంకలో పెట్టుకుని తనకు లభించబోయే అత్యున్నతమైన గౌరవాన్ని గురించి ఊహిస్తూ ఉత్సాహంగా సభలోకి ప్రవేశించాడు పిరదౌసి. తనను వరించబోతున్న కావ్యకన్యను గ్రహించబోతున్న గజనీ మహమ్మదు సభలో సింహాసనం పై కూర్చొని కొత్త పెళ్ళికొడుకులా చిరునవ్వుతో ప్రకాశిస్తున్న మోముతో కవి పిరదౌసి ని కావ్య పఠనం చేయమని ఆదేశించాడు.
బయటకు ప్రకాశిస్తూ ఉన్న లోపల డొల్లగా ఉండే కరిమింగిన వెలగపండు వంటి జ్ఞానంతో పెద్ద పెద్ద బొజ్జలతో, మీసాలు దువ్వుతూ ఉన్న తురుష్కపండితులు నిండి ఉన్న సభలో తన కావ్యాన్ని పఠించడం ప్రారంభించాడు పిరదౌసి. అరవై వేల పద్యాలను తన కల్పనాశక్తితో , గుర్రంలా కదనుతొక్కే పద్యగమనంతో చదువుతూ సభలోని రాజును, పండితులను కూడా అలరింపజేసి కావ్య పఠనం పూర్తిచేసి తనకు కలగబోయే గౌరవ సన్మానాలను ఊహిస్తూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు పిరదౌసి.
కానీ కవి ఊహించినది వేరు, జరిగినది వేరు. పిరదౌసి రచించిన కావ్యం లోని మాధుర్యాన్ని ఎంతగానో అనుభవించి, ఉత్తేజితులై కూడా రాజుగారు కవికి తను బాస చేసినట్టు బంగారు దీనారాలను కాక ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క వెండి నాణెం చొప్పున రాజు అతని ఇంటికి పంపించారు. దానికి కారణంగా జాషువ గారు ఇక్కడ ఓ పదం వేసారు. పండితులేమి చెప్పిరో అంటూ. దేవుడు వరమిచ్చినా పూజారి కూడా కనికరించాలంటారు. రాజు దగ్గర ఉన్న పండితులు ఈర్ష్యాసూయలతో కల్మషం నింపుకొని పిరదౌసి గురించి అతని కావ్యాన్ని గురించి చెప్పిన చెడ్డమాటలు రాజు మనసులో కూడా విషాన్ని నింపాయి. అందుకే పిరదౌసి కి తాను చేసిన వాగ్దానాన్ని దాటి రాజు ఒక్కొక్క పద్యానికి బంగారు నాణాలకు బదులు, వెండి నాణాలు పంపించాడు. రాజు చేసిన ఈ మోసానికి పిరదౌసి గుండె దహించుకుపోయింది. భరించలేని అవమానంతో, వేదనతో అతని శరీరంలోని రక్తమాంసాలతో పాటు మనసు కూడా ఉడికిపోయింది.
ఎన్నో కొండలు గుండెలోఁగరఁగి పోయెన్, వార్ధి సంతానముల్ గన్నీరయ్యె, సమస్త లోకము నిరాకారస్థితింబొల్చె, ను త్పన్నం బయ్యె విషాద మేఘ పటలధ్వాంతౌఘ,మాశాలతల్ సున్నాలయ్యె నగాధ కూపజలరాసుల్ దోఁచెఁ బిర్దౌసికిన్
అన్న పద్యంలో రాజుగారు చేసిన అవమానాన్ని భరించలేని పిరదౌసి ఆవేదనను, మానసిక స్థితిని అద్భుతంగా వర్ణించారు జాషువ. రాజు పంపిన కానుకను, తిరస్కరించి పంపివేసాడు పిరదౌసి. తాను నిర్మించుకున్న ఆశా సౌధాలు నేలకూలిపోగా ఆవేదనతో , దుర్బరమైన మానసిక వ్యథతో రాజు తనకు చేసిన అవమానాన్ని నిరసిస్తూ ఓ లేఖ రాసి రాజుకు పంపించాడు.
ప్రపంచ సాహిత్యంలో లేఖారచన - గొప్ప సాహితీ ప్రక్రియగా ఎంతో ఆదరణ పొందిన ప్రక్రియ. లేఖల ద్వారా తమ మానసికమైన అనుభూతులను అద్భుతంగా వర్ణించి కావ్యస్థాయికి చేరిన వర్ణనలతో, కల్పనలతో కూడినవి సాహిత్యంలో అత్యున్నతమైన స్థాయిని అందుకున్న రచనలెన్నో. జాషువ - పిరదౌసి తనకు రాజు కలిగించిన ఆశా భంగాన్ని వర్ణిస్తూ గజనీ మహమ్మదును సంబోధిస్తూ అతనికి రాసిన లేఖ అటువంటి గొప్ప అనుభూతిని కలిగించే రచన.
ఆ లేఖ ఈ విధంగా ఉంటుంది. పిరదౌసి రాజును సంబోధిస్తూ రాసిన లేఖ కనుక సందర్బంలో కవి ఓ సుల్తాను మహమ్మదూ అంటూ రాజును సంబోధిస్తారు. ఓ సుల్తాను మహమ్మదూ కృతకవిద్యుద్దీపముల్ నమ్మ యా శాసౌధంబును గట్టికొంటి నది నిస్సారంపుటాకాశమై నా సర్వస్వము దొంగిలించి నరకానం గూలిపోయెన్ వృథా యాస ప్రాప్తిగ నిలినాఁడనొక దుఃఖా క్రాంత లోకంబునన్
పిరదౌసి సుల్తాను తనకు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆశాభంగం పొందడాన్ని గురించి ఇలా అంటాడు. "ఓ సుల్తాను మహ్మదూ, నకిలీకాంతులు నమ్ముకొని ఆశా సౌధాన్ని కట్టుకున్నాను. కానీ అది ఏ వెలుగూలేని చీకటినిండిన ఆకాశంలో, నరకంలో కూలిపోయింది. చేసిన పని అంతా నిష్ప్రయోజనం కాగా చీకటి లోకంలో నిలిచిపోయాను. ఇక నా కలంలో మసి అనే సిరా నిండిపోయింది. విషాద గీతాలను మాత్రమే రచించగలను. నీకు చేసిన ముప్పయి ఏళ్ళ సేవకు ప్రతిఫలంగా నాకు వయస్సు పట్టుతప్పి, వార్థక్యం అలముకున్న శరీరం మాత్రమే మిగిలింది."
"ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క నెత్తురు బొట్టు కర్చు అవుతూఉండగా నీ వంశ చరిత్రను రాసాను. కవితకు బహుమతి ఇస్తానన్నావు. మంచి వంశంలో పుట్టిన వాడివికదా మరి. ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేయవచ్చునా రాజా? నీవు చాలా టక్కరి వాడివి సుమా. అల్లా తోడుగా నాకు బంగారం దీనార్లు చెల్లిస్తానని చెప్పి, వెండి నాణాలను పంపించావు. ఈ విధంగా అబద్ధాలాడే నీలాంటి మోసగాడితో పూజించబడితే అల్లాకు సుఖంగా ఉంటుందా చెప్పు. ఎవడైతే సత్యవాక్పరిపాలన చేస్తాడో వాడే ఈ భూమ్మీద గొప్పవాడు" అంటూ పిరదౌసి రాజుకి సత్యవాక్య పరిపాలన గొప్పతనాన్ని చెప్తాడు.
హాయిగ నీ యశస్సు వెలయం గల చక్కని మేడఁగట్టి దీ ర్ఘాయువుఁబోసినాడను తదన్వయవల్లికి వట్టి చేతులన్ బోయెద నంధకారమున మున్గి సుఖంబులఁబొద్దు గ్రుంకె రా జా యికఁ దాండవించెద భయంకర ఖేద తమాల వాటికన్.
సుల్తాను వంశ ప్రతిష్టను పెంచేవిధంగా తాను రాసిన కావ్యం వలన అతని వంశం తరతరాల పాటు వర్థిల్లే విధంగా కీర్తి అనే మేడకట్టి దానికి వంశ చరిత్ర అనే తీగను పాకించి సుదీర్ఘకాలం మన్నేలా చిరాయువు పోసానని, కానీ సుల్తానుకు ఇంత చేసిన తాను ఒట్టి చేతులతో వెళుతున్నానని, ఇక తన జీవితంలో సుఖాల పొద్దులు గ్రుంకి పోయాయని, చీకటి తోటలలో తానిక ఒంటరియై దుఃఖంతో తాండవిస్తానని అంటాడు పిరదౌసి.
గజనీ మహమ్మదు వంశం బానిస రాజుల వంశం. అందువల్ల జాషువ పిరదౌసి తో ఇలా అనిపిస్తారు. ఓ కఱకు తురుష్క భూపతీ అంటూ రాజుగారిని సంబోధిస్తూ పిరదౌసి ఇలా అంటాడు. "నేను ఒక బానిస రాజును మల్లెపూల అత్తరుతో అభిషేకించాను అదే నేను చేసిన తప్పు. నకిలీ జరీ వస్త్రం లోంచి బంగారం తీయాలనుకుంటే సాధ్యం అవుతుందా. ఇక ఎప్పటికీ ఆరిపోని నిప్పుకణికల లాంటి దుఃఖాన్ని నా నెత్తిన పోసుకున్నాను."
అలసటఁదీర్చుకొందును మహమ్మదు రాజులతో సమాధి శ య్యలపయి ముప్పదేఁడుల ప్రయాసకు డెందము గందిపోయె ని ర్మలమగు చిత్తశాంతి కిఁక మార్గము లేదెనలేని పండు వె న్నెల గురియించు నా కవిత నీకు లభించె నసత్యవాదికిన్.
"ముప్పయి ఏళ్ళపాటు నేను చేసిన ఈ కావ్యరచన అనే శ్రమవలన నా మనసు అలసిపోయింది. ప్రశాంతమైన మనసుతో జీవించే అవకాశం నాకిక లేదు. మహమ్మదు రాజుల కోసం కట్టిన సమాధులనే పడకగా చేసుకొని వాటిమీదనే విశ్రమించి నా అలసటను తీర్చుకుంటాను. నీవు ఎంతో అదృష్టవంతుడివి. నీవంటి అసత్యవాదికి పండు వెన్నెల కురిపించే కవితని బహూకరించినందుకు నాకు తగిన సత్కారమే లభించింది సుమా!!"
పిరదౌసి ఈవిధంగా తనను సంబోధిస్తూ రాసిన లేఖను అందుకున్న రాజుగారికి కళ్ళు ఎర్రబడ్డాయి. చాలా కోపించాడు. ఆవేశంతో ఊగిపోయాడు. చుట్టూ ఉన్న పరిజనంలో పిరదౌసి పై ఈర్ష్యపడే కవులూ ఉన్నారు. వారు రాజును మరికొంచెం రెచ్చగట్టారు. పిరదౌసి పాటి కవిత్వం చెప్పగలిగే కవులెందరో తమలోనూ ఉన్నారని, పిరదౌసి రాసిన కావ్యంలో రాజుగారి వంశానికి కీర్తి కన్నా అపకీర్తి ఎక్కువ కలిగే అంశాలే ఉన్నాయిని వాళ్ళు రాజుగారికి చెప్పారు. అయినా నల్లని తేనెటీగలు తెల్లని మల్లెపూల నడుమ తిరుగుతున్నా వాటి నలుపు మల్లెలకు అంటనట్టే రాజుగారి వంశం గురించి తక్కువ చేసి రాసినా రాజుగారి వంశ మర్యాదకు భంగం కలగదంటూ పిరదౌసి పై రాజు కోపం ఇనుమడించేలా మాట్లాడారు.
"రాజుగారు కరుణించి ఇచ్చిన తృణమో పణమో కిమ్మనకుండా తీసుకొని ఊరుకోకుండా, ఈ విధంగా కారుకూతలు కూస్తాడా, ఈ పాటి కవిత్వం మేము మాత్రం చేప్పలేమా" అంటూ పండితులు రాజుగారిని ఎగదోసారు. వాళ్ళు " ఇచ్చకపు జీతములందెడు పండితబ్రువుల్ " అనడంలో ఈనాడు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారికి ఇచ్చకాలు చెప్పేవారు తలచుకుంటే ఏ విధంగా అయినా చేయగలరని, వారి దయా దాక్షిణ్యాల పైనే కళాకారుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుందనీ అన్యాపదేశంగా చెప్పారు జాషువ. వెంటనే రాజు కోపంతో ఊగిపోయి పిరదౌసిని పట్టి బంధించి అతనిని వెంటనే చంపమని ఆజ్ఞ ఇచ్చాడు తన సేవకులకు.
రాజుగారి సభలో సత్కవులు, ప్రతిభను గుర్తించే వారు ఉన్నారు. వారు మాత్రం రాజు చేస్తున్న ఈ పనికి చాలా బాధ పడ్డారు. రాజు అప్పటికే ఎంతో దుర్మార్గుడని పేరు పొందినవాడు. ఇక "ఇక్కడితో అతని పాపం పండినట్టుంది, అందుకే సత్కవి అయిన పిరదౌసిని చంపదలచుకున్నాడు ఈ రాజు అని " అనుకున్నారు. ఆశాభంగం వలన కలిగిన దుఃఖంతో ఉడికిపోతున్న కవి రక్త పాతం వలన రాజుకి ఇక అమంగళం జరుగుతుందని భావించారు ఆ ధర్మపరులు.
రాజు తలమీఁద గవి కప్పురంబు చల్లె సుకవి తలమీఁద రాజు నిప్పు కలు విసరె కొందఱే పుణ్యమో చేసుకొనియె ననిరి కొందఱే పాపమో పట్టి కుడిపెననిరి రాజు తన వంశచరిత్రను కావ్యంగా రాయమని అడిగితే పిరదౌసి ఎంతో మహాద్భుతమైన కావ్యరచనా శక్తితో కావ్యాన్ని రచించి రాజుకి అంకితం ఇచ్చి అతని తల మీద కర్పూరం చల్లాడు ట. కానీ అటువంటి కవిని గౌరవించి నెత్తిమీద పెట్టుకుని పూజించవలసినది పోయి రాజు పిరదౌసి తలమీద నిప్పులను రాళ్ళలాగా చేసి విసిరాడుట. ఉపకారానికి అపకారం చేయడం అంటే ఎలా ఉంటుందో అన్న భావనని ఎంత అద్భుతంగా చెప్పారు జాషువ !! కొందరే పుణ్యమో చేసుకొనియె ననిరి అన్న వాక్యం రాజుకి వర్తిస్తుంది. ఏదో పూర్వజన్మ పుణ్యం వలన రాజు ఇటువంటి కావ్యాన్ని అంకితంగా పొందాడు అని కొందరు భావించారుట. కానీ మరికొందరు పిరదౌసి గురించి ఏ పూర్వ జన్మ పాపమో ఇతనిని పట్టి కుడుపుతోంది కదా అని బాధ పడ్డారుట. భారతదేశం లో మానవసమాజంలో లోతుగా పాతుకు పోయిన భావన కర్మ సిద్ధాంతం ఇక్కడ జాషువ గారి పద్యంలో కనిపిస్తుంది. మనుషులు చేసిన, పొందిన అనుభవాలన్నిటినీ కర్మసిద్ధాంతాన్ని ఆపాదించి గాఢంగా నిట్టూర్చి అది అంతే అంటూ వాటిని సరిపెట్టుకునే మనస్తత్వాన్ని ఇక్కడ చూపారు జాషువ.
కానీ ఒక పుణ్యాత్ముడు పిరదౌసిని వధించడానికి బయలుదేరిన సైనికుల కన్నా ముందుగానే బయలుదేరి, పిరదౌసిని చేరుకొని రాజుగారి ఆదేశాన్ని వినిపించి అతనిని అక్కడనుంచి పారిపోమని హెచ్చరించాడు.
రాజుగారి ఆజ్ఞ విన్న పిరదౌసి హతాశుడయ్యాడు. తాను రాజుగారి ప్రీతి కోసం రచించిన కావ్యంలోని అరవై వేల పద్యాలు అరవై వేల ఆయుధాలుగా మారిపోయి చివరకు తన కుత్తుకను కోయడానికి ప్రయత్నం చేయడాన్ని ఊహించిన పిరదౌసి కి ఒళ్ళు జలదరించింది.
అసలు ఆ పైన దేవలోకంలో భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఈ అన్యాయాన్ని చూడకుండా ఏం చేస్తున్నాడు? అనే సదస్త్సంశయానికి లోనయ్యాడు. ఆ ఆలోచన క్రమంగా అతనిలో ఓ నైరాశ్య భావానికి లోను చేసింది. చివరకు అతని ముఖం పై ఓ సన్నని నవ్వు ఉదయించింది. ఈ పద్యంలో బీభత్సరస ప్రధానమైన ఓ సన్నివేశం చిత్రించారు జాషువ. పిరదౌసి ముఖంలో కనిపించిందని కవి వర్ణించిన చిరునవ్వు పాఠకుడి మనసులో తీవ్రమైన అలజడి సృష్టిస్తుంది.
అంటూ తను రచించిన షానామా కావ్యం ఒక బెబ్బులిలా తనపైన పడి తనలోని జవసత్వాలన్నీ ఆరగించగా కేవలం అస్థిపంజరంలా మిగిలిఉన్నానంటూ, ఇటువంటి ముసలివాడి శరీరం మహమ్మదు గారి ఖడ్గదేవతకు బలి గా ఇస్తే ఆ దేవత సంతోషిస్తుందా అనుకున్నాడు.
ముత్యాలకు నిలయమైన సముద్రంలో ఎన్నో సార్లు మునకలు వేసాను. కానీ ఎంత భాగ్యహీనుడిని. ఒక్క ముత్యాన్నయినా సంపాదించుకోలేక పోయాను. సరికదా ఆ సముద్రమే నన్ను మింగడానికి నోరుతెరిచింది అంటూ ఓ పద్యాన్ని ఆ ఊరి మసీదు గోడలమీద లిఖించి ఆ అర్థరాత్రి సమయంలో భార్యను, పుత్రికను తీసుకుని ఊరువిడిచి తన స్వగ్రామమైన తూసు పట్టణానికి వెళ్ళిపోయాడు పిరదౌసి. వేకువజామునే ప్రార్థన కోసం వచ్చిన భక్తులు ఈ పద్యాన్ని చదువుకొని ఒళ్ళు జలదరించగా పిరదౌసి మీద జాలితో కదిలిపోయారు.
మరి కొన్నేళ్ళకు మహారాజుగారికి పశ్చాత్తాపం కలిగింది. తను చేసిన ఘోరాపరాధాన్ని తెలుసుకున్నాడు. కవికి తాను చేసిన ద్రోహానికి చాలా బాధ పడ్డాడు. పిరదౌసి కవికి తాను ఋణ పడిన బహుమతి మొత్తాన్ని అరవై వేల బంగారు దీనారాలను ఒంటెలపైకి ఎత్తించి భటులకు చెప్పి పిరదౌసి కి చెల్లించమని తూసు పట్టణానికి పంపించాడు.
కానీ విధి బలీయమైనది. మనం తలచుకున్నది ఏదీ జరగదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. రాజు పంపిన బహుమతి మొత్తం పిరదౌసి కి చేరవేయడానికి రాజు బలగం తూసు పట్టణం తూర్ప ద్వారానికి చేరుకున్నది. కానీ అదే సమయానికి కవి పిరదౌసి తీరని దుఃఖంతో, చేసిన మంచి పనికి గుర్తింపు లేకపోవడమే కాక, చేయని నేరానికి పొందిన శిక్ష గా అకాల వార్థక్యాన్ని పొంది అవమానంతో అలమటిస్తూ మరణించగా అతని శవం పడమటి ద్వారం ద్వారా స్మశానానికి బయలుదేరింది.
రాజ భటులు మరేం చేయాలో తోచక ఆ ధనాన్ని పిరదౌసి కుమార్తెను స్వీకరించమని ప్రార్థించారు. కానీ అభిమానంలో తండ్రికి తగిన కూతురు పిరదౌసి కుమార్తె. ఆమె ఆ బహుమానాన్ని అంగీకరించలేదు సరికదా నా తండ్రిని నిరంతరం మరణించే వరకు దుఃఖ పెట్టిన ఈ నీచమైన ధనాన్ని నేను కంటితో కూడా చూడను, ముట్టలేను అంటూ తిరస్కరించింది.
తాను కవి ఋణం తీర్చుకుందామనుకున్నా వీలుకాలేదని, సమయం మించిపోయిందని గ్రహించిన గజనీ మహమ్మదు ఎంతగానో బాధ పడ్డాడు. చేసిన పాపానికి నిష్కృతిగా తూసు పట్టణంలో ఒక గొప్ప సత్రాన్ని పిరదౌసి పేరు మీద అతని పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్మిచాడు. సమయం మించిపోయిన తర్వాత చేసిన పని, మంచిపనే అయినా అది ఫలితాన్నివ్వదు. కవి పిరదౌసికి కీర్తి మిగిలింది. రాజుకు అపకీర్తి మిగిలింది.
పిరదౌసి కావ్యాన్ని జాషువ గారు ఒక పారశీక కవి జీవితాన్ని చిత్రించడం అనే ఇతివృత్తం తోనే రచించినా తాను నివసిస్తున్న సమకాలిన సమాజంలోని వాస్తవాన్ని సామాజిక వాస్తవికతో చిత్రించడం వలన అది సజీవకావ్యంగా నేటికీ నిలిచిపోయింది. కవి స్వీకరించిన ఇతివృత్తానికి తగిన సన్నివేశ కల్పన, పాత్ర చిత్రణలో - పాత్ర బహిరంతర స్థితిగతులను వర్ణించడంలో జాషువ చూపిన ప్రతిభా పాటవాలు పిరదౌసి పాత్రను నేటికీ సజీవంగా నిలిపాయి. సమకాలిన భారతీయ జీవితంలోని వ్యక్తుల మానసిక, సాంఘిక స్థితిగతులపైన, మానవ ప్రవర్తనపైన లోతైన అవగాహన కలిగిన కవిగా జాషువ తన ప్రతిభను పిరదౌసి కావ్యంలో వ్యక్తీకరించారు.
"రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు" అని జాషువ గారు చెప్పిన మాటలు జాషువ గారికే వర్తిస్తాయి. తెలుగు సాహితీ లోకంలో మరణంలేని మహాకవి , గొప్ప మానవతావాది - అమరుడు మన గుఱ్ఱం జాషువ.
(గుఱ్ఱం జాషువాగారి నూట పదహారేళ్ళ జయంతి ఉత్సవం సందర్భంగా ఆ మహాకవికి జోహార్లర్పిస్తూ)
రాధలాగే తాను ఎంతగానో ఇష్టపడి ఆరాధించిన ప్రేమికుడు, కృష్టుడిలాగే తన వలపు
రుచి చూపి తనను అనురాగ వర్షంలో తడిపిన తన ప్రియతముడు ఒక్కసారిగా తనను, తన
ప్రేమను మరిచి, చివరకు తననే నీవెవరు, నాకు నీతో ఏం సంబంధం ఉందని
ప్రశ్నిస్తే ఆ వలచిన హృదయం ఏమయిపోతుంది?
అటువంటి ప్రశ్నకి ఆ క్షణాన ముక్కలుగా విడిపోయి, వలచిన, వలపించబడిన హృదయం పగిలిన గుండెతో ఆవేదనతో రగిలిపోతూ ఇలాగే పాడుకుంటుందేమో.
నల్లనయ్యా...ఎవరని అడిగావా నన్నూ..
మురళిని కాలేను
పింఛమయినా కాను నల్లని
కృష్ణయ్యకి ఎల్లవేళలా అంటి పెట్టుకొని ఉండేవి అతని పింఛమూ, మురళీ. మరి
తాను ఆరెండూ కాదు. అందుకే అతనికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఆ నల్లనయ్యని
ఎదలో ఎంతో దగ్గరగా ఊహించినా వాస్తవంగా దగ్గరకు చేరలేకపోయింది.
ఎవరని చెప్పాలీ నేనూ....ఏమని చెప్పాలీ నేనూ...
వలచిన రాధమ్మనూ విరహాన దించావు
పెంచినమ్మ యశోదనూ శోకాన ముంచావు
నీవు నేర్చినదొకటే -నిన్ను వలపించు కోవడం
నాకు తెలియని దొకటే - నా మనసు దాచుకోవడం
ఎవరని చెప్పాలీ నేనూ...ఏమనిచెప్పాలీ నేనూ. ఆ
నల్లనయ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాధమ్మను ఏనాడు తన దగ్గరకు
చేర్చుకోలేదు. గోకులంలో బృందావనంలో యమున ఒడ్డున విరహగీతాలను ఆలపిస్తూ
ఏనాడైనా అతనికి కనికరం కలగకపోతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది రాధ. రాధమ్మ
సరే...మరి తల్లి యశోద సంగతి ? అల్లారుముద్దుగా తనని పెంచినందుకు ఏం చేసాడు.
పెరిగి పెద్దవాడై గోకులాన్ని, గోపాలకులని విడిచిపెట్టి వెళ్ళడమే కాక వారితో
పాటు ఆ పల్లెలో తనకో తల్లి ఉందని తనతోటిదే లోకంగా బతికిందని మర్చిపోయి
దేవకీ నందనుడిగా ద్వారకలో వెలిగిపోయాడు. తల్లిని మరచాడు, చెలినీ మరచాడు.
అతనిగురించి
ఇప్పుడు ఇక్కడ ఈ చెలికి అర్థమైన విషయం ఒకటే. అతనికి ఎన్నో విషయాలు తెలుసు.
ఎంతో అనుభవజ్ఞుడు. ఎన్నోనేర్చాడు. వాటిలో జగమంతా అతన్ని విశ్వప్రేమికుడిగా
భావించి అతని ప్రేమలో లీనమైపోయేలా చేయడం - ఇది అన్నిటికన్నా అతనికి బాగా
తెలిసిన విద్య. కానీ ఆ గోపాలుడిని ప్రేమించిన ఆ బాల ఒట్టి ముగ్థ. కేవలం
నల్లనయ్యనే సర్వస్వమని నమ్మింది. ఏకళలూ తెలియని బేల. అందుకే తన మనసును
ఎప్పటికప్పుడు అతని ఎదుట విప్పి చెప్పి అతనిపై ప్రేమను ప్రదర్శించింది.
కోరిచేరిన ఆడమనసు ఎవరికైనా అలుసే. అందుకే గోపాలుడికి ఆమె మీద అంత
నిర్లక్ష్యం. అది ఇప్పుడు గ్రహించింది ఆమె. వెన్నయినా మన్నయినా ఒకటే అన్నావు
దొంగవయిన గానీ దొరవై నిలిచావూ
ఎంత మరవాలన్నా మనసును వీడిపోనంటావూ
ఎంత కలవరించినా కనులకు కానరాకున్నావూ
ఎవరని చెప్పాలీ నేనూ....ఏమనిచెప్పాలీ నేనూ...
ఇక
ఇక్కడ నుంచి మనకు కృష్ణతత్వం ఆవిష్కృతమవుతుంది. వెన్నతిన్నాడు, మన్నూ
తిన్నాడు. ఆ మన్ను తిన్న నోటిని లోనే పదునాలుగు లోకాలనూ చూపాడు. వెన్ననీ
మన్నునీ సమానంగా చూసిన ఆ కృష్ణ భగవానుడు భగవత్ స్వరూపుడుగా నిలిచాడు.
చిలిపి దొంగతనాలు చేసి వ్రేపల్లె వాసులకు, గోపికలకు గుండెల్లో గుబులు
పుట్టించాడు. దొంగ అయితేనేం దర్జాగా దొరగా మారిపోయి అనంతమైన గౌరవాలను,
మర్యాదలను అందుకున్నాడు. కానీ తనను ప్రేమించినవారిపైన మాత్రం కినుక
వహించాడు.
తనకోసం కలవరించే తన తల్లి యశోదను, తన రాధమ్మను, తన
అడుగుల సవ్వడికై వేచి ఉండే యమునాతీరాన్ని, పొదపొదలో వెతుకుతూ తనని గాలించే
గోపెమ్మలను అందరినీ మరిచాడు. రాజులా గా వెలగిపోతున్నాడు. తనను మరువలేక
ప్రతి క్షణం తన నామజపమే చేస్తూ, ఒళ్ళంతా కళ్ళై వేచి ఉన్న తనవారి చూపులకు
అందనంద దూరంగా అందలాలెక్కి ఉన్నవాడు... ఆ నల్లనయ్య ఇప్పుడు ఈ క్షణాన ఎదురుపడితే తనను గుర్తించలేకపోతే..... ఎవరని అడిగితే... ఇక తాను ఏమని చెపుతుంది.. ఏమని చెప్పాలి.....?? నల్లనయ్యా...ఎవరని అడిగావా నన్నూ..అంటూ తన నయనాల కరువు తీరా రోదించడం తప్ప!!
వలచిన
హృదయం తానే నేనని, నేనే తానని నమ్ముకొని ఉండగా తాను వేరు, నేను వేరు అని
అతనిచేత భావించబడి తిరస్కారానికి గురై తే పొందే వేదనను కృష్ణుడిపరంగా
అన్వయిస్తూ రచించిన అతి చక్కని సాహిత్యం ఈ పాటలో మనం చూస్తాం.
ఈ పాట రచన దాశరథి.
సంగీతం చక్రవర్తి సమకూర్చగా పి. సుశీల తన కమ్మని కంఠంతో పాటకు జీవం పోసారు