Monday, July 4, 2011

జీవితం స్వప్నసాగరతీరం...సాగనీ పయనం !!


జీవితం కొందరికి స్వప్నాల సాగరం!
మరికొందరికి దుఃఖకాసారం!
ఇంకొందరికి సుఖదుఃఖాల సమ్మేళనం!!
ఏదేమయినా మనిషి జీవితం నిరంతర ప్రయాణం.
భూత వర్తమాన కాలాల్లోంచి భవిష్యత్తుకి సాగే జీవన మార్గం లో మానవ జీవితం నడక,  ఎప్పుడూ నల్లేరుమీద బండి నడక కాదు. మిట్టపల్లాలు తట్టుకుంటూ సాగవలసిఉంటుంది. గడిచిన దారి కన్నా, ముందు దారిఎలా ఉంటుందోనన్న ఆసక్తే మనిషి లో జీవలక్షణాన్ని చూపే అంశం.
మనిషి ఎప్పుడూ భవిష్యత్తులోకి ఆసక్తిగా తొంగిచూస్తూ ఉంటాడు. ఉన్న స్థితినుంచి ఉన్నతమైన స్థితిలోకి పరివర్తన చెందడానికి అవకాశాలకోసం అన్వేషిస్తూ ఉంటాడు. పరిస్థితులు తన చేతులు దాటిపోతున్నాయనే అనుమానం వస్తే మాత్రం అశక్తతతో క్రుంగి పోతాడు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఏమాత్రం ఆసరా దొరికినా బయటకి రావడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి కష్టాలలో ఉండే మనిషి తనలో ఆశని ప్రోది చేసుకోవడానికి ఆశ్రయించేది దైవం. ఆ దైవానికి ప్రతినిధుల్లాగ దైవమార్గాన్ని ప్రవచించే సద్గురువులను చేరుకుంటాడు. వేదాంత ప్రవచనాలు వింటాడు. కర్తవ్యవిమూఢత్వంతో  చేష్టలుడిగిన మనిషి ఈ హితవచనాలతో, కర్తవ్యపాలనను బోధించే ప్రవచనాలతో మానసికస్థైర్యాన్ని కూడగట్టుకుంటాడు. ఒక కొత్త ఆశావహమైన దృక్పథంతో బ్రతుకు మార్గంలో ప్రయాణిస్తాడు.
అపజయం నుంచి జయం వైపు సాగించే ఈ ప్రయాణంలో తన కన్నా ముందు వెళ్ళిన వారి అనుభవాలను తెలుసుకోవడం, వారు అనుసరించిన విధానాలను తాను కూడా ఆచరణలో పెట్టడం అనేది కూడా మనిషికి  తన ఆశయసాధనలో విజయం వరించడానికి సహాయపడుతుంది. అయితే ఈ విధంగా మనం అనుభవంలోంచి పాఠాలు నేర్చుకోవడానికి సహాయపడే వ్యక్తులు మన సమాజంలో పెద్దపేరున్న పెద్దమనుషులే కానక్కరలేదు అని, మనకన్నా  ఎంతో వైవిధ్యమైన జీవలక్షణాలున్న సృష్టిలోని అతి చిన్న జీవులు కూడా కావచ్చని తెలుసుకున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
జిమ్ రాన్ అనే గొప్ప తత్వవేత్త  ప్రతిపాదించిన వేదాంతం ' చీమ వేదాంతం'.
వేదాంతం లాంటి గొప్పవిషయాన్ని చీమలాంటి అల్పప్రాణికి ముడిపెట్టడం వింతగా తోచే విషయం కావచ్చు. కానీ అతను, చీమ తన జీవనయానంలో అనుసరించే విధానాలను మానవ జీవితానికి అనువర్తింపచేస్తూ ఇచ్చిన ఉదాహరణలు చూస్తే మనం కూడా అవుననక తప్పదు. చీమకి ' జై ' కొట్టక తప్పదు.
మనం  జీవితంలో విజయం సాధించాలంటే చీమ తన జీవితంలో అనేక పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తోందో గమనించి అదే రకమైన జీవితవిధానాన్ని మనం కూడా అవలంబించాలి, అంటారు జిమ్ రాన్. అందుకు అతను చెప్పిన నాలుగు సూత్రాలు చూద్దాం.
మొదటి సూత్రం ఇది!
చీమలు ఆహారం కోసం ఎంతో దూరాలు ప్రయాణిస్తాయి. ఒకదాని వెనుక ఒకటి అలా నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా దాని దారికి ఏదేనా అడ్డం వస్తే అది ఏం చేస్తుందో గమనించారా....కావాలంటే చీమలు ప్రయాణిస్తున్న దారిలో మీ వేలు అడ్డు పెట్టి చూడండి. ఆ చీమ ఎలా ముందుకు వెళ్తుందో గమనించండి. వేలు చుట్టూ తిరుగుతుంది. ముందుకు సాగడానికి దారులు వెతుకుతుంది.కానీ అక్కడే  నిలబడి  హారి భగవంతుడా!! నేనేం చేసేదిరా!! నాకేం దారిరా అని  దిక్కులు మాత్రం చూడదు.అంతగా ముందుకు పోయే  దారి దొరకకపోతే వేలు మీదనుంచి వెళ్ళిపోతుంది...కానీ వెనుకకు మాత్రం వెళ్ళదు.
మనం నేర్చుకోవలసిన గొప్ప సూత్రం ఇది. జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, మరి ముందుకు పోలేమన్నంతగా వేపుకు తినే పరిస్థితులు.  ఇక ప్రయాణం ఆపడమే పరిష్కారమేమోనన్నంతగా దిగజారిన పరిస్థితులు. సరిగ్గా ఈ స్థితిలోనే మనకి చీమ ఆదర్శం అవుతుంది. చీమ తన లక్ష్యం చేరుకోవడం కోసం ముందుకు సాగడం కోసం ఎంతగా తపిస్తుందో మనం ఆదర్శంగా తీసుకోవాలి. విన్ స్టన్ చర్చిల్ నెవర్ ...నెవర్..నెవర్ గివ్ అప్  అని చెప్పినా... సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడూ.... ఒప్పుకోవద్దురా ఓటమీ అని పాట పాడినా దాని  సారాంశం ఇదే.
చీమ జీవితం లో మనం గమనించవలసిన మరో ముఖ్యాంశం - మనందరం చిన్నప్పుడు విన్న కధే. చీమ, మిడత కథ. వసంతకాలం వచ్చిందని మిడత చాలా సంతోషంతో ఆటపాటలతో కాలం అంతా గడిపేస్తుంది. చీమ ఆ కాలంలో కూడా కష్టపడి పనిచేసి ఆహారం కూడబెట్టుకుంటుంది. ఇక వానాకాలం వచ్చాక మిడతకి ఆహారం దొరకదు. చీమ మాత్రం తను వేసవిలో కష్టపడి కూడపెట్టిన ఆహారంతో ఆనందంగా గడుపుతుంది.
జీవితంలో  కాలం విలువ ని అవగాహన చేసుకోవడానికి చెప్పే కథ ఇది. అవకాశాలు ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలి.
చీమకి తెలుసు - వేసవి సుఖంగా ఉండే కాలమే అయినా అది ఎక్కువకాలం ఉండదని, దానివెనుకే వచ్చే వర్షాకాలం తనకి చాలా ఇబ్బందులు కలిగిస్తుందని.

సరిగ్గా మనిషి గుర్తుంచుకోవలసిన విషయం కూడా ఇదే. అంతా మంచి కాలం నడుస్తోంది అనుకున్నప్పుడు కూడా ఇది శాశ్వతం కాబోదు అన్న జ్ఞానంతో ఉండడం ఎంతో అవసరం. మెరుపు మెరిసినంతకాలం సంతోషం కలిగినా పిడుగుపాటు పడే అవకాశం కూడా ఉందని తెలుసుకోవడం ఆ హెచ్చరికతో గడపడం మనిషికి అవసరం.
చీమ  తన జీవనవిధానంతో మనిషికి చెప్పే మరో పాఠం ఇది.
అలాగే చీమ జీవితం నేర్పే మూడో పాఠం -  ఏ సమయమూ శాశ్వతం కాదు.
జీవితంలో కష్టసుఖాలు  ఒకదానివెనుకే ఒకటిగా మనతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కష్టకాలం ఎప్పుడూ ఉండదు. కొంతకాలం ఇది గడిచిపోగానే సుఖించేకాలం వస్తుంది. గడ్డకట్టించే చలికాలం ఎంతో కష్టం కలిగించినా చీమలు అదిరిపోవు బెదిరిపోవు. వెలుగురేకలు విచ్చుకోగానే తొలికిరణాలు భూమిని తాకగానే కర్తవ్యనిర్వహణకి  నడుం కడతాయి. బిరబిరా పుట్టలనుండి బయటపడతాయి. తమ బాధ్యతని ఎప్పుడూ విస్మరించవు.
మనిషి కూడా చీమనుంచి నేర్చుకోవలసిన జీవన సూత్రం ఇది.
కష్టాలు కారుమబ్బుల్లా కమ్ముకొచ్చినవేళ దిగాలుపడిన దసరా బుల్లోడులా మొహం వేలాడేయకూడదు. సుఖం శాశ్వతం కానట్టే కష్టం కూడా శాశ్వతం కాదు అని మర్చిపోకూడదు. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని వదులుకోకూడదు.  జరగబోయేది మంచి అని గట్టిగా నమ్మి ముందుకు సాగాలి.
కలకాలం ఉండవు ఈ కన్నీళ్ళూ, కలలైనా, కలతైనా కొన్నాళ్ళూ..అని కవి చెప్పనే చెప్పాడు కదా..
చీమ నుంచి నేర్చుకోవలసిన సూత్రాలలో ఆఖరిది అతి ముఖ్యమైనది అని రాన్ చెప్పిన సూత్రం చూస్తే ,  గీతోపదేశం  గుర్తురాక మానదు.
భగవద్గీతలో పరమాత్ముడు బోధించిన  గొప్పమాట...నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. దాని ఫలితాలను గురించి ఆలోచించకు.
చీమ ఆనాటి అర్జునుడిలా ఈ గీతోపదేశ వాక్యాన్ని పాలిస్తుందా అనిపిస్తుంది.
నేను ఇంత చిన్న  చీమని, ఎంత ఆహారాన్ని తేగలను, ఎంత బరువు మోయగలను, ఎంతదూరం వెళ్ళగలను, వెళ్ళినా తిరిగి వస్తానా, నేను తెచ్చినదాన్ని నేనే తింటున్నానా, ఇతర చీమలు ఏం చేస్తున్నాయి, ఎంత తెస్తున్నాయి, నేను తేకపోతే ఏం, కొంప మునిగిపోతుందా ఇలా ఎన్ని రకాల ప్రశ్నలు వేసుకొని పని మానుకొనే అవకాశం ఉందో చీమకి.
కానీ ఏ చీమా ఇలాంటి పనికిరాని ప్రశ్నలతో కాలం గడిపినట్టు మనం చూడం. చీమ ఆహార సేకరణ అనే జీవితాశయం కోసం నిరంతరం శ్రమిస్తుంది. ఎంతో దూరం వెళ్తుంది, తన  ఆకారానికి ఎంత పరిమాణం ఆహారాన్ని  మోయగలనో లేనో అని అది దొరికినదాన్ని  వదిలిపెట్టదు.  బలవంతంగా శక్తినంతటినీ ఒడ్డి ఆహారాన్ని తన నివాసం వైపు ఈడ్చుకుని వెళ్తుంది. అవసరమైతే తన తోటి వారిని సహాయం అడిగి మరి ఆ పని నిర్వర్తిస్తుంది. ఈ పనిలో చీమ తన బరువుకి కనీసం 20 రెట్లబరువు గల ఆహారాన్ని మోసుకొని పోతుందిట. తను చెయ్యగలనా లేదా అని మాత్రం సందేహిస్తూ కూర్చోదు.

 నీ శ్రమని, తెలివితేటలని, సమయాన్ని పెట్టుబడిగా పెట్టు. ఫలితాలు ఎలా ఉంటాయి అని సందేహించకు. మంచి శ్రమకి,మంచి ఆలోచనకి, నూరుశాతం గారంటీ దొరుకుతుందని నమ్మి త్రికరణశుద్ధిగా కర్తవ్యాన్ని ఆచరించు అని చీమ జీవితం మనకి సందేశాన్నిస్తుంది.
జాన్ రాన్ చెప్పినట్టు చీమ జీవితంలో మనం తీసుకోవలసిన నాలుగు అంశాలు క్లుప్తంగా ...
అవరోధాలను లెక్కచేయకపోవడం,  ముందుచూపుతో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే శక్తిని కలిగి ఉండడం, భవిష్యత్తు పట్ల ఆశావహమైన దృక్పథం వహించడం, చేయగలిగినంత, చేతనైనంత ప్రతిభతో కర్తవ్యపాలన చేయడం తద్వారా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని,  సుఖ సంతోషాలమయమైన జీవితం మన స్వంతమవుతుందని మనసారా నమ్మడం.
ఎంత చక్కగా ఉంది కదూ ఈ చీమ వేదాంతం...
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు అన్నారు వేటూరి.
 జీవితసత్యాన్ని ఆవిష్కరించే విషయంలో  చీమయినా సరే మనిషికి మహా గురువు అంటే తప్పేముంది !!

7 comments:

  1. చాలా బాగా చెప్పారు. చీమల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

    ReplyDelete
  2. జయగారు,
    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. కవిత్వానికి అగ్గిపుల్ల, కుక్కపిల్ల ఏది అన్ర్హమైనది కాదన్నట్టు .మనిషికి నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే అన్నిటి నుంచి నేర్చుకోవచ్చు .చీమ ఇంకో విషయం కూడా చేబుతుందండి నీ సైజు ఎంతైనా కావచ్చు కానీ ఎంత పెద్ద వాడినైనా కుట్టవచ్చు అని . బహుశా నేను ఇది చీమ నుండే నేర్చుకున్ననేమో

    ReplyDelete
  4. అవునా మురళిగారు, ఈ విషయం తెలిస్తే నాయకులు చీమలమీద నిషేధం ప్రకటిస్తారేమోనని అనుమానంగా ఉందండీ...మీరు వాళ్ళని ఇలా బాగా కుట్టడానికి కారణం అక్కడుందన్నమాట.

    ReplyDelete
  5. ఉన్నతమైన జీవన విధానమెప్పుడూ...
    అందుబాటులోనే ఉంటుందనేది...సత్యం.
    కానీ అదెందుకు మనకి అవగతం కాదు
    అంటే....అవసరంలేదని భావిస్తాం కనుక.
    అవసరమున్నవారికి అదెప్పుడు చేతికందే పండే..

    గురుత్వం అంటే బోధించడం కాదు...ఆచరించి చూపడం..
    ఈ గురు తత్వం విశ్వమంతటా వ్యాపించివున్నదనేది
    గుర్తుంచుకోవల్సిన సత్యం.
    గురు మధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురుః
    గురుర్విశ్వం నచాన్యోస్థి తస్మై శ్రీ గురువే నమః
    అనే శ్లోకం చెప్తున్నది అదే...
    భాగవత పురాణంలో వచ్చే అవధూతోపాఖ్యానం...లో
    అవధూత తన 24 మంది గురువుల ద్వారా సత్యాన్ని
    దర్శించానని చెప్తాడు...దాన్లో సాలెపురుగు,అజగరం(కొండచిలువ) కూడా
    ఉంటాయి.....వాటి జీవన విధానంలో మన ఆచరణకు ఉపయోగపడేవాటిని
    తీసుకుని పాటిస్తే....అదే గురుత్వం మనలోనూ ప్రకటితమవుతుంది.

    ReplyDelete
  6. బాగుంది...

    ReplyDelete
  7. అనానిమస్ గారు,
    గురుత్వం బోధించడం వలన కాక ఆచరించి చూపి ఆదర్శంగా నిలిచినప్పుడే సార్థకమవుతుందనే మంచి మాట మరోసారి చెప్పినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete