Monday, April 18, 2011

బుడుగడుగ్గాయ్....

భాషలందు పిల్లల భాష వేరయా....అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ.
దానికి నిరూపణగా బుడుగు పాత్రని కూడా చూపించారు.
బుడుగు నాకు బోల్డు భాషలు వచ్చు అని చెప్తాడు కదా...పిచిక భాష, చిక భాష, క భాష ఇలా చాలా భాషలు బుడుగుకి తెలుసు. అలాగే బుడుగు భాషలో అర్థాలు కూడా వేరు. అవి తను మనకి చెప్తే కాని అర్థంకాని పదాలు, పదార్థాలు.

జాటర్ డమాల్ అంటే  ఏమిటి అర్థం...మనకి, బుడుగు వాళ్ళ నాన్నకి తెలీదు...అంతమాత్రాన దానికి అర్థం ఉండదా ఏమిటి.....జాటర్ డమాల్ అంటే అర్ధం లేదూ అని అర్థం అని బుడుగు చెప్తే మనకి అర్ధమవుతుంది.

మరి బుడుగులాంటి ఓ గడుగ్గాయ్ వాళ్ళ నాన్నని తన భాషతో ఎలా అదరగొట్టేసిందో చూస్తారా...
ఇదిగో ఇక్కడ....
కడుపునిండా నవ్వుకోకపోతే అప్పుడు అడగండి.

బుడుగు లాంటి ఓ గడుగ్గాయి




Friday, April 8, 2011

లైట్ తీసుకో......

              
"హలో... హలో ....."
"హలో  గుడీవినింగ్..........టెక్నికల్ డెస్క్ కి స్వాగతం."
"హలో....నాకు వర్డ్ పర్ఫెక్టుతో ఒక సమస్య వచ్చిందండి."
"మీ సమస్య ఏమిటో చెప్పండి. తప్పకుండా సహాయం చేస్తాం."
"మరేం లేదండీ. నేను మా కంప్యూటర్ లో ఇలా టైప్ చేస్తూ ఉన్నానా...హఠాత్తుగా అక్షరాలన్నీ మాయమయిపోయాయండీ."
"మాయమా....అదెలా."
"అవును....మాయమయిపోయాయి."
"ఓహో...అలాగా. సరే. ఇప్పుడు మీ స్క్రీన్ ఎలా కనిపిస్తోంది ? "
"స్క్రీన్ పైనా...ఏమీ లేదక్కడ."
"ఏమీ లేదా..."
"అవును. అక్కడంతా ఖాళీగా ఉంది.  నేను ఏది టైప్ చేసినా అక్కడ కనిపించడం లేదు."
"మీరు ఇంకా వర్డ్ లోనే ఉన్నారా ? బయటకు వచ్చేసారా "
" నా కర్థం కాలేదు. అది నేనెలా చెప్పగలను? "
"అంటే....అదే... మీకు కంప్యూటర్ మీద సి ప్రామ్ ట్ కనిపిస్తోందా? "
" సీ ప్రామ్టా....అంటే...? "
" సరేలెండి.  స్క్రీన్ మీద కర్సర్ ని ఉంచితే అది  కదులుతోందా? "
" కర్సర్ లేదు ఏంలేదు. చెప్తున్నా కదా - అక్కడ ఏమీ కనిపించడం లేదని "
" సరే. మీ మానిటర్ కి పవర్ ఇండికేటర్ ఉందా? "
" మానిటరా...మానిటర్ అంటే ఏది? "
" అదే టివిలాగా కనిపించే తెరని మానిటర్ అంటారు. దాంట్లోనుంచి కొంచెం వెలుగు వస్తోందా?
అది కనెక్టు అయి ఉన్నట్టు తెలియడానికి ? "
" ఏమో నాకు తెలీదు !! "
" సరే. మీరు మానిటర్ వెనక భాగానికి వెళ్ళి పవర్ వైర్ దానికి తగిలించి ఉందో లేదో చూడండి"
...............
" చూసారా ? "
" తగిలించినట్టే  ఉంది"
" ఓహ్. గ్రేట్ !! అలాగే ఆ వైర్ గోడకి ఉన్న  ప్లగ్ కి తగిలించి ఉందో లేదో చూడండి "
" ఆ......తగిలించి ఉంది "
" మీరు మానిటర్ వెనక నుంచొని చూస్తే మీకు రెండు వైర్లు కనిపిస్తున్నాయా ? " 
" ఊహు.లేదు "
" కాదండీ. రెండు వైర్లు ఉంటాయి. ఒకసారి ఆ మానిటర్ వెనక్కి వెళ్ళి రెండు వైర్లు ఉన్నాయో లేదో చూడండి "
"ఆ ....ఇక్కడ ఉంది "
" ఆ ...ఆ వైర్ ని మీ కంప్యూటర్ కి తగిలించి ఉందో లేదో చూడండి "
" ఊహు....నాకు అందడం లేదు "
" అవునా. సరే అది అక్కడ ఉన్నట్టు కనిపిస్తోందా "
" లేదు. నాకు అంతదూరం కనిపించడం లేదు "
" కొంచెం మోకాళ్ళమీదకు వంగి గాని , గోడకు చేరబడో  చూడగలరేమో చూడండి "
" లేదు. నేను చూడలేను. నాకు ఆ భంగిమలో చూడడం రాదు. పైగా ఇక్కడ చీకటిగా ఉంది !! "
" చీకటా....? "
" అవును..ఆఫీస్ లో లైట్లన్నీ ఆఫ్ చేసేసారు. కిటికీ లోంచి వస్తున్న వెలుగు మాత్రమే ఇక్కడుంది "
" అయితే లైట్ వేసుకోండి "              
" ఊహు....."
" వెయ్యరా...... ఎందుకని...?? "                                                                                                  
" ఎందుకంటే ....మరి కరెంట్ లేదు. పోయిందిగా.."
" కరెంట్......కరెంట్ లేదా...పోయిందా...ఆహా....సరే. ఇప్పుడు మాకు  మీ సమస్య ఏమిటో అర్థం అయింది "
" ఇప్పుడేం చెయ్యమంటారు మరి ? "
" మీరు కంప్యూటర్ కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాకేజి బాక్సులు అన్నీ అలాగే ఉన్నాయా ? "
" ఓ...అన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. అన్నీ అల్మైరాలో  దాచి ఉంచాను "
" మంచి పని చేసారు. వెళ్ళి వాటిని బయటకి తియ్యండి. కంప్యూటర్ కి ఉన్న ప్లగ్లన్నీ తీసి జాగ్రత్తగా మీరు షాప్ లో కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ప్యాక్ చేసి పెట్టండి "
" అవునా...కంప్యూటర్ లో అంత సమస్య ఉందా...పాడయిపోయిందా? "
" అవును...అలాగే  కనిపిస్తోంది "
" అలాగా....సరే మరి. ఆ షాప్ వాళ్ళకి సమస్య ఏమిటీ అంటే ఏం చెప్పను ? "
" కంప్యూటర్ వాడడానికి అర్హత లేని ఒక వెధవనని  నేనూ...   అని    ............చెప్పండి!!

Monday, March 14, 2011

అతడే ఒక సైన్యం!!


93 ఏళ్ళ క్రితం 1918 లో తీసిన ఫోటో ఇది. ఇంకా దీనిని మనం చూడగలుగుతున్నామంటే చాలా ఆశ్చర్యమే.
లోవా లో కాంప్ డాడ్జ్ అనే యుద్ధానికి సంబంధించిన ట్రైనింగ్ కాంప్ లో 18,000మంది సైనికులు దీనిని రూపొందించారు.
ఇది ప్రసిద్ధి పొందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  శిలారూపానికి - అబ్బురపరచే  మానవ ప్రతిరూపం.
హ్యూమన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.

ఇక ఈ బొమ్మకు సంబంధించిన ఇతర  వివరాలు, విశేషాలు  తెలుసుకోవాలంటే...
అడుగు భాగం బేస్ నుంచి భుజం వరకు 150 అడుగులు.
కుడి చెయ్యి 340 అడుగులు.
టార్చిని పట్టుకున్న చేయి భాగం అన్నిటిలోకి వెడల్పయినది 12  ½ అడుగులు.
కుడి బొటన వేలు 35 అడుగులు
శరీరం మధ్యభాగం 29 అడుగులు
ఎడమ చేయి పొడుగు 30 అడుగులు
ముఖం 60 అడుగులు
ముక్కు 21 అడుగులు
తలపైని కిరీట భాగం 70 అడుగులు,
టార్చి, దాని పై మంట కలిపి 980 అడుగులు
టార్చిపై మంట  భాగంలో నిలబడిన మనుష్యుల 12,000
టార్చిభాగంలో నిలబడిన వారు 2800
కుడి భుజంలో నిలబడిన వారు 1200
 కిరీటం,టార్చి, చేతులు వదిలేస్తే శరీరం, తలమిగిలిన చోట్ల నిలబడినవారు 2000.  
మొత్తం..........18,000 మంది సైనికులు ఒకచోట చేరి ఈ రూపాన్ని ఏర్పరిచారు.

అద్భుతం కదూ.

Sunday, March 6, 2011

చూడు చూడు తమాషా...భలే తమాషా...

చూడు చూడు తమాషా భలే తమాషా...
వేడుకైన తమాషా వేళ్ళ తమాషా
అయిదు వేళ్ళ తమాషా...
పాట గుర్తుందా. బాలరాజు కథ సినిమాలో పిల్లలు వేళ్ళమీద బొమ్మలు వేసుకొని కథలు చెప్పుకుంటూ ఆడుకుంటారు.
మనం కూడా చిన్నప్పుడు  అరచేతి లో వేళ్లకొసల మీద  బొమ్మలు వేసుకొని, ఇంక్ పూసుకొని పొడుగోడు, పొట్టోడు అంటూ కథలు చెప్పుకున్న వాళ్ళమేగా.

 పాపం బాల్ పెన్నులు వచ్చేసాక ఇప్పటి పిల్లలకి ఈ ఇంక్ ఆటలు లేనట్టుంది.
  ఇక్కడ ఇలా చూడండి.
రంగుల కలయిక ఎన్ని కొత్త రూపాలను అమోఘంగా  ఆవిష్కరించిందో.
నిజంగా  అద్భుతం కదూ !!



















Thursday, December 30, 2010

ఇవీ అవేనా....

నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారు ఆరుద్ర..
ఇటీవలి కాలంలో రైళ్ళకన్నా ఈ జీవిత సత్యం సిటీ బస్సులకు మాత్రం తప్పకుండా వర్తిస్తోంది.
ప్రతిరోజూ బస్టాపుల్లో గంటలతరబడి బస్సులకోసం ఎదురుచూడడం, తీరా ఆ బస్సు వచ్చినా దాని కోసం నిర్దేశించిన స్థలంలో అది ఆగక దూరంగా ఆగడం, అందుకోవడం కోసం పరుగులు పెట్టడం సగటు మధ్యతరగతి జీవులకి మామూలే. తీరా బస్ ఎక్కలేక పోతే నిరాశతో వెనక్కి వచ్చినా కూర్చోవడానికి సరైన చోటు లేక నిలబడి ఉండవలసిందే. చాలా బస్టాపులు దుర్గంధానికి నిలయాలు. మారు మూల ప్రాంతాలలో అంటే అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద రోడ్ల కూడళ్ళు జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలు అన్నిటిలోనూ  బస్టాపులన్నీ అశుభ్రత కి చిరునామాలే.
బస్సులో ప్రయాణం అనే శిక్షలో ఎండకు ఎండుతూ, వర్షానికి నానుతూ, చలికి ఒణుకుతూ బస్టాపుల్లో బస్సులకోసం గంటలతరబడి నిరీక్షించడం కూడా ఒక భాగం.

ఒక వర్షం రోజున హైదరాబాద్ హైకోర్టు పక్కన కొంతమంది బస్ కోసం నిరీక్షిస్తున్న దృశ్యం ఇది.

 అయితే  చాలా దేశాలలో బస్ స్టాపులను ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో చూస్తే చాలా ముచ్చటేసింది.  నిరీక్షణలో కూడా ఎంత  సుఖముందో కదా అనిపించక మానదు ......ఇక్కడ కొన్ని బస్టాపులను చూస్తే.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో బస్టాపులు ఎలాఉన్నాయో చూడండి. కొన్ని ఇప్పటికే నిర్మించబడి వాడుకుంటున్నవి కాగా మరికొన్ని కొత్తగా డిజైన్ చేయబడినవి. మన భారతదేశంలో కూడా ఇలాంటి బస్టాపులు చూడాలంటే మరెంత కాలం పడుతుందో....!!!!!!