Friday, November 15, 2013

కార్తీక మాసం - విశిష్టత





 కార్తీకమాసానికి  హైందవ సంప్రదాయంలో  చాలా విశిష్టమయిన స్థానం ఉంది. సౌరమానంలో ఉన్నట్టే, చాంద్రమానంలో కూడా సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉన్నాయి.  ప్రతిమాసంలో పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నక్షత్రం పేరుమీద ఆ మాసానికి పేరు ఏర్పడుతుంది. చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసి ఉండే నెల కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు.
 
కృత్తికా నక్షత్రానికి అథిపతి అగ్ని. అగ్నికి ఆరుముఖాలు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు ఆగ్ని నక్షత్రాలు. వీటిలో మొదటిదైన కృత్తికా నక్షత్రం ఆరు నక్షత్రాలకలయిక అని, వీటిని కృత్తికలు అంటారని, కుమారస్వామికి ఈ కృత్తికలే పాలు ఇచ్చి పెంచాయని అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారని పురాణకథనం. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం సూర్యుడు సంవత్సరంలోని పన్నెండు నెలలలోను ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సౌర మానం ప్రకారం సూర్యుడు వృశ్చికరాశి లో ప్రవేశించే కాలం కార్తీకమాసం. చాంద్రమానం ప్రకారం సూర్యుడు కార్తీకమాసంలో తులారాశిలో ప్రవేశిస్తాడు. ఈవిధంగా రెండు కాలమానాల్లోనూ సూర్యుడి గమనానికి ఆలంబనమైన ఈ రెండురాశుల ప్రభావం కార్తీకమాస సమయంలో భూమిమీద చరించే మానవులమీద ఉంటుంది. హరిహరులు ఇరువురికీ ఇష్టమైన మాసంగా కార్తీకమాసం వస్తుంది. ఈ కార్తీకమాసం గొప్పదనాన్ని గురించి, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాలను గురించి  పురాణాలు వివరిస్తున్నాయి.

హిందువుల పండుగలన్నిటికీ పురాణాల్లో ప్రవచింపబడిన విషయాలు ఆదారంగా ఉంటాయి. ఈ కార్తీకమాసంలో శైవారాధనకి, విష్ణ్వారాధనకి సమాన ప్రాతినిధ్యం ఉండడం విశేషం. కార్తీకమాసం విశిష్టతను స్కందపురాణంలో వశిష్టుడు జనకమహారాజుకు, పద్మ పురాణంలో  శ్రీకృష్ణుడు సత్యభామకు వివరించినట్టు తెలుస్తోంది. కార్తీకమాసం దీపావళి పండుగ జరుపుకునే  అమావాస్య ముగియగానే పాడ్యమితో ప్రారంభమవుతుంది. 

కార్తీకమాసం -నదీస్నానాలు

  కార్తీకమాసం అంటే తెల్లవారుఝాము ఘడియల్లో చేసే నదీస్నానాలు, ఉపవాసాలు, దీపారాధనలు . వీటిగురించి తెలుసుకుందాం.

తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్యపావనీ
సర్వత్ర ద్రవరూపేణ పా సంపూర్ణా భవేత్తదా    

సూర్యుడు తులారాశిలో చేరగానే గంగానది ద్రవరూపంతో అన్ని నదీజలాలనూ చేరుతుంది. అందువల్ల కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించే తెల్లవారుఝాముల్లో నదీ స్నానం ఉత్తమమయినది అని చెప్తారు. ఈ మాసంలో భూమండలం మీద ప్రతి నది, చెరువు, సరస్సులు, బావులు మొదలైన జలాశయాల్లోనే కాక చివరకు ఆవుకాలు మోపినంత ప్రదేశంలో నిలిచిన నీటిలో కూడా విష్ణుమూర్తి అంశ ఉంటుందని ప్రతీతి. అందుకే ఈ నదీ స్నానాలకి కార్తీకమాసంలో అంత ప్రాముఖ్యం. 

సర్వపాప హరం పుణ్యం స్నానం కార్తీక సంభవం
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే  

అంటూ కార్తీక స్నానాలకు ఏ ఆటంకం కలుగకూడదని దామోదరుడిని  ప్రార్థిస్తారు. నదీజలాల్లో స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీటిని తీసుకుని  ఆలోడనం చేసి, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరంవైపు చల్లి ఒడ్డుకు రావాలి. పొడివస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణువును అర్చించి, ఆవునేతితో దీపారాధన చేయాలి. స్త్రీలు తులసిమొక్కనూ, పురుషులు ఉసిరి మొక్కను దీప సహితంగా దానం చేయాలి. కార్తీకమాసంలో  ప్రతి రోజూ కార్తీక వ్రతమహాత్మ్య కథలను తెలుసుకుని, విష్ణు శివాలయాల్లో దీపారాధన చేసేవారికి సర్వకర్మ బంధాలనుండి విముక్తి పొంది శివ లోక సాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలమంతా దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటిముందు వెలిగే దీపాలతో వీధులన్నీ ఎంతో ప్రకాశవంతంగా  శోభాయమానంగా ఉంటాయి. తెల్లవారుఝామున స్త్రీలు నదులలో, చెరువుల్లో, కోనేరుల్లో కార్తీక దీపాలను వదులుతారు. ఆకాశంలో నక్షత్రాలలాగా  ఈ నక్షత్రాలు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి.

కార్తీకమాసంలో  పాఢ్యమి, విదియ, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధులు చాలా ముఖ్యమైనవి. కార్తీకమాసంలో వచ్చే సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోముడు అంటే చంద్రుడు.సోమవారానికి చంద్రుడు అధిపతి. శివుడు చంద్ర శేఖరుడు.  అందుకే సోమవారం అంటే శివుడికి మహా ప్రీతి. సోమవారాలలో నియమనిష్టలతో శివుడిని ఆరాధించాలి.  హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివస్తుతి చేసి నదీస్నానం ఆచరించి శివాలయంలో అభిషేకం, అర్చనలు చేసి అనంతరం అన్నదానం చేసి ఆ పైన మాత్రమే భోజనం చేయాలని,  ఈ స్నాన, జప, తప విధులతో శివారాధన చేస్తే సుఖసంతోషాల జీవించి శివసాయుజ్యం పొందవచ్చునని హిందువుల నమ్మకం.

కార్తీకమాసం పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఈరోజు గోపూజ చేస్తారు. గోవును అలంకరించి పూజిస్తారు. విదియరోజు భగినీహస్త భోజన్ లేదా యమద్వితీయ అన్నా చెల్లెళ్ళ పండుగ. చవితిరోజు, నాగుల చవితి  పండుగ. ఏకాదశి రోజు శయన ఏకాదశి.చాతుర్మాస్యదీక్ష ఉపహసంహరణదినం. ద్వాదశి రోజు క్షీరాబ్ధి ద్వాదశి. దేవతలు అమృత మధనం కోసం క్షీరసాగరాన్ని మధించిన రోజు. దీనినే చిలుకు ద్వాదశి అని అంటారు. లక్ష్మీనారాయణుల పెళ్ళిరోజు. చతుర్దశి రోజు విష్ణువే స్వయంగా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించిన రోజుగా చెప్తారు.  ఇక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు నిండుగా ప్రకాశంతో వెలిగిపోయేరోజు.  ఇన్ని పండుగరోజులను  ప్రోది చేసుకున్నది కనుకే  కార్తీకమాసానికి  హిందువుల హృదయాలలో   అంత ప్రాముఖ్యం ఉంది.

 సోమవార వ్రతం అంటే ఏమిటి ?

ఇక కార్తీక మాసంలో వచ్చే  సోమవారాలను  చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారు  హైందవ సంప్రదాయంలో. శివప్రీతి కోసం సోమవారం చేయవలసిన ప్రత్యేక విధులను ఆచరిస్తే వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణం చెప్తుంది. సోమవార వ్రతం ఏవిధంగా ఆచరించాలో స్కంద పురాణంలో చెప్పబడింది. సోమవార వ్రతంలో ప్రధానమైనది ఉపవాస వ్రతం. బాలింతలైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఉపవాసాలను పూర్తి నిరాహారంగా చేయకూడదని, పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చని వాయుపురాణం చెబుతోంది. సోమవార ప్రత విధానం ప్రధానంగా ఆరు విధాలు.

1.           1.      ఉపవాసము

కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండాలి.సాయంకాలం పూట శివాలయంలో శివాబిషేకం చేసి ఆకాశంలో నక్షత్రాన్ని దర్శించుకుని తులసి తీర్థం మాత్రమే తాగాలి. 

2.        2.     ఏకభుక్తము

ఈవిధంగా పూర్తి రోజంతా ఉపవాసం చేయలేనివారు ఏకభుక్తము విధిని ఆచరించవచ్చు. ఏకభుక్తము అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయడం. ఈ విధిని చేసేవారు తెల్లవారుఝామున స్నానాలు, దీప దానాలు చేసుకుని మధ్యాహ్నం ఙోజనం చేయవచ్చు. రాత్రి మాత్రం భోజనానికి బదులుగా శైవ తీర్థమో, తులసి తీర్ధమో పుచ్చుకొని ఉపవాసం చేయాలి

3 . నక్తము
నక్తము అంటే రాత్రి అని అర్ధం. ఈ విధిని అవలంబించే వారు రోజంతా పగలు ఉపవాసం చేసి నక్షత్రాన్ని దర్శించుకుని రాత్రి భోజనం లేదా ఉపాహారం సేవించాలి.

4 . అయాచితం

కార్తీక సోమవారం ఆచరించేవారు పగలంతా శివనామ స్తోత్రం చేస్తూ ఉపవాసం చేయాలి. స్వయంగా భోజనానికి ప్రయత్నం చేయకుండా, ఎవరైనా ఆహ్వానిస్తే వారితో కలిసి భోజనం చేయవచ్చు. ఈ విధిని  అయాచితం అంటారు.

5. స్నానం 

ఈ రకమైన ఉపవాసాలు ఏవీ చేయలేని వారు మంత్రాలు చదువుతూ, తెల్లవారుఝామున స్నానాలు ఆచరించాలి. అది చేసినా చాలు. కార్తీక మాసంలో ప్రధానమైన విధి  నదీస్నానం. తలని నదిలో ముంచి పూర్తి స్నానం చేయాలి. 

6.  తిలాదానం

ఏ మంత్రాలు, జపాలు ఏ పద్ధతులు తెలియని వారు  కేవలం కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా కూడా కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందుతారు.


ఈ ఆరుపద్ధతుల్లో ఏ పద్ధతిని ఆచరించినా కార్తీకసోమవారం వ్రత ఫలితాన్ని పొందుతారు. ఈ సోమవారం వ్రతం చేసేవారు శివాలయాల్లో అభిషేకం చేయడం తప్పనిసరి. శివుడు భోళాశంకరుడు. ఓ చెంబుడు నీళ్ళు అభిషేకం చేస్తే చాలు భక్తులకు ఏ లోటు రానివ్వడు. ఈ సోమవారం వ్రతం చేయడంలో  ఓ పురాణగాధ ఉంది.

పూర్వం ఓ బ్రాహ్మణుడికి నిష్టురి అనే కూతురు ఉండేది. చాలా దుష్టగుణాలతో గయ్యాళిగా పేరుపొందింది. తండ్రి ఆమెను మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్ళి చేసాడు. భార్యగా ఆమె మిత్రశర్మను నానా బాధలకు గురించేసి హింసించింది. గయ్యాళిగా, కాముకురాలిగా గడిపి, ఆమె చేసిన పాపాల ఫలితంగా సుఖవ్యాధులతో మరణించింది. యమలోకం చేరి నానా హింసలతో కూడిన శిక్షలు పొంది, చివరకు మానవలోకంలో పదిహేనుసార్లు కుక్కగా జన్మించింది. ఆఖరి జన్మలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసం వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నడు.

ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం చేసి, శివాలయంలో అబిషేకాలు పూర్తిచేసుకుని, సోమవార వ్రత విధానం ప్రకారం నక్షత్ర దర్శనం చేసుకుని ఇంటి ఆవరణలో బలి కోసం భోజనాన్ని వదిలిపెట్టాడు. ఆ ఇంటికుక్క రోజంతా యజమానితో పాటు ఉపవాసం చేసి ఆరోజు ఏమీ దొరకక  క్షుద్బాధ పీడిస్తుండగా ఆ బలి అన్నాన్ని తిన్నది. వెటనే ఆ కుక్కకి పూర్వజన్మ స్మృతి వచ్చింది. బ్రాహ్మణుడను రక్షించమని వేడుకుంది. తనకు తన పూర్వజన్మ వివరాలు ఎలా గుర్తుకు వచ్చాయో అర్థం కాక బ్రాహ్మణుడిని తెలపమని కోరింది. బ్రాహ్మణుడు ఆ వివరాలన్నీ తెలుసుకుని  నీవు నేను వదిలిపెట్టిన బలి భోజనం తినడం వలన నీకు పూర్వ జన్మ స్మృతి ఉంది అని చెప్పాడు. మోక్షంకోసం ప్రాథేయపడిన ఆ కుక్కకి ఆ బ్రాహ్మణుడు తన సోమవార వ్రత ఫలాలలో ఒకదాన్న కుక్కకి దానం చేసాడు. ఆ కుక్క దివ్యస్త్రీగా మారి కైలాసానికి చేరుకుంది. 

ఈ విధంగా కార్తీక సోమవార వ్రతం చేసిన వారు  సర్వపాపాలనుండి విముక్తులై కైలాసానికి చేరుకుంటారని స్కాంద పురాణంలో జనకమహారాజుకి వశిష్ఠుడు తెలిపాడు.

కార్తీకమాసవ్రతం - ఆరోగ్య సూత్రాలు

ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించడంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా కనిపిస్తాయి. కార్తీక మాసం సోమవారాలలో చేసే ఉపవాసాల వలన  కడుపులో ఆహారం పూర్తిగా జీర్ణమై కడుపు శుభ్రపడుతుంది. శరీరంలోని జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరకడం వలన నవ చైతన్యం కలుగుతుంది.  కార్తీకమాసం తో చలికాలం ప్రారంభమవుతుంది. మంచి వానలు పడి వాతావరణంలో తేమ పేరుకుని ఉంటుంది. మాంసాహారం తీసుకునే వారికి జీర్ణసంబంధమైన ఇబ్బందులు తల ఎత్తే కాలం ఇది. మాంసం జీర్ణం కావాలంటే వాతావరణంలో వేడి ఉండాలి. ఈ పూజలు, నోముల రోజుల్లో మాంసాహారం నిషిద్ధం కనుక  ఉపవాసం చేసే వ్యక్తులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఉపవాస దీక్షల వలన మనోబలం నిశ్చయంగా చేకూరుతుంది.

కార్తీకమాసం రోజుల్లో చేసే నదీ స్నానాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో పడిన వర్షాల వలన నదులు నిండుగా ప్రవహిస్తుంటాయి. ప్రవహించే నదులు తమ గమనంలో ఎన్నో ఔషధీ మూలికలను తమలో కలుపుకుంటాయి. అందువలన ఈ నదులలో స్నానం చేయడం అనేది మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కార్తీకమాసంలో ఊసిరి, తులసి మొక్కలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసి మొక్క ఆరోగ్య సంబంధమైన ఓషధీగుణాల నిధి. ఈ మొక్కని ఆరాధించడంలో సౌభాగ్యమే కాదు, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే ఉసిరిక వృక్షం, ఉసిరి కాయలు ఆరోగ్యానికి సంబంధించి ఎంతో విశిష్టమైనవి. ధాత్రి అంటే ఉసిరిక. లక్ష్మీ దేవికి ఉసిరిక అంటే మహా ప్రీతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక వృక్షం క్రింద ధాత్రీదేవి, దామోదరులు ప్రతిమని ఉంచి పూజ చేస్తారు. ఈ కార్తీకమాసంలో ఉసిరిక  వృక్షాలకింద వనభోజనాలు చేయడం కూడా ఒక విధి. ఈ భోజనాలవలన సంఘ జీవనం, వ్యక్తుల మధ్య మానసిక అనుబంధాలు గట్టిపడడం వంటి మేలు జరుగుతుంది.

కార్తీకమాసం- దీపారాధన

కార్తీకమాసంలో దీపం వెలిగించడం, దీపాన్ని దానం చేయడం అనే అంశాలను కూడా ప్రత్యేకంగా చెప్పారు. నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి. మనుషులలో ఉండే స్వభావాలకు ఆధారం వారిలోని గుణాలు.  రాజస, సాత్విక, తాపన గుణాలు మనిషిలో ఉంటాయి. . ప్రమిదలో వత్తి  సత్వగుణానికి,  నూనె తమోగుణానికి,  మంట  సత్వగుణానికి ప్రతీకలు. ఇవన్నీ ఒకటికొకటి  సంపూర్ణంగా వ్యతిరేకమయిన గుణాలు.  కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. ఒక మంచి వ్యక్తిగా, పూర్ణపురుషుడిగా రూపు దాల్చాలనుకునే వారు తమలోని తామస,రజోగుణాలని అణిచిపెట్టుకోవాలి. సత్త్వ గుణాన్ని  పెంచుకోవాలి.  ఉత్తమ సాంగత్యం వలన ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడి సత్త్వ గుణం పెరుగుతుంది.  దీపం అంటే జ్ఞానానికి ప్రతీక. దీపాలను బయట వెలిగించడమే కాదు హృదయాలలో వెలిగించుకోవాలి. తద్వారా వ్యక్తుల జీవితాల్లో జ్ఞానదీపాలు ప్రకాశవంతంగా వెలుగుతాయి.
 
రాగద్వేషాలకు అతీతమైన స్వబావాన్ని పెంపు చేసుకుని సాత్వికులుగా మారిన వ్యక్తులు సమాజానికి కూడా ఆదర్శప్రాయులవుతారు. ఆరోగ్యవంతులైన ప్రజలతో కూడిన, ఒక ప్రేమపూరితమైన వాతావరణంతో సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా కార్తీకమాసంలో తెల్లవారుఝామున చేసే నదీ స్నానాలు, దీపారాధనలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు వంటి విధులన్నీ  సమాజంలో  ఒక ఆథ్యాత్మిక వాతావరణం ఏర్పరచి భక్తిభావాన్ని పెంపొందించి వ్యక్తుల సుఖజీవనానికి ఆలంబనను అందిస్తాయి.

Tuesday, October 22, 2013

ముత్యాల మురిపాల అట్లతద్ది పాట



ఈరోజు అట్లతదియ పండుగ. అట్లతద్ది అనికూడా అంటారు. ఇది ఆడపిల్లలు నోచుకునే ఒక నోము. 

అట్లతద్దోయ్ ఆరట్లోయ్
 ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అనే పాట అట్లతద్ది పాట. కుజదోషం పోయి మంచి భర్త లభించి చక్కని కుటుంబజీవితం కావాలని ఆడపిల్లలు నోచుకునే నోము అట్లతద్ది.  పూజలు, వాయనాలు, వెన్నెల్లో ఆటలు, ఉయ్యాలలు ఊగడాలు అమ్మాయిలలో  గట్లుతెంచుకుని పారే  ఉత్సాహాల, ఆనందాల పరవళ్ళు అట్లతద్ది రోజు ప్రత్యేకతలు.

ఈ అట్లతద్ది పండుగనాడు చేతులనిండా గాజులు వేసుకుని, నోటినిండా తాంబూలం పండించుకుని, చేతుల్లో గోరింటాకు పండించుకుని మసక వెన్నెల్లో ఆడపిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటారు. ఇప్పుడు ఎవరికీ తెలియకపోయినా టీవీలు మన గృహసామ్రాజ్యాల్లోకి, సీరియళ్ళు మన గృహరాణుల మనసుల్లోకి ప్రవేశించకముందు కాలం వరకు చాలా మందికి తెలిసిన ఆటలే  ఈ ఆటలు.

ఆరుద్ర -  బొబ్బిలి యుద్ధం సినిమాకి రాసిన పాటలో ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా అంటూ రాజకుమార్తెతో పాటు అమ్మాయిలందరూ కలిసి ఆడుకునే సందర్భాన్ని వర్ణించారు. ఆ పాట ఈ అట్లతద్ది పండుగనాడు తలుచుకోవడం బావుంటుంది కదా.

చెమ్మచెక్క చారెడేసి మొగ్గ
అట్లు పొయ్యంగా ఆరగించంగా
ముత్యాల చెమ్మెచెక్క ముగ్గులెయ్యంగా
రతనాల చెమ్మచెక్క రంగులెయ్యంగా
..సుబ్బా రాయుడు పెళ్ళి చూసివద్దాం రండి
మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి

ఇది అట్లతద్ది నాడు ఆడపిల్లలంతా చేరి  మసక  వెన్నెల్లో ఒకరి ఎదురుగా ఒకరు నిలుచొని అరచేతులు ఎత్తి ఇద్దరి చేతులు తాకిస్తూ చప్పట్లు కొడుతూ, చేతులు వెనక్కి తీసుకుంటూ ఆడుకుంటూ పాడుకునే పాట.
ఈ పాటలోని ముత్యాల చెమ్మచెక్క , రతనాల చెమ్మచెక్క పదాలతో తన పాట పల్లవిని ప్రారంభించారు ఆరుద్ర. ఓచెలి మురిపెముగా ఆడుదమా అంటూ ఒకరిని ఒకరు ఆడుకోవడానికి పిలుస్తూ  చెమ్మచెక్కఆడుకుంటూ పాడతారు అమ్మాయిలు. పల్లవిలో తరువాతి మాటల్లో 

తళ తళ తళతళ మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసూఅంటూ  సంపంగిలా పరిమళించే అమ్మాయిల మంచి మనసులను, తళ తళ మెరిసే బాహ్య శరీరాల సొగసును చూపిస్తారు ఆరుద్ర.
పరువము వేసిన పందిరిలో బుజబుజ రేకులు పూయవలే “-
అందరూ పెళ్ళి వయసుకి వచ్చి భర్తకోసం చేసుకునే నోము కాబట్టి ఆటల్లో పాటల్లో ఆ పరువపు ఉత్సాహం తొంగి చూస్తుంటుంది. బుజబుజరేకులు, బుజ్జారేకులు అంటూ పాడుకునే పెళ్ళి పాట ఉంది జానపద సాహిత్యంలో. బుజబుజరేకుల పిల్లుందా బుజ్జారేకుల పిల్లుందా అంటూ ప్రారంభమవుతుంది ఆ పాట. ఈ పాటలో కూడా పెళ్ళి పందిరి, పెళ్ళికూతురును తలపిస్తూ ఆ బుజబుజరేకుల పెళ్ళికూతుళ్ళని గురించి చెప్పడానికి ఈ మాటలు వాడారు ఆరుద్ర.
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ -
కల కలమని ఉత్సాహంగా, కిలకిల మని సంతోషంగా నవ్వుతూ చేతులకి నిండుగా వేసుకున్న గాజుల చప్పుడు గల గలమని శ్రవణపేయంగా వినిపిస్తూ ఉండగా ఆ కన్నెపిల్లలు ఎంత ఉత్సాహంగా ఒప్పుల కుప్పలు ఆడుకుంటున్నారో చెప్పడానికి ఈ కలకల, కిలకిల, గలగల అనే జంటపదాలు చక్కగా వాడుకున్నారు.

ఆడపిల్లలందరూ చేరి ఆడుకునే పాటల్లో చాలా ప్రముఖమైన పాట ఒప్పులకుప్ప. ఒప్పులకుప్ప ఒయ్యారి భామ అంటూ పాడుతూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. చూసినవాళ్ళకి కళ్ళు తిరిగేంత వేగంతో ఆ ఆటకి పాటని కూడా ఇక్కడ రాసారు ఆరుద్ర.

ఒప్పులకుప్ప ఒయ్యారి భామ
సన్నబియ్యం చాయపప్పు
చిన్నమువ్వ సన్నగాజు
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు నీ మొగుడెవడు...

అట్లతద్ది పండుగలో ప్రధానమైనది గౌరీదేవి నోము. శివుడిని పతిగా కోరి గౌరీదేవి చేసిన నోము కనుక ఆడ పిల్లలు చక్కని భర్త కావాలని ఈ నోముని నోచుకుంటారు . ఈ ఒప్పుల కుప్ప పాటలో రాబోయే భర్త ఎలా ఉంటాడు అని ఊహించుకుంటూ ఒకరినొకరు వేళాకోళం చేసుకుంటూ పాడుకుంటారు.
అట్లతద్ది పండుగలో  11 కి ప్రాధాన్యం ఉంటుంది. 11 రకాల పళ్ళు తినాలి, 11సార్లు ఉయ్యాల ఊగాలి, 11 సార్లు తాంబూలం వేసుకోవాలి ఇలా. ఈ విషయాన్ని వర్ణిస్తూనే పాటలో -

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు 
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు 
అనే చరణంలో ఆ తాంబూల సేవనాన్నే వర్ణించారు.  జవ్వాది మంచి సుగంధ  ద్రవ్యం. తాంబూలం లో దాన్ని  చేర్చుకుని సేవిస్తే మరి ఎంత సువాసనో చెప్పాలా......చెప్పడం కోసమే ఆ ఘుమ ఘుమ ఘుమ అన్ని సార్లు అనడం. చెమ్మచెక్క చారెడేసి మొగ్గ పాటలోని చారెడేసి మొగ్గలని ఇక్కడ అమ్మాయిల గులాబీ బుగ్గల లోని మెరుపును, తాంబూలం వల్ల ఘుమ ఘుమ లాడుతున్న జవ్వాది  పరిమళాన్ని  చెప్పడానికి వాడారు.

ఈ ఒప్పుల కుప్ప పాట తర్వాత ఆరుద్ర మరో రెండు మాటలు వేసారు.
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె. 

అదే..ఈ ఆటలకి నోములకి ఆశించే పరమార్థం. ఓచెలి మురిపముగా ఆడుదమా అంటూ ఒప్పులకుప్పలు, చెమ్మచెక్కలు ఆడుకుంటూ ఆడపిల్లలు కనులవిందు చేసే దృశ్యాన్ని తన పాటతో  మనసు  తెరమీద అందంగా ఆవిష్కరించారు  ఆరుద్ర. చక్కని జానపద గేయాన్ని సంపంగి, గులాబీ, జవ్వాది పరిమళాలతో గుబాళించే పదాలతో మరింత ఇంపుగా తీర్చారు.


పాట రచన ఆరుద్ర (భాగవతుల శంకర శాస్త్రి)
సినిమా     బొబ్బిలియుద్ధం
గానం       సుశీల బృందం
సంగీతం    సాలూరు రాజేశ్వరరావు





Thursday, October 10, 2013

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!


ఓ తరానికి ఈ పాట అంటే మహా ఇష్టం. తెలుగు సినిమాలలో హాస్యం అంటే రేలంగే, రేలంగి అంటేనే హాస్యం. రేలంగిగారిమీద చిత్రించబడిన పాటల్లో ఇది ఒకటి.  రేలంగికి చాలామంది జంటగా నటించినా గిరిజతో నటించిన చిత్రాలు, పాటలు చాలా హిట్ అయ్యాయి. ప్రజలు ఆదరించిన జంట రేలంగి -గిరిజ. వారిద్దరి మీద చిత్రించబడిన గీతం ఇది.
ఈ పాట చిత్రీకరణ ఆరోజుల్లో ఎప్పుడూ ఉండేలా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టో, పార్కుల్లో డాన్సు చేస్తున్నట్టో కాకుండా ఒక జూపార్క్ లో చిత్రించబడడం విశేషం.
అమ్మాయి పల్లెటూరు అమ్మాయి. మంచి కట్టుబాట్ల మధ్య పెరిగింది. కొద్దిగా మోటుతనం, అమాయకత్వం నిండిన పడుచు. తండ్రి పల్లెటూరువాడైనా డబ్బు బాగా ఉంది కనుక కూతురుకి కొంచెం నాగీరకం నేర్పించి నాజూగ్గా కనిపించేలా  చెయ్యాలని, విదేశాలలో ఉండే డాక్టరుకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని కోరిక. అలాంటి అమ్మాయి పట్నవాసంలో పరిచయమయ్యాడు ఈ కుర్రవాడు. పట్నం చూపిస్తానంటూ ఇంటినుంచి బయటకి తీసుకువచ్చాడు. అదీ పాటకి సందర్భం.
 అబ్బాయి ఆ అమ్మాయికి వరసకి మామయ్య కాబట్టి -
 "ఓహోహో మామయ్యా ఇదేమయ్యా బలె బలెబాగా ఉందయ్యా.
ఇంటిని విడిచి షికారు కొస్తే ఎంతో హాయి కలదయ్యా...."
అంటూ తనకి  తండ్రి కట్టుబాట్ల మధ్యనుంచి దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఇంటిని విడిచి వచ్చి షికార్లు కొడుతున్నందుకు సంతోషం ప్రకటిస్తుంది.
అమ్మాయిని సంబోధిస్తూ ఆ మామయ్య తాము వచ్చిన చోటు గురించి చెప్తాడు.
"ఓహొహో అమ్మాయి ఇది కాలేజీ బలె బలె బతికిన కాలేజీ
మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠ చెబుతాయి"
అంటూ తాము జూ పార్క్ అని పిలవబడే జంతు ప్రదర్శనశాలకి వచ్చామని చెప్తాడు. జూలో బంధించబడిన జంతువులనుంచి మనం తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నాయంటూ, "మాటలు రాని మృగాలు సైతం మనిషికి పాఠం చెబుతాయి "అంటాడు.

ఇక్కడ జూ పార్కుని బతికిన కాలేజీ అనే పదంతో ప్రయోగించడమే సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ళపాటు ఆంధ్ర ప్రాంతాలలో  చాలామంది మద్రాసులోని జూని బతికిన కాలేజీ అని, మ్యూజియం ని చచ్చిన కాలేజీ అని పిలిచేవారు
పాలగుమ్మి పద్మరాజుగారు మొదటిగా  తన రచనలలో  మద్రాసు జూపార్కు గురించి రాస్తూ బతికిన కాలేజీ అనే పద ప్రయోగం చేసారని తెలిసింది. ఆ ప్రభావంతోనేమో ఆరుద్రగారు కూడా ఈ పాటలో జూపార్క్ ని బతికిన కాలేజీ అని సంబోధించారు. ఇది చాలా పాపులర్ అయింది కూడా. మద్రాసులో చూడదగిన స్థలాల జాబితాలో  బతికిన కాలేజీ, చచ్చినకాలేజీ అని చెప్పుకోవడం చాలామందికి తెలుసు.

పులి, సింహం వంటివి క్రూర జంతువులు. సాధుజంతువులను, మనుషులను వేటాడి భుజించే స్వభావం కలిగినవి. అవి అడవిలో నివసిస్తాయి. కానీ మనుషులు ఈవిధంగా వాటిని బోనుల్లో బంధించి ఉంచడం ఆ అమ్మాయికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే-
"పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగితే ప్రమాదమే"
 అంటూ అందుకే వాటిని ఇలా జూలో బంధించారా? అని అడుగుతుంది. అందుకు ఆ మామయ్య ఇలా అంటాడు.

"కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు"
 అంటూ మనుషుల్లో ఉండే క్రూర స్వబావం జంతువుల క్రౌర్యాన్ని మించిపోయిందని చెప్తాడు.  అంతే కాక క్రౌర్యం పెరిగిన మనిషిని, మృగాన్ని కటకటాలలో పెడతారు అంటూ మనుషులలో క్రూర స్వభావం ఉన్నవారు చివరకు జైలు శిక్ష అనుభవిస్తారని ఓ మంచి నీతి పాఠం చెప్తాడు. జూలో జంతువులయినా, మనుషులలో నేరస్వభావం ప్రదర్శించిన వారైనా వారి నివాసం కటకటాల గదుల్లోనే అనే విషయాన్ని ఆరుద్ర ఎంతో చక్కగా చెప్పారు.

"గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రాది"
 అంటూ జూపార్క్ లోని జీబ్రా  అనే జంతువును చూపించి దాని లక్షణాన్ని ఆమెకి వివరిస్తాడు మామయ్య.  జీబ్రా చూడడానికి గాడిదలాగా ఉంటుంది. ఒళ్ళంతా నలుపురంగు నిలువు చారలుంటాయి. ఈ జీబ్రాపేరు లాటిన్ లో అడవిగుర్రం అనే అర్థంతో ఉండే పదం. అందుకే ఆరుద్రగారు జీబ్రాని అమ్మాయికి పరిచయం చేస్తూ గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రా అంటూ ఆమె ఎప్పుడూ చూడని జీబ్రాని చూపించాడు.
జిరాఫీ ని చూపిస్తూ

"చుక్కల జిరాఫీ ఒంటెకు బంధువు" అని చెప్పాడు. ఒంటె చాలా ఎత్తుగా బాగా సాగిన మెడతో ఉంటుంది. అందుకే చూడడానికి ఒంటెలా ఉండే ఆఫ్రికన్ జంతువు జిరాఫీ లేత పసుపురంగులో చుక్కలు నిండిన చర్మంతో బాగా ఎత్తుగా, పెద్ద తల మెడతో ఉంటుంది అందుకని దాన్ని ఒంటె కి బంధువు అంటూ వివరించాడు.
ఆ పక్కనే కోతి జాతికి చెందిన చింపాంజీలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ జిరాఫీ ఒంటెకి బంధువయితే "మనిషికి బంధువు  ఈ చింపాంజీ" అని పరిచయం చేసాడు. మనిషి  ఈ రూపంలోకి రావడానికి ముందు కోతి ఆకారంలో ఉండే జంతువునుంచి పరిణమించాడని డార్విన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతం. అందుకే ఎంతో కాలంనుంచి  మనమంతా "కోతి నుంచి పుట్టాడు మానవుడు" అంటూ నమ్ముతున్నాం.

ఆరుద్రగారు కూడా దీన్నే దృష్టిలో పెట్టుకుని మనిషికి బంధువు చింపంజీ అంటూ ఆ అమ్మాయికి చూపించారు. కోతులను దగ్గరగా గమనిస్తే అవి మనుషులను ఎంత చక్కగా అనుకరించగలవో చూడగలం. అందుకే
"మనుషుల చేష్టలు కోతులవైతే - కోతి చేష్టలు కొందరివి"
 అంటూ కోతులు జంతువులు కనుక  జంతు స్వభావంతో మనుషులను అనుకరించడం లాంటివి చేస్తాయి. కానీ మనుషులు కోతి కన్నా అభివృద్ధి చెందిన జీవులు. మెదడు పెరిగింది. అయినా కొందరు తను మనిషిని అన్నమాట మరిచిపోయి కోతుల్లా ప్రవర్తించడం గురించి ఇలా అన్నారు ఆరుద్ర. కోతి వేషాలు అంటూ ఆకతాయిగా ఉండే మనుషులగురించి మనం అనుకుంటూ ఉంటాం. దానిగురించే  ఆరుద్ర ఇక్కడ చక్కగా విడమర్చి చెప్పి చీవాట్లు పెట్టారు.
"తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది"
 అంటూ అమ్మాయి మామయ్యని ఓ జంతువును చూపించి అడిగింది.

"ఏనుగు వంటిది నీటిగుర్రము దానికి తమ్ముడు ఖడ్గమృగం " అని చెప్పాడు మామయ్య. ఏనుగు లాగా పెద్ద శరీరంతో నోరు ను బాగా తెరుస్తూ ఉన్న ఆ జంతువు ఏనుగులాగా పెద్దగా ఉన్నా దాని పేరు నీటిగుర్రము అని చెప్పాడు మామయ్య. అంతే కాక ఆ పక్కనే ఉన్న మరో జంతువు ఉంది. అది కూడా ఏనుగు లాగే భారీ శరీరంతో తిరుగుతోంది. దాన్ని చూపిస్తూ నీటిగుర్రంలాగే అది కూడా పెద్ద శరీరంతో ఉందని దాని పేరు ఖడ్గ మృగం అని చెప్పాడు.

ఇక్కడ మనుషుల స్వభావం మీద మరో చురకవేసారు ఆరుద్ర.
"అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకూ అలమే తింటాయి" అంటూ.
నీటిగుర్రం, ఖడ్గమృగం రెండూ ఏనుగు లాగా అతి భారీ శరీరాలున్న జంతువులే కానీ అవి కేవలం ఆకూ అలములు తిని బతికే శాకాహార జంతువులు. మనుషుల్లో అధికులు అంటే సంపన్నులు పేదవారిని దోచుకుని తింటూ వారి రక్తమాంసాలను కష్టం రూపంలో దోచుకుని తమ సంపదను పెంచుకుంటారు. నీటిగుర్రం, ఖడ్గమృగం ఆకారంలో అధికమే అయినా అవి సాత్వికమైనవే అని చెప్తూ మనిషిలోని దుర్గుణాన్ని ఎత్తిచూపించారు.

జూ పార్క్ లో సందర్శకులు ఏనుగుపైన ఎక్కి ఒకసారి విహరించడానికి అవకాశం కల్పిస్తారు జూ వారు. ఆ మామయ్య, అమ్మాయి అలా ఆ జూలో ఏనుగును ఎక్కారు. ఏనుగుఅంబారీ ఎక్కడం అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు కదా. పాతకాలంలో రాజులు, చాలా గొప్పవారు మాత్రమే ఏనుగును ఎక్కగలిగేవారు. అందుకే అమ్మాయికి పట్టలేని సంతోషం కలిగింది.కానీ " రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా" అంటూ రాజులు ఎక్కే అంబారీపైన సామాన్యులమైన తమలాంటి వారు ఎక్కి తిరగడం తప్పేమో అనే అమాయకపు ఆలోచనతో మామయ్యని అడిగింది.


మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఒకప్పుడు మాహారాజులు పరిపాలించిన ప్రాంతాలన్నిటా రాజరికం పోయి  ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులతో నడిచే ప్రభుత్వాలు వచ్చాయి. అదే ప్రజా స్వామ్యం.  అందుకే ఆరుద్ర  ఇక్కడ-
" రాజులు పోయి రోజులు మారి ప్రజలే ప్రభువులు ఈనాడు "
అంటూ భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాన్ని  మామయ్యతో చెప్పించి అమ్మాయికి పరిచయం చేసారు.
ఒహొహో మామయ్యా ఇదేమయ్యా అంటూ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు, ఒహొహో అమ్మాయి అంటూ ప్రతి సంబోధనతో మామయ్యతో జవాబులు చెప్పించిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సరదా పాటల్లో మేటిగా నిలిచింది.

పాట రచన   ఆరుద్ర(భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)
చిత్రం          ఆరాధన
గానం         ఘంటసాల , పి. సుశీల
అభినయం   గిరిజ, రేలంగి

Sunday, October 6, 2013

అందాల రాముడు - ఆరుద్ర గీతం

ఆరుద్ర ప్రవృత్తి రీత్యా కమ్యూన్-ఇష్టు.అయినా సినీకవిత్వం వృత్తీ ప్రవృత్తీ కూడా అయిన వేళ ఎన్నో భక్తి పాటలు రాసారు. వాటిలో ఎన్నో పాటలు సూపర్ హిట్లు అయ్యాయి. చాలా పాటలలో రాముడే ప్రధానంగా కనిపిస్తాడు. రామాయణాన్ని ఔపోసన పడితే తప్ప తెలియని రామాయణ లోని రహస్యాలు ఆరుద్రకెరుక. ఈవిషయం ఆయన సాహిత్యమే నిరూపిస్తుంది. రామాయణానికి సంబంధించి సినిమాలలో ఏ ఘట్టానికి రాయవలసి వచ్చినా, ఏ పాత్రని తీర్చవలసి వచ్చినా ఆ సాహిత్యం ఆరుద్ర పాండిత్యానికి నిలువెత్తు అద్దం పడుతుంది. సినీమా పాటలో పల్లవి, రెండు చరణాలు వెరసి మూడు నిముషాల్లో విషయాన్ని కుదించి రాయాలి. అందుకు ఎంతో సమర్థత కావాలి. ఆరుద్రకి అది మెండుగా ఉందని ఆయన పాటలే నిరూపిస్తాయి.
వాటిలో ఒకటి -

 "అందాల రాముడు ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ధి సోముడు,  ఎందువలన దేవుడు?"

తరతరాలుగా భారతజాతి శ్రీరాముడిని ఆదర్శ దైవంగా కొలుస్తోంది. భూమిపైన స్వర్గాన్ని తలపించే రామరాజ్యాన్ని స్థాపించిన వాడిగా, ఎన్నో ఆదర్శాలను ఆచరించి ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన గొప్ప రాజు శ్రీరాముడు. మరి ఆ రాముడినే ఎందుకు దేవుడిగా కొలవాలి అనే ప్రశ్న ఎవరికైనా వస్తే , వేస్తే దానికి జవాబు ఇదిగో ఇలా చెప్పొచ్చని చెప్పారన్నమాట ఆరుద్ర. రామాయణం మొత్తం సారాంశంగా రాముడి జీవితాన్ని రెండు చిన్న చరణాలలో  చెప్తూ
చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా సాగుతుంది ఈ పాట.

రాముడు అందమైనవాడు.  నల్లకలువ వంటి  మేని రంగు ఉన్నవాడు. సూర్య వంశస్థుడు
సూర్యవంశం  అనే గొప్ప సాగరంలో ఉదయించిన చంద్రుడిలాంటి చూడచక్కనివాడు. ఈ విషయాలను చెపుతుంది పల్లవి.  అటువంటి అందాలున్నవాడు, గొప్ప వంశంవాడు – రాముడు.  అయితే సరే... కానీ ఎందువలన దేవుడు అయ్యాడు అనే ప్రశ్న వేసారు పల్లవి చివర.

ఇక ఆ ప్రశ్నకి జవాబు తొలి చరణం. తండ్రిమాటకై పదవుల త్యాగమే జేసెనూ, తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెనూ ... దశరథుడు కైకకి ఇచ్చిన వరాలవల్ల మర్నాడు పట్టాభిషేకం పొంది చక్రవర్తిగా పదవి పొందవలసినవాడు, తండ్రిమాట నిలబెట్టడానికి తన పదవికి త్యాగం చేయడానికి సంతోషంగా సిద్ధపడ్డాడు. తండ్రి మాటకై - అనే మాటను గమనించాలి. తాను తండ్రికి మాట ఇవ్వడం కాదు. తండ్రి తన ముద్దులభార్య కైకాదేవికి వరంగా ఇచ్చిన మాట అది.  దాన్ని నిలబెట్టడం కొడుకుగా తన ధర్మం అనుకున్నాడు. అందుకే సంతోషంగానే అడవికి వెళ్ళాడు.
తను తప్పుకుంటే తమ్ముడు భరతుడు సింహాసనం ఎక్కి ఉన్నత స్థానం పొందుతాడు. అందుకే వనవాసం అనేది ఎంత బాధ కలిగించేదో తెలిసినా ఆ బాధని అనుభవించడానికే సిద్ధ పడ్డాడు. అందాల రాముడు అందువలన దేవుడు అంటూ ఆ చరణం ముగుస్తుంది.

రెండవ చరణంలో మళ్ళీ ఎందువలన దేవుడో మరోసారి చెప్పారు. అనుభవించదగిన వయసు అడవిపాలు చేసెను, అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను - అందాల రాముడు అందువలన దేవుడు. సన్యాసం తీసుకునే వయసులో అడవికి పొమ్మంటే పోవడం గొప్పేం కాదు కదా...మంచి వయసులో ఉండి రాజ్యం, పదవి, భోగభాగ్యాలు అనుభవించవలసిన వయసులో అడవికి పోవలసి వచ్చినా సంతోషంగా వెళ్ళాడు రాముడు. ఊరికే వనవాసం చేయడం కాదు, తాను అడుగుపెట్టినంత మేరా ఎక్కడా అసురులవల్ల మంచివారికి, పుణ్యమూర్తులకి ఇబ్బంది కలగకుండా ఆ భూమినంతా ఆర్యభూమిగా మార్చేసాడు తన రామబాణంతో. అందువలన రాముడే గొప్ప దేవుడు మరి. అందాల రాముడు అందువలన దేవుడు అంటూ ముగుస్తుంది ఈ చరణం.

మూడో చరణంలో-“ధర్మపత్ని చెరమాపగ దనుజుని దునుమాడెను, ధర్మము కాపాడుటకాసతినే విడనాడెనూ...అందాల రాముడు అందువలన దేవుడు!! అదే ....అదే రాముడి గొప్పదనం. ధర్మపత్ని అయిన సీతను కాపాడడం పతిగా తన ధర్మం. తన భార్యను తననుండి దూరం చేసి చెరపట్టినందుకు  ఆమెను కాపాడడం కోసం దనుజుడైన రావణాసురుడిని దునిమాడు (చంపాడు). కానీ తను భర్తమాత్రమే కాక రాజ్యానికి భర్తగా ధర్మ రక్షణ కోసం ఆ సతిని విడనాడాడు. సీతా పరిత్యాగం చేసాడు. రెండే రెండు వాక్యాలలో రామ ధర్మాన్ని వివరించారు ఆరుద్ర.

అందుకే అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాబ్ది  సోముడు - ఇలలో మన దేవుడు అంటూ పాట ముగుస్తుంది. పదే పదే రాముడిని అందాల రాముడు అంటూ ఈ పాటలో సంబోధించడంలో రాముడి బాహ్య సౌందర్యం మాత్రమే కాక అతను పాటించిన గొప్ప మానవ ధర్మాల వల్ల అతనిలోని అంతఃసౌందర్యాన్ని కవి గుర్తించారనిపిస్తుంది. అందానికి, సుగుణ శీలానికి రాజు మన రాముడు. రాముడి గురించి అతి చక్కని పాటని ఆరుద్రనుంచి అందుకున్న మనం ధన్యులం.

 ఆరుద్ర  ఈపాటలో   ఎన్నో సంస్కృత సమాసాలు, తెలుగు పదాలు కలగలిసిపోయి ఉంటాయి. అన్నిటికీ అర్థాలు తెలుసుకుంటే మనకి బోల్డు తెలుగు కూడా వస్తుంది.

ఇందీవరము అంటే నల్లకలువ పూవు. శ్యాముడు అంటే అటువంటి శరీరం రంగు
ఇనకులము అంటే సూర్య వంశం.అబ్ధి అంటే సముద్రం. సోముడు అంటే చంద్రుడు. వెరసి ఇనకులాబ్దిసోముడు అనే సమాసరూపంలో  సూర్యవంశం  అనే సముద్రంలో ఉదయించిన చందమామ – అంతటి అందమైనవాడు శ్రీరాముడు.  అడవిపాలు చేయడం, చెరబాపడం,  దునుమాడడం వంటివి చక్కని తెలుగు పదాలు.
చిత్రం: ఉయ్యాల - జంపాల (1965)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: సుశీల

పల్లవి:
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
ఎందువలన దేవుడు
చరణం 1:
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను...ఊ..ఊ..
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు...
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
చరణం 2:
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను..ఊ...ఊ..
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను..
అందాల రాముడు అందువలన దేవుడు ...
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు

చరణం 3:
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను...ఊ..ఊ..
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మము కాపాడుటకాసతినే విడనాడెను...
అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... అందాల రాముడు
ఇందీవర శ్యాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు


Monday, May 6, 2013

పిండితార్థం





చదువుకునే రోజుల్లో తరచు పిండితార్థం అనే మాట వినేవాళ్ళం. సారాంశం అని అర్థం. పిండితే వచ్చే అర్థం కాబోలు - అని సరదాగా అనుకునేవాళ్ళం. కావ్యాలలో కవులు వారు ఏం ఊహించి ఏం రాసేవారో కానీ ఒక్కోసారి ఈ విమర్శకులు చెప్పే అర్థం చూస్తుంటే ఇది పిండితార్థమేమో అనిపిస్తూ ఉండేది. అంటే కవులు వేరే ఉద్దేశంతోనో లేదా యథాలాపంగానో  చెప్తే విమర్శకాగ్రేసరులు వారికి కావలసినట్టు దాన్ని పిండుకుంటారని.

సినిమాల్లో దర్శకులు చేసిన షాట్స్ లో ఒక్కోసారి వారి ప్రమేయం లేకుండా కనిపించే షాట్లను సినీ అభిమానులు దర్శకుడి ప్రతిభగా పొరబాటు పడడం కూడా కద్దు.  ఇలాంటి డిపి ల (దర్శకత్వ ప్రతిభ) గురించి  కోతికొమ్మొచ్చి లో మన ముళ్ళపూడిగారు బాగా వివరించారు.
అలాంటి  ఓ తమాషా కథ ఇది.

ఓ రెండువందలేళ్ళక్రితం అనుకోండి. ఇటలీలో ఓ పోప్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారుట. దేశంలోని ఓ మైనారిటీ వర్గాన్ని(ఆ వర్గం పేరు ఇక్కడ నేను చెప్పను. ఎందుకంటే మనకు కథ ముఖ్యం కాబట్టి) దేశం వదిలిపెట్టి వెళ్ళాలని. సహజంగానే పెద్ద ఎత్తున వారంతా నిరసన వ్యక్తంచేసారు. పోప్ గారు ఓ ప్రతిపాదన తెచ్చారు.  ఆ మైనారిటీ వర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో తాను మతపరమైన చర్చ జరుపుతానని, ఆ చర్చలో ఒకవేళ మైనారిటీ వర్గం వారు జయిస్తే వారు ఇక దేశం వదిలి వెళ్ళనక్కరలేదని. ఒకవేళ పోప్ గారు గెలిస్తే వారు తప్పనిసరిగా దేశాన్ని వదిలి వెళ్ళనక్కరలేదని.
సరే మరి ఆ వర్గంవారికి వేరే దిక్కులేదు. కనీసం పోప్ గారి ఈ ప్రతిపాదనను ఉపయోగించుకోవాలని అనుకున్నారు. తమనుండి ఒక మధ్యవయసు వ్యక్తిని తమకు ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి పోప్ తో ఒక అంగీకారానికి వచ్చాడు. పోటీ జరుగుతున్నప్పుడు ఇటూ అటూ ఎవరూ ఒక్క మాటయినా మాట్లాడకూడదు. పోప్ అంగీకరించాడు.
మతచర్చ అనుకున్న సమయానికి ప్రారంభమైంది.
పోప్, ఆ వర్గ ప్రతినిధి ఎదురెదురుగా కూర్చున్నారు.
పోప్ గారు తన కుడి చెయ్యి ఎత్తి మూడు వేళ్ళు చూపించాడు.
ఆ ప్రతినిధి ఒక్కక్షణం ఆలోచించి తన చెయ్యి ఎత్తి ఒకవేలు చూపించాడు.
పోప్ గారు తన చేతివేళ్ళను తలచుట్టూ తిప్పాడు.
ఆ ప్రతినిధి తన   చేతి చూపుడువేలుని నేలవైపుకి చూపాడు.
పోప్ గారు తన బాగ్ లోంచి ఓ వేఫర్ ని, వైన్ గ్లాస్ ని తీసి బల్లమీద పెట్టాడు.
ప్రతినిధి సాలోచనగా చూసి తన బేగ్ లోంచి ఓ ఆపిల్ ని తీసి బల్లమీద పెట్టాడు.
పోప్ ఆశ్చర్యపోయాడు. లేచినిలబడ్డాడు.
ఇతను చాలా మేధావి.  నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. వారంతా ఈ దేశంలోనే ఉండవచ్చు
అని ప్రకటించాడు.
చుట్టూ ఉన్నవారికి చాలా విస్మయం కలిగింది. ఏం జరిగిందో సరిగ్గా అర్థం కాలేదు.
ఓ గంట గడిచాక మెల్లగా భక్తులందరూ పోప్ చుట్టూ చేరారు.
ఏం జరిగిందని అడిగారు. పోప్ అన్నాడు కదా.,.....
నేను మన హోలీ ట్రినిటీ గురించి చెప్తూ మూడు వేళ్ళు చూపించాను. అతను మన రెండు మతాలు వేరు వేరు అయినా ఇద్దరికీ దేవుడు ఒకడే కదా అని ఒకవేలు చూపించాడు.
నేను నా చేతిని తిప్పుతూ దేవుడు మనచుట్టూ ఉన్నాడని చూపించాను. అతను నేలని చూపుతూ దేవుడు ఇక్కడే మన మధ్యనే ఉన్నాడని చెప్పాడు.
నేను వేఫర్ ని వైన్ ని చూపిస్తూ దేవుడు మననుండి మనం చేసిన పాపాలను పీల్చేస్తాడని సంకేత భాషలో చెప్పాను. అతను ఎంత మేధావి అంటే  అసలు పాపాలన్నిటికీ మూలం అని మనం చెప్పుకునే ఆపిల్ ని తీసి చూపించాడు. ఆహా.ఎంతగొప్పవాడు అంటూ ఆ ప్రతినిధిని మెచ్చుకున్నాడు.

సరే, నాణేనికి మరోవేపు
ఆ వర్గం అంతా మేధావిగా పోప్ తో కొనియాడబడ్డ ప్రతినిధి చుట్టూ మూగారు.
పోప్ గారు నిన్ను ఏం అడిగారు అని అడిగారు.
అతను ఇలా అన్నాడు.
మొదట పోప్ గారు తన మూడు వేళ్ళు చూపించి మూడ్రోజుల్లో మీరు దేశం వదిలి పోవాలన్నారు.
నేను ఒకవేలు చూపించి ఒక్కడు కూడా ఇక్కడ్నుంచి కదలం అని చెప్పాను.
తర్వాత పోప్ గారు తన చేతిని తన తలచుట్టూ తిప్పి మీ అందరి తలలు తీయిస్తాను అన్నాడు.
నేను ఎట్టిపరిస్థితుల్లోనూ మేం ఇక్కడ్నుంచి కదిలేది లేదు అని నేలని చూపించి బాగా అర్థమయ్యేలా చెప్పాను.
ఆశ్చర్యపోయిన ఆ జనం అంతా ఆ తర్వాత?” అని అడిగారు.
తర్వాత....తర్వాత ఏముందీ...అతను తన లంచ్ తీసి టేబిల్ మీద పెట్టాడు. నేను నా లంచ్ తీసి అక్కడ పెట్టుకున్నాను. అంతే”  అని ముగించాడు.


అదండీ కథ. పిండితార్థం అంటే అది...పిండుకున్నవారికి పిండుకున్నంత.