Monday, June 6, 2011

ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా


ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా

ఆత్రేయ గారు రాసిన గీతం -పోలీసు వెంకట సామి - పోలీసు శాఖలో పనిచేసేవ్యక్తి ప్రేమికుడైతే తన  ప్రియురాలికి చెప్పే ప్రేమ కబుర్లు ఎలా ఉంటాయో, ఎలాంటి భాష వాడతాడో చూసాం కదా.

ఆత్రేయగారికన్నా ముందే ఆరుద్ర గారు కూడా ఇలాంటి ప్రయోగం చేసారు 1959లో 'మా ఇంటి మహాలక్ష్మి' చిత్రం కోసం.

ఇప్పుడు ఒక కోర్టు లో ప్లీడరు గారి దగ్గర గుమాస్తా గా పనిచేసే వ్యక్తి తన ప్రియురాలితో ఎలా మాట్లడతాడని ఆరుద్ర గారు ఊహించి రాసారో చూద్దామా.

పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు

అమ్మాయి అంటే తనకి ఇష్టం ఉందని చెప్పడానికి దస్తావేజు రాసి ఇస్తానని  చెప్తున్నాడు. అంటే తన హృదయం అనే ఆస్తిని ఆమెకి సమర్పించుకుంటున్నానని చెప్పే పత్రం రాసి ఇస్తాడుట.

                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ
                

ఇక్కడ సదరు అనే మాట కోర్టు భాషలో ఎంతో సహజమైన పదం. ఎవరైతే, ఏదైతే అలా అని చెప్పవలసి వచ్చినప్పుడు
సదరు అనే పదం వాడుతుంటారు కోర్టు భాషలో.

నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
తీసుకున్నై డిక్రీని నాపై

అతను ఆ అమ్మాయిని ప్రేమించడం అన్న విషయం కేసయితే...అందులో అతని అభిప్రాయం అనే విషయంతో ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి హృదయం, మనసు అనేవి ఎక్స్ పార్టీలుగా ఉండి అతని మనసును డిక్రీ చేసాయిట. అంటే ఆమెను తన ప్రమేయంలేకుండానే తనకు తెలియకుండానే ప్రేమించేసాడన్నమాట.

మీను లాంటి నీ కన్నులు అమీనై
జామీను లేని నా మదిని జప్తు చేసినై...

అంతే కాదు..ఇక్కడ కోర్టు వ్యవహారాలలో  అమీను అనే ఉద్యోగి ఉంటాడు.

తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నప్పుడు ఆ  అప్పును  చెల్లించలేకపోతే తాకట్టు పెట్టిన వస్తువుల మీద అప్పు ఇచ్చిన వారికి అధికారం వస్తుంది. ఆ విధమైన అధికారాన్ని కోర్టు  అప్పు ఇచ్చిన వారికి దాఖలు    చేస్తుంది. కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను  అమలు చేసే ఉద్యోగి ...కోర్టు అమీను.

ఇక్కడ ఆ ప్రేమించిన అమ్మాయి కళ్ళు -  'మీనులాంటీ నీ కన్నులు  అమీనై ' అంటే చేపల్లా ఉన్న ఆమె  అందమైన కళ్ళు కోర్టు  అమీను రూపం దాల్చి  ఏ విధమైన హామీ  లేని అతని ఆస్తి  అయిన మనసును అంటే అతని మదిని జప్తు చేసాయిట.


చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
మనకి రాదూ ఏ లిటిగేషన్....


ఇక  ఆమెని తను ప్రేమించడం అన్నది జరిగిపోయింది కనుక ఇద్దరూ ఒక  అవగాహనకి రావడం అనే దశకి వచ్చినట్టే.
అదే సెటిల్మెంట్. 

 ఇద్దరు ప్రేమించుకున్నాక  వారిద్దరూ కలిసి ఉండడానికి కావలసిన బంధం వివాహ బంధం. అందువలన ఆ వివాహ బంధం ఏర్పరచుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. దాన్ని అగ్రిమెంట్  అనే పదంతో సూచిస్తున్నారు కవి.

అంతేకాదు ఆ వివాహ బంధం వలన పొందవలసిన సౌఖ్యం అనేది తమ హక్కు దానిని సాధించడానికి కూడా ఓ పిటీషన్ వేయాలని అనుకుంటున్నాడు.

పెళ్ళి జరిగాక ఇద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే  వారు సంతోషంగా కలిసి ఉంటే   ఎవరికీ ఏ సమస్యా రాదని భావిస్తున్నాడు.
 అందుకే  అలా కలిసి ఉండగలిగితే   మనకి రాదు ఏ లిటిగేషన్ అంటాడు.

ఒకే భాష మాట్లాడే వ్యవహర్తలలో కూడా వారి వర్గ,ప్రాంత, మాండలిక భేదాలను బట్టి భాష వ్యవహారంలో అనేకమయిన మార్పులు కనిపిస్తాయి. వీటితో పాటు  భాషని ప్రభావితం చేసే అంశాలలో గమనించదగిన అంశం వృత్తి. ఒకో విధమయిన వృత్తిలో ఉండేవారికి  ఆ వృత్తికి సంబంధించిన పదాలతో కొన్ని పలుకుబడులు ఏర్పడి ఉంటాయి.  వారి భాషా వ్యవహారంలో అత్యంత సహజంగా ఆ పలుకుబడి ఒదిగిపోయి ఉంటుంది.
ఎంతో సునిశితమైన దృష్టి ఉంటే తప్ప భాషలోని ఈ అంశాన్ని గ్రహించడం కష్టం.

సినిమాలలో పాత్ర వేష భాషలను దృష్టిలో పెట్టుకుని ఆయా పాత్రలకు తగిన చిత్త  ప్రవృత్తిని గమనిస్తూ,  సందర్భోచితంగా పాటలు రాయడం తేలికైన పని కాదు.

ఆరుద్ర గారు రాసిన ఈ పాట ఒక హాస్య నటునిపై చిత్రించిన పాటే అయినా   కోర్టు గుమాస్తా అయిన ఆ పాత్ర ప్రేమలో పడితే అతని భాష ఎలా ఉంటుందో ఊహించి రాసిన విధానం  పాటల రచయితగా ఆరుద్ర  గొప్పదనాన్ని మరోసారి నిరూపిస్తుంది.

పాట మొత్తం సాహిత్యం ఇక్కడ


పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు
                  
                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ                       నువ్వంటేనే నాకు మోజు

చరణం       నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
                 తీసుకున్నై డిక్రీని నాపై
               
                 మీను లాంటి నీ కన్నులు అమీనై
                 జామీను లేని నా మదిని జప్తు చేసినై.                  నువ్వంటేనే నాకు మోజు       
  
చరణం       చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
                 మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

                  సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
                  మనకి రాదూ ఏ లిటిగేషన్....                               నువ్వంటేనే నాకు మోజు

                 
పాట రచన      ఆరుద్ర
గాయకుడు     పిఠాపురం
చిత్రం             మా ఇంటి మహాలక్ష్మి

సంగీతం           అశ్వత్ధామ

ఈ పాటను వినాలనుకుంటే  ఇక్కడ వినవచ్చు.

Friday, May 6, 2011

ఆత్రేయ - పోలీసు వెంకట సామి

పోలీస్ వెంకటసామి...అదే..పోలీసెంకటసామి అనే పదం తెలుగు వాళ్ళు, తెలుగు పాటలు ఇష్టంగా వినే  చాలా మందికి తెలుసు...

మనదేశం సినిమా కోసం మొదట  సముద్రాల రాఘవాచార్యగారి కలంలో జాలువారి జిక్కి గొంతులో వినిపించిన పాట ఈ పోలీసెంకటసామి పాట. రేలంగి పాత్ర ఈ పోలీసెంకటసామి.

 కానీ సినిమాలో పాటగా కన్నా తరువాత ఘంటసాలగారు ప్రైవేట్ రికార్డుగా పాడిన పోలీసెంకటసామి పాటే ప్రజల మనసుల్లోకి ఇంకిపోయింది.
'నిను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీసెంకటసామి...' అంటూ ఆపాటలో ఘంటసాల గొంతు (స్త్రీ  పాత్ర పరంగా పలికినా) ఎన్ని హొయలు చిలికిందో, ఎన్ని ఎదలను గిలిగింత పెట్టిందో మనకు అనుభవమే..

కానీ ఇక్కడ నేను చెప్పే పోలీసెంకటసామి అతను కాదు. ' తొలికోడి కూసింది' అనే తమిళ చిత్రం తెలుగు అనువాదంలో శరత్ బాబు  పోషించిన పాత్ర పేరు పోలీస్ వెంకటసామి.

ఆత్రేయ ఈ పాత్రకు ఒక పాట రాసారు. మంచి గమ్మత్తైన పాట అది. పోలీసు ఉద్యోగం చేస్తున్న పాత్ర ప్రేమలో పడితే ఆ పాత్ర పాడుకునే పాట ఇలాగే ఉంటుందని పించేలా.

ప్రతి వృత్తికీ ఆ వృత్తికే ప్రత్యేకమైన పడికట్టు పదాలు (జార్గన్) ఉంటాయి కదా. అలాంటి పోలీసువృత్తిలో ఉన్న పాత్ర వాడే పదాలను వాడుతూనే ఓ ప్రేమగీతం రాసారు ఆత్రేయ.

ఆ పాట సాహిత్యం ఇది...

పోలీసు వెంకటసామి నీకు పూజారయ్యాడు
ప్రేమ పూజారయ్యాడు
పచ్చీసు వయసేనాడో నీకు బక్షీసిచ్చాడు
నిన్నే గస్తీ కాసాడు

డ్యూటీలో ఉండి బ్యూటీ చూసి
సెల్యూట్ చేసాడు
మఫ్టీలో వచ్చి మనస్సులోనే
లాకప్ చేసాడు
మన కేసు ఈ రోజు
నువ్వు ఫైస్ల చేయాలి....

లవ్ చేసేందుకు లైసెన్సుంది
నేను సింగిలు గాణ్ణి
నువు సిగ్నల్ ఇస్తే లగ్నం పెడతా
ఆ పై డబుల్సు గాడి

బ్రేక్ వద్దని లైటు వద్దని
రూల్స్ నేనే మార్చేయనా

నీ ఊసులతో నీ ఊహలతో
ఓవరు లోడై మనసుంది
నీ పై నేను నిలిపిన ప్రేమ
వన్ వే ట్రాఫికు కాదంది

ఛార్జి చేసినా ఫైను వేసినా
వేరే రూటుకు పోనంది

టోపీరంగు కోకను కట్టి
లాఠీ లాంటి జడవేసి
జీపల్లే నువు మాపటి కొస్తే
సైడిస్తాను గదికేసి

కౌగిలింత కష్టడీలో ఖైదు చేసి
విజిలేయనా...

 పాత్ర రూపురేఖలను, స్వభావాన్ని బట్టి పాట రాయడమే కాదు, పాత్ర నోట పలికే పాటలో తన వృత్తిధర్మంగా సహజంగా ఒదిగిపోయే మాటలను ఈ పాటలో ప్రయోగిస్తూ మరో మంచి పోలీసెంకటసామిని రూపుకట్టించారు ఆత్రేయ.

మన 'సు' కవి ఆత్రేయకు జేజేలు.

 (ఈ వేళ  మే 7 -ఆత్రేయ గారి జయంతి)

Monday, April 18, 2011

బుడుగడుగ్గాయ్....

భాషలందు పిల్లల భాష వేరయా....అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ.
దానికి నిరూపణగా బుడుగు పాత్రని కూడా చూపించారు.
బుడుగు నాకు బోల్డు భాషలు వచ్చు అని చెప్తాడు కదా...పిచిక భాష, చిక భాష, క భాష ఇలా చాలా భాషలు బుడుగుకి తెలుసు. అలాగే బుడుగు భాషలో అర్థాలు కూడా వేరు. అవి తను మనకి చెప్తే కాని అర్థంకాని పదాలు, పదార్థాలు.

జాటర్ డమాల్ అంటే  ఏమిటి అర్థం...మనకి, బుడుగు వాళ్ళ నాన్నకి తెలీదు...అంతమాత్రాన దానికి అర్థం ఉండదా ఏమిటి.....జాటర్ డమాల్ అంటే అర్ధం లేదూ అని అర్థం అని బుడుగు చెప్తే మనకి అర్ధమవుతుంది.

మరి బుడుగులాంటి ఓ గడుగ్గాయ్ వాళ్ళ నాన్నని తన భాషతో ఎలా అదరగొట్టేసిందో చూస్తారా...
ఇదిగో ఇక్కడ....
కడుపునిండా నవ్వుకోకపోతే అప్పుడు అడగండి.

బుడుగు లాంటి ఓ గడుగ్గాయి




Friday, April 8, 2011

లైట్ తీసుకో......

              
"హలో... హలో ....."
"హలో  గుడీవినింగ్..........టెక్నికల్ డెస్క్ కి స్వాగతం."
"హలో....నాకు వర్డ్ పర్ఫెక్టుతో ఒక సమస్య వచ్చిందండి."
"మీ సమస్య ఏమిటో చెప్పండి. తప్పకుండా సహాయం చేస్తాం."
"మరేం లేదండీ. నేను మా కంప్యూటర్ లో ఇలా టైప్ చేస్తూ ఉన్నానా...హఠాత్తుగా అక్షరాలన్నీ మాయమయిపోయాయండీ."
"మాయమా....అదెలా."
"అవును....మాయమయిపోయాయి."
"ఓహో...అలాగా. సరే. ఇప్పుడు మీ స్క్రీన్ ఎలా కనిపిస్తోంది ? "
"స్క్రీన్ పైనా...ఏమీ లేదక్కడ."
"ఏమీ లేదా..."
"అవును. అక్కడంతా ఖాళీగా ఉంది.  నేను ఏది టైప్ చేసినా అక్కడ కనిపించడం లేదు."
"మీరు ఇంకా వర్డ్ లోనే ఉన్నారా ? బయటకు వచ్చేసారా "
" నా కర్థం కాలేదు. అది నేనెలా చెప్పగలను? "
"అంటే....అదే... మీకు కంప్యూటర్ మీద సి ప్రామ్ ట్ కనిపిస్తోందా? "
" సీ ప్రామ్టా....అంటే...? "
" సరేలెండి.  స్క్రీన్ మీద కర్సర్ ని ఉంచితే అది  కదులుతోందా? "
" కర్సర్ లేదు ఏంలేదు. చెప్తున్నా కదా - అక్కడ ఏమీ కనిపించడం లేదని "
" సరే. మీ మానిటర్ కి పవర్ ఇండికేటర్ ఉందా? "
" మానిటరా...మానిటర్ అంటే ఏది? "
" అదే టివిలాగా కనిపించే తెరని మానిటర్ అంటారు. దాంట్లోనుంచి కొంచెం వెలుగు వస్తోందా?
అది కనెక్టు అయి ఉన్నట్టు తెలియడానికి ? "
" ఏమో నాకు తెలీదు !! "
" సరే. మీరు మానిటర్ వెనక భాగానికి వెళ్ళి పవర్ వైర్ దానికి తగిలించి ఉందో లేదో చూడండి"
...............
" చూసారా ? "
" తగిలించినట్టే  ఉంది"
" ఓహ్. గ్రేట్ !! అలాగే ఆ వైర్ గోడకి ఉన్న  ప్లగ్ కి తగిలించి ఉందో లేదో చూడండి "
" ఆ......తగిలించి ఉంది "
" మీరు మానిటర్ వెనక నుంచొని చూస్తే మీకు రెండు వైర్లు కనిపిస్తున్నాయా ? " 
" ఊహు.లేదు "
" కాదండీ. రెండు వైర్లు ఉంటాయి. ఒకసారి ఆ మానిటర్ వెనక్కి వెళ్ళి రెండు వైర్లు ఉన్నాయో లేదో చూడండి "
"ఆ ....ఇక్కడ ఉంది "
" ఆ ...ఆ వైర్ ని మీ కంప్యూటర్ కి తగిలించి ఉందో లేదో చూడండి "
" ఊహు....నాకు అందడం లేదు "
" అవునా. సరే అది అక్కడ ఉన్నట్టు కనిపిస్తోందా "
" లేదు. నాకు అంతదూరం కనిపించడం లేదు "
" కొంచెం మోకాళ్ళమీదకు వంగి గాని , గోడకు చేరబడో  చూడగలరేమో చూడండి "
" లేదు. నేను చూడలేను. నాకు ఆ భంగిమలో చూడడం రాదు. పైగా ఇక్కడ చీకటిగా ఉంది !! "
" చీకటా....? "
" అవును..ఆఫీస్ లో లైట్లన్నీ ఆఫ్ చేసేసారు. కిటికీ లోంచి వస్తున్న వెలుగు మాత్రమే ఇక్కడుంది "
" అయితే లైట్ వేసుకోండి "              
" ఊహు....."
" వెయ్యరా...... ఎందుకని...?? "                                                                                                  
" ఎందుకంటే ....మరి కరెంట్ లేదు. పోయిందిగా.."
" కరెంట్......కరెంట్ లేదా...పోయిందా...ఆహా....సరే. ఇప్పుడు మాకు  మీ సమస్య ఏమిటో అర్థం అయింది "
" ఇప్పుడేం చెయ్యమంటారు మరి ? "
" మీరు కంప్యూటర్ కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాకేజి బాక్సులు అన్నీ అలాగే ఉన్నాయా ? "
" ఓ...అన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. అన్నీ అల్మైరాలో  దాచి ఉంచాను "
" మంచి పని చేసారు. వెళ్ళి వాటిని బయటకి తియ్యండి. కంప్యూటర్ కి ఉన్న ప్లగ్లన్నీ తీసి జాగ్రత్తగా మీరు షాప్ లో కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ప్యాక్ చేసి పెట్టండి "
" అవునా...కంప్యూటర్ లో అంత సమస్య ఉందా...పాడయిపోయిందా? "
" అవును...అలాగే  కనిపిస్తోంది "
" అలాగా....సరే మరి. ఆ షాప్ వాళ్ళకి సమస్య ఏమిటీ అంటే ఏం చెప్పను ? "
" కంప్యూటర్ వాడడానికి అర్హత లేని ఒక వెధవనని  నేనూ...   అని    ............చెప్పండి!!

Monday, March 14, 2011

అతడే ఒక సైన్యం!!


93 ఏళ్ళ క్రితం 1918 లో తీసిన ఫోటో ఇది. ఇంకా దీనిని మనం చూడగలుగుతున్నామంటే చాలా ఆశ్చర్యమే.
లోవా లో కాంప్ డాడ్జ్ అనే యుద్ధానికి సంబంధించిన ట్రైనింగ్ కాంప్ లో 18,000మంది సైనికులు దీనిని రూపొందించారు.
ఇది ప్రసిద్ధి పొందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  శిలారూపానికి - అబ్బురపరచే  మానవ ప్రతిరూపం.
హ్యూమన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.

ఇక ఈ బొమ్మకు సంబంధించిన ఇతర  వివరాలు, విశేషాలు  తెలుసుకోవాలంటే...
అడుగు భాగం బేస్ నుంచి భుజం వరకు 150 అడుగులు.
కుడి చెయ్యి 340 అడుగులు.
టార్చిని పట్టుకున్న చేయి భాగం అన్నిటిలోకి వెడల్పయినది 12  ½ అడుగులు.
కుడి బొటన వేలు 35 అడుగులు
శరీరం మధ్యభాగం 29 అడుగులు
ఎడమ చేయి పొడుగు 30 అడుగులు
ముఖం 60 అడుగులు
ముక్కు 21 అడుగులు
తలపైని కిరీట భాగం 70 అడుగులు,
టార్చి, దాని పై మంట కలిపి 980 అడుగులు
టార్చిపై మంట  భాగంలో నిలబడిన మనుష్యుల 12,000
టార్చిభాగంలో నిలబడిన వారు 2800
కుడి భుజంలో నిలబడిన వారు 1200
 కిరీటం,టార్చి, చేతులు వదిలేస్తే శరీరం, తలమిగిలిన చోట్ల నిలబడినవారు 2000.  
మొత్తం..........18,000 మంది సైనికులు ఒకచోట చేరి ఈ రూపాన్ని ఏర్పరిచారు.

అద్భుతం కదూ.